
పూజల్లో సామాన్య భక్తులకు అవకాశం
పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్‌లో గల శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఐదు రోజులపాటు జరిగే పూజల్లో సామాన్య భక్తులకు రిక్త హస్తం చూపుతున్నారని ‘సాక్షి’లో సోమవారం ‘పెద్దలకే పెద్దపీట’ పేరుతో కథనం వెలువడింది. దీనిపై హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు, ఆలయ అధికారులు స్పందించారు. ఐదు రోజులపాటు జరిగే సేవా కార్యక్రమాల్లో సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా సోమవారం జరిగిన లక్ష తులసి మొక్కల పూజల్లో మహిళలు, సామాన్య భక్తులు పాల్గొన్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై హర్షం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న రశీదుల పరంపర
గతంలోనే ‘సాక్షి’లో నాజ్ సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న పూజలకు రశీదు ఇవ్వడం లేదని కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన లక్ష తులసి దళం పూజకు హాజరైన దాతలు రూ. 5,116, ప్రత్యేక హోమానికి రూ. 5,116, క్షీరాభిషేకానికి రూ. 1,116లు రుసుం చెల్లించారు. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన తరువాత అసిస్టెంట్ కమిషనర్ సుభద్ర ఆలయాన్ని సందర్శించారు. రుసుం చెల్లించకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజలు నిర్వహించేందుకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. దీంతో దీక్ష సమాజం సభ్యులు ప్రతి పూజకు రశీదులు అందిస్తున్నారు.

పూజల్లో సామాన్య భక్తులకు అవకాశం