
దివ్యాంగురాలిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు.