
మేరా భారత్ మహాన్
గుంటూరు మెడికల్: ఉగ్ర దాడులతో భారత్‌ను భయపెట్టాలని పాకిస్థాన్ చూసింది కానీ చివరకు తోక ముడిచిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడంతో పాటు కాల్పులను దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ నుంచి బయలుదేరి ఏసీ కాలేజీ, శంకర విలాస్ బ్రిడ్జి మీదుగా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదంపై తిరుగులేని విజయం సాధించామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయం భారత సైన్యం, ఎన్డీఏ విజయంగా పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ షజీల పాల్గొన్నారు.
తెనాలిలో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ
ఆంధ్రా ప్యారిస్‌లో తిరంగా ర్యాలీ
తెనాలి: పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీని శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని సత్యనారాయణ పార్కు నుంచి బోసు రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 300 మీటర్ల భారత జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.
అమర వీరులకు సంఘీభావంగా
తిరంగా యాత్ర

మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్