
నృసింహుని ఆదాయం రూ.57.59 లక్షలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ కానుకలను శనివారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లో ఉన్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 57,59,764 వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 25,52,133, దిగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 30,57,173, ఘాట్‌రోడ్‌లోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 87,409 తోపాటు అన్నదానానికి రూ. 63,049 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. గతంలో కంటే రూ.11,95,012 అధికంగా వచ్చినట్లు ఆయన వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు శ్రీ జగన్నాథస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థ్ధానాల సహాయ కమిషనర్ డి.సుభద్ర పర్యవేక్షించారు.
ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్
మంగళగిరి: ఎయిమ్స్‌లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన పలు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.