
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
● త్వరగా నిర్మాణ పనులు పూర్తి ● కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
నెహ్రూనగర్: అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో సాధ్యమైనంత త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం శంకర్ విలాస్ పునఃనిర్మాణ పనులకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో కలిసి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయని..వాటిన్నింటిని తీరుస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణంతో కొంత మేర ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నప్పటికీ సహకరించాలని ఆయన కోరారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శంకర్‌విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జీవనోపాధి దెబ్బతినే వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని తెలిపారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాల్ని నగరపాలక సంస్థ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ నేతల అసంతృప్తి
శంకర్ విలాస్ బ్రిడ్జి శంకుస్థాపనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావుకు ప్రాధాన్యత కల్పించక పోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిలాఫలకం వద్దకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని ఆహ్వానించకుండానే శంకుస్థాపన చేయడంపై మండిపడ్డారు.