
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు: మహిళపై లైంగిక దాడితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 12న మధ్యాహ్నం సుద్దపల్లి డొంక ప్రగతీ నగర్ 7వ లైనుకు చెందిన మహిళ తల్లి ఇంటికి వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి అమ్మమ్మ రాహెలమ్మ రావడంతో ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి షాబాజ్ పరారయ్యాడు. మరుసటిరోజు 13వ తేదీన నిందితుడు షాబాజ్, ఆయన మేనమామ నాగూల్ మీరా, బంధువులు నాసర్ హుసేన్, హనీఫ్‌లు మహిళ ఇంటి వద్దకు వెళ్లి, జరిగిన విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతోపాటు కులం పేరుతో దూషించి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షేక్‌షాబాజ్‌ను సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ షేక్ అబ్దుల్ రహమాన్, సిబ్బందిని అభినందించారు. నిందితుడు షాబాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.