
నిజాయితీ అధికారి సోమేపల్లి
లక్ష్మీపురం: నిజాయితీగల అధికారిగా ప్రభుత్వ సేవలు అందించటంతో పాటు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాన్ని ఏర్పరిచి పలువురు కవులు, రచయితలను గుర్తించి వెలుగులోనికి తెచ్చిన మహామనిషి సోమేపల్లి వెంకటసుబ్బయ్య అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేట సీపీఎం కార్యాలయం కొరటాల సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సోమేపల్లి వెంకటసుబ్బయ్య జయంతి, సాహిత్య పురస్కారాల ప్రదాన సభ ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ గ్రామీణ రైతాంగ ఈతిబాధలను తన రచనల ద్వారా సోమేపల్లి వ్యక్తీకరించారు అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కవిగా, కార్యకర్తగా రాష్ట్ర ప్రజలకు వెంకటసుబ్బయ్య ఎనలేని సేవలందించారన్నారు. తాడేపల్లి గూడెంలో అధికారిగా పేదలకు నివాస గృహాలు అందించిన సందర్భంగా అక్కడి పేదలు తమ కాలనీకి వెంకటసుబ్బయ్య కాలనీగా పేరు పెట్టుకున్నారని కొనియాడారు. తన ఊరుతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై కవిత్వం ద్వారా స్పందించే వారిని వివరించారు. డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు, గుళ్ళపల్లి సుబ్బారావు, కందిమళ్ల శివప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రెక్కలు వచ్చాయి రచయిత్రి సి.యమున, రాఘవరావు దంపతులను ఘనంగా సత్కరించి కథా పురస్కారం అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు ఎస్.ఎం.సుభాని, వశిష్ట సోమేపల్లి, తాటికోల పద్మావతి, దారి వేముల అనిల్ కుమార్, సోమేపల్లి వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్