ఏమీ సేతుము చంద్రా..? | - | Sakshi
Sakshi News home page

ఏమీ సేతుము చంద్రా..?

May 7 2025 2:20 AM | Updated on May 7 2025 2:20 AM

ఏమీ స

ఏమీ సేతుము చంద్రా..?

గుంటూరు ఎడ్యుకేషన్‌: అరండల్‌పేట, బ్రాడీపేట మీదుగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ వెళుతున్న శంకర్‌విలాస్‌ సెంటర్‌ ఆర్‌ఓబీకి ఘన చరిత్ర ఉంది. 1958లో నిర్మించిన ఈ ఆర్‌ఓబీ దశాబ్దాల తరబడి గుంటూరు ప్రజల ట్రాఫిక్‌ అవసరాలను తీర్చుతూ, రవాణాలో కీలకంగా మారింది. 67 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు లైన్లతో కూడిన ప్రస్తుత ఆర్‌ఓబీ స్థానంలో నాలుగు లైన్లుగా విస్తరించి నిర్మిస్తున్నామనే కారణం తప్ప, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టాలనే కనీస ఆలోచన, ముందు చూపు కూటమి ప్రభుత్వానికి కొరవడింది. సేతు బంధన్‌ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా కేంద్ర నిధులపై ఆధారపడటం మినహా, గుంటూరు నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదు.

2017లో ప్రతిపాదనలు

2017లో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌, అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యన్న పాత్రుడు శంకర్‌ విలాస్‌ బ్రిడ్జిని విస్తరించి, రూ.167 కోట్లతో లాడ్జి సెంటరు నుంచి హిందూ కాలేజీ జంక్షన్‌ వరకు మెగా ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని, ముందుగా ఆర్‌యూబీ నిర్మిస్తామని ప్రకటించారు. ఇందు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేశారు.

ఐకానిక్‌ కలలు ఆవిరి

నగరంలో పెరిగిన జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాల దృష్ట్యా రోజుకు 50 వేల వాహనాల రవాణా బాధ్యతను మోస్తున్న బ్రిడ్జి స్థానంలో భవిష్యత్తులో వందేళ్ల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ప్రజల ఆకాంక్షగా ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా విద్యా, వైద్యం, వ్యాపార కేంద్రాలు గత 70 ఏళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా ఒక ఐకానిక్‌ నిర్మాణం జరగాలని ప్రజలు కోరుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఐకానిక్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదన, డిజైను రూపకల్పన చేసి, నిర్మాణం చేపడతామని ప్రకటించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య రీత్యా ఈ రహదారిని ఆరులైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందుకనే నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించి రెండు ఆర్‌యూబీ ఏర్పాటు చేసి ప్రజల అవసరాన్ని ఆకాంక్షలు తీరుస్తామని గతంలో ప్రకటించారు.

ప్రస్తుత డిజైనుతో వాటిల్లే నష్టాలు

930 మీటర్లకు కుదించిన బ్రిడ్జి కోసం 120 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు అవసరమని 1.5 కిలోమీటర్ల మేర విస్తరణ చేస్తున్నారు. 70 అడుగుల వెడల్పుతో 930 మీటర్ల నిడివితో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. నాలుగు లైన్ల బ్రిడ్జి మధ్యలో 3.36 అడుగుల డివైడర్‌ రానున్నది. ఆర్‌ఓబీ నిర్మాణానికి రెండు, మూడేళ్లు పట్టనుంది. ఇటీవల మూడు వంతెనల వద్ద అదనపు ట్రాక్‌ నిర్మాణానికి మూడు నెలల పాటు రహదారిని మూసి వేసిన సమయంలో ట్రాఫిక్‌ కష్టాలను చవి చూసిన ప్రజలకు శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ నిర్మాణం పేరుతో ప్రభుత్వం అదిపెద్ద షాక్‌ ఇవ్వనుంది. రెండు, మూడేళ్లపాటు గుంటూరు నగరంలో ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారనుంది. ఇన్ని సమస్యలతో ముడిపడి ఉన్న దృష్ట్యా, హడావుడిగా కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శంకర్‌విలాస్‌ మెగాఫ్లై ఓవర్‌ సాధన జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై గత కొంత కాలంగా జేఏసీతో పాటు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తూ, బుధవారం ఏసీ కళాశాల ఎదుట రూ.98 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

శంకర్‌ విలాస్‌ ఆర్‌ఓబీ

రూ.98 కోట్లతో సరి

ప్రజల్లో అసంతృప్తి

నగర ప్రజల రవాణా అవసరాలను తీర్చే మెగా ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టును పక్కనపెట్టి, సాధారణ ఆర్వోబీని నిర్మించేందుకు హడావుడిగా చేస్తున్న పనులతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. బ్రిడ్జి అవసరాలను బట్టి నిధులా?., నిధుల కేటాయింపులను బట్టి బ్రిడ్జా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఇదే ప్రభుత్వానికి చెందిన ఎంపీ, మంత్రి ప్రతిపాదించిన రూ.167 కోట్ల ఐకానిక్‌ ఫ్లైఓవర్‌తో పాటు ఆరువైపులా ఆర్‌యూబీలు సైతం ఉన్న పరిస్థితుల్లో ఫ్లై ఓవర్‌ను కుదించడంతో ఒనగూరే లాభం కంటే నష్టమే అధికంగా ఉంది. రెండు కిలోమీటర్లకు పైగా పొడువు కలిగిన మెగా ఫ్లై ఓవర్‌తో ఇరువైపులా వ్యాపార, వర్తక, వైద్య, విద్యాలయాలకు అతి తక్కువ నష్టం వాటిల్లడంతో పాటు ఒకే పిల్లర్‌ ఉండటంతో పాటు ఇరువైపులా రెండు ఆర్‌యూబీలను నిర్మించడం వలన ఫ్లై ఓవర్‌ పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలత్తెకుండా ఉంటాయి.

గుంటూరు ప్రజల చిరకాల వాంఛ అయిన మెగా ఫ్లై ఓవర్‌కు కూటమి ప్రభుత్వం మంగళం పలికింది. తూర్పు, పశ్చిమలను అనుసంధానం చేస్తూ ఎంతో కీలకమైన రవాణా వ్యవస్థ కలిగిన ఆర్‌ఓబీ స్థానంలో కొత్తగా మరొక ఆర్‌ఓబీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన పనులకు నేడు శంకుస్థాపన జరగనుంది. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు అవసరాలతో సంబంధం లేకుండా అరకొర నిధులతో సరిపెట్టేవిధంగా కూటమి నేతలు ముందుకెళుతుండడంపై అన్నివర్గాల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఆర్‌ఓబీని ఫ్లై ఓవర్‌గా మార్చి కట్టలేనివారు ఇక ఐకానిక్‌ బిల్డింగ్‌లు ఎలా కడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

‘సేతుబంధన్‌’ నిధులతో సరి

శంకరవిలాస్‌ మెగా ఫ్లై ఓవర్‌

స్థానంలో సాధారణ ఆర్‌ఓబీ

ఇదేమి చంద్రశేఖరా.. అంటూ

ఎంపీపై నగర ప్రజల మండిపాటు

1958లో నిర్మితమైన ప్రస్తుత ఆర్‌ఓబీ

ఆర్‌యూబీ లేకుండానే నిర్మాణం

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో

ఉంచుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం

కేంద్రంతో పొత్తు ఉన్నా ఆర్‌ఓబీని

మెగా ఫ్లై ఓవర్‌ గా మార్పు

చేయించుకోలేని దుస్థితి

మెగా ఫ్లై ఓవర్‌ను పక్కనపెట్టి

రూ.98 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణానికి

హడావుడిగా ఏర్పాట్లు

అందరూ వ్యతిరేకిస్తున్నా ముందుకు..

నేడు శంకుస్థాపన

కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్‌ పథకం ద్వారా రూ.98 కోట్ల నిధులు మంజూరుకావడంతో హడావుడిగా ఆర్‌ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా ఫ్లై ఓవర్‌కు బదులు సాధారణ ఆర్‌ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం తీసుకున్న చర్యలను నగరంలోని పన్ను చెల్లింపుదారులు, వ్యాపారస్తులు, మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఏమీ సేతుము చంద్రా..?1
1/1

ఏమీ సేతుము చంద్రా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement