
నవతరానికి పుస్తక పఠనం అవసరం
నగరంపాలెం: నవతరానికి పుస్తక పఠనం అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఐదో వీధిలోని గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీసు ఆర్గనైజేషన్ ప్రాంగణంలో శనివారం ఏపీ అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సంబరాల్లో భాగంగా కవితా స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాలు గు పుస్తకాలను ఆవిష్కరించారు. సభకు సాహితీవేత్త భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను నవతరం చదవడం అవసరమని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ సమితి అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఛాయారాజ్, ఎండ్లూరి సుధాకర్, నూతలపాటి గంగాధరం, పఠాభీల కవిత్వాన్ని ఈ తరం సులభంగా చదువుకునేలా అందిస్తున్న అరసం కృషి మరువలేనిదని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకాలు కవి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఉన్నాయని తెలిపారు. అనంతరం యుద్ధం– శాంతి అంశంపై కవితా గోష్టి నిర్వహించారు. బండికల్లు జమదగ్ని, మేడిశెట్టి సుభద్ర, హేమలత, ఎం.లలితకుమారి హజరయ్యారు. కార్యక్రమంలో దివికుమార్, రచయిత్రి మందరపు హైమావతి, అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్