
హనుమత్ జయంత్యుత్సవాలు
తెనాలి: స్థానిక మారీసుపేటలోని శ్రీకోదండ రామస్వామివారి దేవస్థానం (రామభక్త అప్పలస్వామిగుడి)లో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామికి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజున స్వామివారికి ఆకు పూజ, ప్రాతఃకాల అర్చన, వడమాల, అప్పలమాల సమర్పించారు. హనుమత్ జయంతి రోజు స్వామివారికి విశేష కార్యక్రమాల్లో భాగంగా భక్తుల చేత పంచామృత అభిషేకం, డ్రై ఫ్రూట్స్ పళ్లరసాలతో అభిషేకం, తమలపాకులతో సహస్రనామావళి పూజ, మామిడి పండ్లతో అష్టోత్తరం, ఎంతో విశేషమైన మన్య సూక్తం హోమం జరిపిస్తున్నట్లు ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలియజేశారు. ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను జరిపించారు.
వీరాంజనేయుడుకి తులసి దళార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయస్వామికి ఈనెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీనుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వామివారికి తులసి దళార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సామూహిక సిందూరార్చన జరిపించారు. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు.

హనుమత్ జయంత్యుత్సవాలు