
ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా ?
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు, మహిళలు జైళ్లలో మగ్గుతున్నారని, నియంతృత్వ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడవని తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో దళిత ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పనతో పాటు మరి కొంతమంది మహిళలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అర్ధరాత్రి మహిళా కానిస్టేబుళ్లను పక్కన పట్టి, సీఐ వాసు కల్పనను కనీసం దుస్తులు కూడా మార్చుకోనీయకుండా, అసభ్యంగా మాట్లాడుతూ ఇంట్లోంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మహిళలను ఉదయం 6 గంటల తరువాత అదుపులోకి తీసుకోవాలని, అది కూడా మహిళా ఇన్‌స్పెక్టర్ ఉండాలన్నారు. ఎవరూ లేకుండా కూటమి నాయకుల మెప్పు కోసం సీఐ వాసు ఇలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడతల రజనీని కూడా ఎటువంటి నిర్ధారణ లేని కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ప్రశ్నించిన రైతులు, మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా పంపించుకుంటూ పోతే జైళ్లన్నీ నిండిపోతాయని చెప్పారు. త్వరలోనే అఖిల పక్షం ఆధ్వర్యంలో ‘జైల్ భరావో’ కార్యక్రమం నిర్వహిస్తామని, తామంతా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గంలో దళితులను అగ్రవర్ణాలు బహిష్కరణకు గురిచేసినా కనీసం ఉప ముఖ్యమంత్రి నోరు మెదపలేదని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేకచోట్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సెల్ నాయకులు ఈదులమూడి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఒకవైపు పోరాటం నిర్వహిస్తూ మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సలహా మేరకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు ఈపూరి ఆదాం, తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు, గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు మేడ వెంకటేశ్వరరావు (పండు), బాలసాని అనిల్, బత్తుల దాసు, పెరికే బాబు, అమృతరావు, కాండ్రు నాగరాజు, ఇసుకపల్లి అనిల్, బేతం భాస్కర్, చిన్నం అనిల్, బుర్ర శ్రావణ్, గంజి షణ్ముఖ, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు రైతులు, మహిళలు అనే తేడా లేకుండాకేసులు నమోదు తప్పుడు కేసులు పెట్టినప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి