
ఆర్థిక సేవల్లో నిపుణుడు డాక్టర్ నాగరాజు మద్దిరాల
తెనాలి: ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ పర్యాయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు బహూకరించనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటయే సభకు ఫౌడేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా నాగరాజు మద్దిరాలకు అవార్డును ప్రదానం చేస్తారు. ఇదే వేదికపై నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేస్తారు.
తెలుగుతేజం
నాగరాజు మద్దిరాల ఆకివీడు దగ్గర్లోని ఆలపాడు గ్రామంలో 1966లో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ కోర్సు చేశారు. 27 ఏళ్ల వయసులో త్రిపుర కేడర్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అదే రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆర్థిక, పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వంటి కీలక పదవులు నిర్వహించారు. ఆయన హయాంలోనే 2016లో త్రిపుర, ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ స్మాల్ స్టేట్ ఇన్ ఈ–గవర్నెన్స్’గా గుర్తింపును పొందింది. అదే సంవత్సరంలో రాష్ట్రంలో శిశు మరణాల రేటును 26 నుంచి 21కు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్రిపురకు రెండో బహుమతి లభించింది. 2004–08లో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలో జపాన్, ఉత్తర అమెరికా, ప్రపంచ బ్యాంక్ విభాగాల్లో డైరెక్టర్‌గానూ నాగరాజు చేశారు. 2008 – 12లో వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, సలహాదారుగానూ వ్యవహరించారు. బొగ్గు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అనే చారిత్రక మైలురాయిని చేరుకునేలా చేశారు. ప్రస్తుతం ఆర్థిక సేవలశాఖ కార్యదర్శిగా ఆ రంగ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
నేడు తెనాలిలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు స్వీకరణ