తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.
మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ కె.సునీల్ కుమార్ పర్యవేక్షించారు.
వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్ స్టాఫ్, వాచ్‌మెన్, అటెండర్స్ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు.
సమగ్రశిక్ష ఏపీసీగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ)గా ఐ.పద్మావతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.
సాయుధ దళాల నిధికి రూ.లక్ష విరాళం
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు తరఫున రూ.లక్ష చెక్కును జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతులమీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణషీలాకు బ్యాంకు అధికారులు అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడే సైనికుల సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా పంచుకోవాలన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు క్లస్టర్ హెడ్ జె.హరిప్రసాద్, ఎస్‌కె గౌస్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.