
పవర్‌ఫుల్ ఉమెన్
పవర్ లిఫ్టింగ్...బరువులెత్తే ఈ క్రీడలో ఇప్పుడు పేదింటి యువతులు రాణిస్తున్నారు. చదువుతో పాటు బరువులు ఎత్తుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నారు. ఆ క్రీడలో ‘స్టామినా’ను చాటుతున్నారు. అలవోకగా బంగారు పతకాలను సాధిస్తున్నారు. తెనాలికి చెందిన షేక్ షబీనా , మదిర షానూన్ ఇందుకు నిదర్శనం. షబీనా అంతర్జాతీయ పోటీల్లో పతకాల వేటలో జైత్రయాత్ర కొనసాగిస్తుంటే, మదిర షానూన్ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పతకాలను సాధించడం మరో విశేషం.
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈనెల 12న ముగిసిన ఆసియా సబ్ జూనియర్, జూనియర్ ఎక్విప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జూనియర్స్ 84 కిలోల విభాగంలో తలపడిన షేక్ షబీనా నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 190 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 85 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 180 కిలోలు, ఓవరాల్‌గా 455 కిలోల బరువులనెత్తి నాలుగింటిలోనూ బంగారు పతకాలను కై వసం చేసుకోవడం విశేషం. ఇదే వేదికపై ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లోనూ కేఎల్ యూనివర్సిటీ తరఫున పాల్గొన్న షబీనా మరో నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్ట్రాంగ్ ఉమెన్ పోటీలో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం రెండు ఈవెంట్లలో కలిపి ఎనిమిది బంగారు పతకాలను షబీనా సాధించింది.
అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట
షబీనాకు అంతర్జాతీయ పోటీల్లో పతకాల సాధన కొత్త కాదు. 2024 మేలో హాంకాంగ్‌లో జరిగిన ఆసియన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ కమ్ ఆసియన్ యూనివర్సిటీ కప్–2024 పోటీల్లోనూ మెరిసింది. జూనియర్ విభాగంలో పోటీ పడిన షబీనా స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో బంగారు పతకాలను సాధించింది. మూడు విభాగాల్లోనూ కలిపి టోటల్‌లోనూ మరో పతకంతో మొత్తం నాలుగు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. గత మూడేళ్లుగా పవర్‌లిఫ్టింగ్‌లో నిలకడగా విజయాలను సాధిస్తున్న షబీనా, 2023 మేలో కేరళలో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. ఆ వెంటనే తమిళనాడులో జరిగిన జాతీయ పోటీల్లో ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించిన చరిత్ర ఉంది. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు, రజత పతకం సాధించింది. ఆసియా పోటీల్లో వరుసగా మూడేళ్లు నాలుగేసి బంగారు పతకాలను గెలుచుకోవడం విశేషం.
కేవీఐకే అకాడమీలో సాధన
2017 కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయిరేవతి, పూసపాటి శివరామకిరణ్‌రాజు శిక్షణలో స్థానిక కేవీఐకే అకాడమీలో షానూన్ సాధన చేస్తోంది. పట్టణానికి చెందిన మదిర ప్రభుదాస్, మదిర నయోమి కుమార్తె షానూన్. కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కోవిడ్ సమయంలో ఫిట్‌నెస్ కోసం ఆమెను కేవీఐకే అకాడెమీలో చేర్పించారు. తనలోని టాలెంట్‌ను గుర్తించిన కోచ్ ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ నుండే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలను సాధిస్తోంది. ఇప్పటివరకు 13 జిల్లాస్థాయి, 12 రాష్ట్రస్థాయి పతకాలు, నాలుగుసార్లు రాష్ట స్ట్రాంగ్ విమెన్ టైటిల్స్‌ను సాధించింది. ‘కాలేజీకి వెళుతూ రోజుకు మూడు గంటల చొప్పున.. పోటీలకు నెల రోజుల ముందు ఉదయం సాయంత్రం మూడేసి గంటల చొప్పున సాధన చేస్తా’ అని షానూన్ వెల్లడించింది.
తల్లి ప్రోత్సాహంతో సాధన
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో
తెనాలి యువతుల సత్తా
ఆసియా పోటీల్లో మెరిసిన బంగారాలు
షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణ పతకాలు
మదిర షానూన్‌కు నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు
పట్టణ ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన ఆటో ఎలక్ట్రీషియన్ మెకానిక్ బుజ్జి, షంషద్‌ల ఏకై క కుమార్తె షబీనా ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ఫస్టియర్ చదువుతోంది. పదో తరగతిలో పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపిన కుమార్తెను తల్లి ప్రోత్సహించింది. కామన్‌వెల్త్ పోటీల్లో బంగారు పతకాలను సాధించిన తెనాలి యువతి జి.సాయిరేవతి శిష్యరికంలో కొంతకాలం సాధన చేసింది. రాష్ట్ర పోటీల్లో పాల్గొని బహుమతులను గెలవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడ నుంచి సాధన మంగళగిరికి మారింది. కోచ్ సంధాని శిక్షణలో సాధన చేస్తోంది. అటు చదువు, ఇటు సాధన మినహా షబీనాకు మరో వ్యాపకం లేకుండాపోయింది. జాతీయస్థాయి పోటీల్లో అప్రతిహతంగా రాణిస్తూ ఇప్పుడు ఆంతర్జాతీయస్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. కామన్‌వెల్త్, ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాలు నెగ్గి, రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది షబీనా లక్ష్యం.

పవర్‌ఫుల్ ఉమెన్

పవర్‌ఫుల్ ఉమెన్