
దళితులపై పెరిగిన దాడులు, దౌర్జన్యాలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. కూటమి ప్రభుత్వంలో దళిత హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. కనీసం నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారని విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో టీడీపీ గూండాలు దాడి చేయడంతో ప్రాణాపాయస్థితిలో గుంటూరు రమేష్ హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరరావును శనివారం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ మన్నవ గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్లాన్ చేశాడని ఆరోపించారు. టీడీపీ నేత బండ్లమూడి బాబూరావుతో హత్యాయత్నం చేయించింది నూటికి నూరుపాళ్లు ఆయనేనని ఆరోపించారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో ధూళిపాళ్ల వాళ్ల పార్టీ నేత బాబూరాబును రెచ్చగొట్టారని తెలిపారు. నాగమల్లేశ్వరరావును అంతం చేయకపోతే పక్కకు తప్పుకోండి.. సన్మానం చేసి మరి బయటకు పంపిస్తానని ధూళిపాళ్ల అనటంతోనే హత్యాయత్నం జరిగిందని వివరించారు.
హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారు ? నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ప్లాన్ వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ధ్వజం
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న నరేంద్ర : అంబటి మురళీకృష్ణ
పొన్నూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను ధూళిపాళ్ళ నరేంద్ర తొలి నుంచి పోత్రహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. దళితులంటే అసలు నరేంద్రకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నో హత్యాకాండలు, ఆత్మహత్యలకు నరేంద్ర నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని మండిపడ్డారు. దాడి కేసులో ఆయన్ను ఏ–1గా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.