
వివాహిత అనుమానాస్పద మృతి
మార్టూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని బబ్బేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. అందిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం విప్పర్ల గ్రామానికి చెందిన పఠాన్ మీరాబీ (25)కి బబ్బేపల్లికి చెందిన పఠాన్ కరీముల్లాతో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా మీరాబీ బబ్బేపల్లి గ్రామంలోనే ఉంటున్న తన అక్క ఇంట్లో వారం రోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కరీముల్లా మీరాబి అక్క నివాసానికి వెళ్లి తన భార్యను సరిగ్గా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో జరిగిన ఓ ఫంక్షన్‌కు ఇద్దరూ హాజరై తిరిగి వచ్చారు. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా కరీముల్లా కొంతసేపటికి ఇంటికి తలుపు వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 6 గంటల ఇంటికి వచ్చి తలుపు తీసి చూసిన మీరాబీ తమ్ముడు అచేతనంగా నేలపై పడి ఉన్న అక్కను చూసి కేకలు వేసి స్థానికులను పిలిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మీరాబి మృతి చెందిందని గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం నిందితుడు కరీముల్లాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తన భార్య మీరాబీని తనే హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.