
సోషల్ మీడియా, సైబర్ నేరాల పర్యవేక్షణ కేంద్రం ప్రారంభం
నగరంపాలెం: సోషల్ మీడియా, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్రం నెలకొల్పినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని ఉమేష్ చంద్ర బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిపుణులైన పోలీస్ సిబ్బంది ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు, సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహ శక్తులను గుర్తిస్తారన్నారు. తద్వారా వారి చర్యలను అణచివేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. సామాజిక మాధ్యమాల వాడకం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లేళ్లమూడి వెంకట్, కొల్లా అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), నిస్సార్ బాషా, ఎస్పీ సీసీ ఆదిశేషు, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు.