
ఈదురుగాలులు, వర్షంతో రైతులకు తీవ్ర నష్టం
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి
తాడేపల్లి రూరల్: నిన్నమొన్నటి వరకు అకాల వర్షాల కారణంగా ధాన్యం, మొక్కజొన్న, జొన్న రైతులు నష్టపోతే ప్రస్తుతం ఈదురుగాలులు, వర్షం వల్ల అరటి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు, అంజిరెడ్డి కాలనీ, 40 అడుగుల రోడ్డు ప్రాంతాల్లో ఈదురు గాలులకు పడిపోయిన అరటి తోటలను సోమవారం మంగళగిరి నియోజకవర్గ రైతు సంఘం నాయకులు రుక్మాంగరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈదురు గాలుల వల్ల మంగళగిరి నియోజకవర్గంలో అరటి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ఎకరానికి 200 నుంచి 300 చెట్ల వరకు పడిపోయాయని, గెలలు రాని చెట్లు సైతం కొన్నిచోట్ల కూలిపోయాయని చెప్పారు. ఇప్పటి వరకు నష్టాన్ని పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి తాడేపల్లి తహసీల్దార్‌కు, హార్టికల్చర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి జరిగిన నష్టాన్ని వివరించారు. పసుపు కల్లాల్లో ఎండబెట్టారని, అకాల వర్షం కారణంగా ఎర్రనల్లి ఏర్పడిందని, పసుపు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మ నారాయణ రెడ్డి, దొంతిరెడ్డి వీరారెడ్డి, మేకా ప్రసాద్ రెడ్డి, దొంతిరెడ్డి శివరామిరెడ్డి, భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, పులగం సందీప్‌రెడ్డి, శ్రీనివాస్‌రాజు, మల్లేశ్వరరావు, బాలకోటయ్య, తిరుము, రాజ్‌మోహన్ పాల్గొన్నారు.

ఈదురుగాలులు, వర్షంతో రైతులకు తీవ్ర నష్టం