వ్యాపారంలో వాటా ఇస్తానని.. | - | Sakshi
Sakshi News home page

వ్యాపారంలో వాటా ఇస్తానని..

May 20 2025 1:03 AM | Updated on May 20 2025 1:03 AM

వ్యాపారంలో వాటా ఇస్తానని..

వ్యాపారంలో వాటా ఇస్తానని..

గుంటూరు లక్ష్మీపురంలోని ఓ ట్రేడింగ్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేశా. వచ్చే లాభాల్లో పర్సంటేజీ ఇస్తానని యజమాని నమ్మించాడు. నేను రూ.20 లక్షలు, మరో ఇద్దరు రూ.10 లక్షలు చెల్లించారు. ఏళ్లు గడిచినా తిరిగి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆ ఏరియాలో కార్యాలయం లేదు. తెలిసిన వారి వద్ద అప్పులు, బ్యాంక్‌లో రుణం తీసుకుని అతనికి చెల్లించాను. ఈ క్రమంలో యజమాని భార్య మాతో అమర్యాదగా మాట్లాడుతోంది. వ్యాపారం లాభాల్లో పర్సంటేజ్‌ ఇస్తానని మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలి.

– సబ్బినేని రోజ, వైష్ణవినగర్‌, పొన్నూరు టౌన్‌.

పాప చికిత్సపై విచారణ చేపట్టాలి

గత నెల 9న మా కుమార్తె లాస్య(16)కు జ్వరంలో మూర్ఛలు వచ్చాయి. కొత్తపేట గౌరీశంకర్‌ థియేటర్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అక్కడ నుంచి వారి ఆసుపత్రికి తరలించారు. మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉండాలని అక్కడి వైద్యులు సూచించారు. అదే రోజు రాత్రి వైద్యులు పిలిచి, పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో డిశ్చార్జ్‌ చేయాలని కోరాం. డిశ్చార్జ్‌ చేయడంలో అలస్యమైంది. రాత్రి తొమ్మిది తర్వాత చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించే క్రమంలో 11వ తేదీ ఉదయం పాప మృతి చెందింది. డిశ్చార్జ్‌ విషయంలో నిర్లక్ష్యం, పాపకు అందించిన చికిత్సపై విచారించాలని కోరుతున్నాం.

– లాస్య తల్లిదండ్రులు కల్యాణ్‌, ఉమాదేవీ, మారుతీనగర్‌

బాధితుల సమస్య వింటున్న జిల్లా ఏఎస్పీ రమణమూర్తి

ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు

ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఉద్యోగాల నిమిత్తం నలుగురు విద్యార్థులం కలిసి అతడి వద్దకు వెళ్లాం. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ఒక్కొక్కరూ రూ.1.85 లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో మొత్తమ్మీద రూ.7.40 లక్షలు అతనికి చెల్లించాం. ఈ క్రమంలో చిరునామా లేని ఓ కంపెనీలో ఆఫర్‌ లెటర్లు ఇచ్చారు. ఆ కంపెనీ ఫేక్‌ అని, గతంలోనూ పలువురిని మోసగించినట్లు తెలిసింది. ఉద్యోగాల పేర్లతో మోసగించిన వ్యక్తిని విచారించి తమకు న్యాయం చేయాలి. – సయ్యాద్‌ఖాజా, ఆర్టీసీ కాలనీ

ఆర్మీలో ఉద్యోగమని రూ.34 లక్షలు ...

ఆర్మీ ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా తెలిసిన బంధువు పరిచమయ్యారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పి స్తానని నన్ను, కుటుంబ సభ్యులను నమ్మించారు. నెల్లో ఉద్యోగం వస్తోందని, అందులో వారికి డబ్బులు చెల్లించాలని చెప్పి దఫాల వారీగా రూ.34 లక్షలు తీసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో వైజాగ్‌లోని ఓ రూంలో బస చేయించాడు. తర్వాత అక్కడ నుంచి పంపించేశాడు. దీంతో మోసగించినట్లు తెలిసి డబ్బులు అడిగితే వాయిదాలు వేస్తున్నాడు. పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. పొలం, ఇంటి స్థలం విక్రయించగా వచ్చిన సొమ్ము, అప్పులు చేసిన డబ్బులు అతనికి చెల్లించాను. న్యాయం చేయాలి.

– బాధితుడు, పొన్నూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement