
రేపు నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సం ఈనెల 10న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభకు సంస్థ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగ కార్యదర్శి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో చైన్నెలోని సీఎల్‌ఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి.కాంత్, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొంటారు.
తెనాలి ముద్దుబిడ్డ
తెనాలికి చెందిన విలక్షణ మహనీయుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ ఒకరు. విదేశాల్లో ఉన్నతవిద్య చదువుకుని, అక్కడే ఉద్యోగావకాశం లభించినా, కాదనుకుని మాతృదేశం వచ్చారు. చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్‌ఆర్‌ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. తన కృషితో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తోలు పరిశ్రమ రంగంలో సాధించిన విజయాలతో 48 జాతీయ పరిశోధనాశాలలు, 30 వేల శాస్త్రవేత్తలు కలిగిన సీఎస్‌ఐఆర్‌కు డైరెక్టర్ జనరల్‌గా చేశారు. శాస్త్ర విజ్ఞాన అధ్యయనాలు, పరిశోధనలపై ఎంతో నిబద్ధత కలిగిన డాక్టర్ నాయుడమ్మ, దేశమంతా శాసీ్త్రయ అభినివేశం లోతుగా విస్తరించాలని తపించారు. హేతుబద్ధ చింతన, శాసీ్త్రయ వివేచనా, నిరంతరం అధ్యయనం, నిత్య పరిశోధన ఆయన జీవ ధాతువులు. సామాజిక విషయాల్లోనూ శాసీ్త్రయ అభినివేశాన్ని ప్రదర్శించటం నాయుడమ్మ ఆశయం. మూఢ విశ్వాసాల్నీ ముహూర్త బలాల్నీ వీడి, మనిషి చైతన్యం, వ్యక్తిత్వం వికసించే మానవీయ సమత వైపు అడుగిడటం ఆయన కర్పించే నిజమైన నివాళి. అలాగే ఆయన పేరిట అవార్డులకూ శాస్త్రవేత్తలనే ఎంపిక చేస్తే సబబుగా ఉంటుంది.