
ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ నిరసన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ఆగ్రహించారు. మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది లైట్లు తీసేశారన్నారు. వర్షం కారణంగా స్టేడియం బురదగా ఉందన్నా పట్టించుకోలేదని తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి చేయలేదన్నారు. మైక్ మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రౌండ్ మెన్స్ కూడా లేరన్నారు. జిమ్‌లోని కొన్ని పరికరాలు ఎంతో కాలంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేడియంలో ఆటలకు బదులు రాజకీయాలు నడుస్తున్నాయని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడి సభ్యులను కలుపుకొని బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, అత్యాధునిక పరికరాలతో జిమ్, స్టేడియం సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఒక్క కొత్త పని కూడా పూర్తి చేయలేదు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికలు కూడా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే రద్దయ్యాయి. కమిటీ వస్తే స్టేడి యం అభివృద్ధి చెందుతుందని భావించిన సభ్యుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. స్టేడియం నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి. అంటే ప్రభుత్వానికి సొంతం. కొందరు వ్యక్తులు మాత్రం స్టేడియం తమదే అన్నట్లు వ్యవహరించడాన్ని పలువురు సభ్యులతోపాటు క్రీడాకారులు తప్పుబడుతున్నారు. ఇప్పటికై నా రాజకీయాలు ఆపి క్రీడలను ప్రోత్సహిస్తే మేలని ప్రజలు పేర్కొంటున్నారు.