
పచ్చకొక్కులు
బియ్యం బొక్కుతున్న
ఎమ్మెల్యే పీఏ దందా
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనుచరుడు, పీఏగా ఉన్న వ్యక్తి ద్వారా ఈ దందా నడుస్తోంది. రేషన్ మాఫియాలో గతంలో ఉన్న వ్యక్తులు మేకల అనిల్, నాగేశ్వరరావు, సుబ్బారావు, శివ అనే వ్యక్తుల ద్వారా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయిస్తున్నాడు. వీరిలో అనిల్ కీలకంగా చెబుతున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దికాలం కిందట నెహ్రునగర్‌కు చెందిన సుబ్బారావుపై కేసు నమోదైంది. ఈ నాలుగు నెలల్లో పాత గుంటూరు, లాలాపేట స్టేషన్ల పరిధిలో కేసులే నమోదు కాలేదు. పూర్తిస్థాయిలో పోలీసులతో కూడా సత్సంబంధాలు ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరుడు సూచించిన వారికే బియ్యం, కందిపప్పు నెలవారీ అందజేస్తున్నట్లు సమాచారం. కార్డుదారులకు కిలోకు ఎనిమిది రూపాయల చొప్పున చెల్లించి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రేషన్ మాఫియా నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ ఎమ్మెల్యేకు ముట్టచెబుతున్నట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే దందా నిరాటంకంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే బియ్యం అమ్మాలంటూ దుకాణదారులపై సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీల్దార్ ఒత్తిళ్లు తేవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒప్పుకోని షాపులపై దాడులు చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఈ దందాపై ఓ డీలర్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో కూరుకుపోవడంతో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది.
సగానికి పైగానే అక్రమార్కుల చేతుల్లోకి...
జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల పరిధిలో 5,99,511 రేషన్ కార్డులున్నాయి. 972 రేషన్ దుకాణాల నుంచి 353 ఎండీయూ వాహనాల ద్వారా నెలకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ప్రజలకు అధికారులు అందించాల్సి ఉంది. అయితే, ఈ మొత్తం బియ్యంలో దాదాపు సగానికి పైగానే అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.43 వెచ్చిస్తోంది. కొందరు ఎండీయూ వాహనదారులు మాఫియాతో చేతులు కలిపారు. పేదల నుంచి కేజీ రూ.15 చొప్పున కొనుగోలు చేస్తూ అధిక మొత్తానికి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.
అధికారులకు సైతం బెదిరింపులు
గుంటూరు పట్టణ పరిధిలో కొందరు దళారులు కూటమి నేతల పేర్లు చెప్పి అధికారులను బెదిరిస్తున్నారు. వారి సాయంతోనే ఎండీయూ వాహనదారుల నుంచి అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనిపై గతంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. మూడు రోజుల ముందు నెహ్రూనగర్‌లోని ఒక ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు కేసులు నమోదు చేయకుండా వదిలేశారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఇద్దరు వ్యక్తులు రేషన్ మాఫియాను నడిపిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. వారికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.
చుండూరులో నిల్వ
పొన్నూరు నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా గుర్తు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నియోజకవర్గంలో నిల్వ చేయడం లేదు. ద్విచక్ర వాహనాల ద్వారా ఒకటి, రెండు క్వింటాలు చుండూరుకు తరలిస్తున్నారు. ఇటీవల పొన్నూరు పట్టణం కేంద్రంగా రేషన్ అక్రమ రవాణా చేసేందుకు రేషన్ మాఫియా మిల్లును ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే, రాజకీయ కారణాలతో అక్రమ రవాణా కార్యకలాపాలు కొనసాగలేదు. దీంతో చుండూరులోని మిల్లును కొన్ని మండలాలకు చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు, చేబ్రోలు మండలాల పరిధిలో పట్టుబడుతున్న బియ్యం ఎక్కువ సంఖ్యలో ఇతర మండలాలకు చెందినవిగా పోలీసులు గుర్తిస్తున్నారు. అవి చుండూరుకే వెళుతున్నట్లు సమాచారం. రేషన్ మాఫియాలో గుంటూరుకు చెందిన సుబ్బారావు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం నేత హత్యలో కూడా పొన్నూరుకు చెందిన రేషన్ మాఫియాను విచారించిన సంగతి తెలిసిందే.
తెనాలిలోనూ మాఫియా తిష్ట
తెనాలిలో రేషన్ అక్రమాలు సుధీర్, అశోక్ చౌదరి ఆధ్వర్యంలో సాగుతున్నాయి. సుధీర్ ఇక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇటీవల మండలంలోని పెదరావూరు గ్రామానికి మకాం మార్చాడు. ఇక్కడ బియ్యం సేకరించి బాపట్ల జిల్లా చుండూరుకు పంపుతున్నాడు. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగి రేషన్ అక్రమార్కులతో చర్యలు జరుపుతున్నారు. నెల నెలా ఎంత ఇస్తారు? పోలీసులకు ఎంత? రెవెన్యూ అధికారులకు ఎంత ఇస్తారు ? అని సుమారు నెల రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. పొన్నూరులో సుమారు ఏడేళ్లుగా ఒకే స్టేషనులో పని చేస్తున్న కానిస్టేబుల్.. డీఎస్పీ స్థాయి వ్యక్తి తనకు బాగా పరిచయం అని చెప్పి రేషన్ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడని పక్కా సమాచారం. ఏడేళ్లలో నల్లపాడు స్టేషన్‌లో మూడు నెలలు, తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల మూడు నెలలు మాత్రమే పని చేశాడు. ఉన్నతాధికారులకు రేషన్ అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇస్తుంటాడు.
తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా వారికే అమ్మాలంటూ డెప్యూటీ తహసీల్దార్ బెదిరింపులు ఇచ్చిన ధరకే కట్టుబడాలంటూ ఒత్తిళ్లు ఒప్పుకోని వారి షాపులపై దాడులు, బియ్యం పట్టివేత ఆఖరికి హత్య కేసుల్లో కూడా రేషన్ మాఫియా వీరయ్య చౌదరి కేసులో పొన్నూరు మాఫియా హస్తం
మంగళగిరిలో రేషన్‌న్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. దళారులు కిలో రూ.12కి కొనుగోలుచేసి, మిల్లర్లకు రూ.25కి విక్రయిస్తున్నారు. మంగళగిరిలో గతంలో ఇంటింటికీ తిరిగి బియ్యం కొనుగోలు చేసి మధ్యలో ఉన్న దళారులకు అమ్మేవాళ్లు. ఇపుడు నేరుగా రేషన్ డీలర్లు రైస్ మిల్లులకు అమ్మేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ మాత్రం మొదట్లో ఒకటి రెండు మిల్లుల్లో హడావుడి చేసి తర్వాత మిన్నకున్నారు.
కలెక్టర్‌కు డీలర్ మొర
చౌటుపల్లి సునీల్ కుమార్ అనే ఎండీయూ వాహనదారుడు రేషన్ మాఫియాపై సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. బేగ్ అనే డెప్యూటీ తహసీల్దార్ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని, అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజాయతీగా సేవలందిస్తున్నప్పటికీ కొందరి మెప్పుకోసం డీటీ తనను టార్గెట్ చేశాడని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. ఈ సంఘటనను బట్టి రేషన్ మాఫియాకు అధికారులు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పచ్చకొక్కులు

పచ్చకొక్కులు