
రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూడవ దశ పోరాటంలో భాగంగా ఈనెల 14న విజయవాడలో తలపెట్టిన ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కన్నావారితోటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడారు. 117 జీవో రద్దుతో పాటు, పాఠశాల విద్యారంగంలో పూర్వ విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయకుండా, తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం సరైనది కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. బదిలీల్లో అన్ని కేడర్ల వారీగా ఖాళీలు చూపుతామని చెప్పి, ప్రస్తుతం ప్రతి మండలంలో కొన్ని ఖాళీల చొప్పున బ్లాక్ చేసేందుకు నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ చాంద్ బాషా, మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20, ఉన్నత పాఠశాలలో 45 మందికి రెండవ సెక్షన్, ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలల్లో సైతం గందరగోళ పరిస్థితులను తెచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఉదాసీనత విడనాడనాడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మూడు జిల్ల్లా శాఖల ప్రధాన బాధ్యులు మహమ్మద్ ఖాలీద్, ఉస్మాన్, విజయబాబు, సీనియర్ నాయకులు జి.దాస్, ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, చక్కా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ చెట్టిపోగు లక్ష్మణ్ కుమార్, మాలకొండయ్య, పి.శివరామకృష్ణ పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు