నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు ఆదివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన సాయి చరిత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
నేడు దుర్గగుడి
మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహా మండపంలోని ఏడో అంతస్తులో జరిగే సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్‌ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులను ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.


