రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతిస్తున్న మోదీ సర్కార్
లక్ష్మీపురం: రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ దెబ్బతిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నిరసనగా దేశవ్యాప్తంగా మైనారిటీలందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా నరేంద్ర మోదీకి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. త్వరలో క్రైస్తవుల ఆస్తులు పైన కూడా చట్టాలు తీసుకురాబోతున్నారని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లౌకిక వాదాలు, ప్రజాస్వామ్యవాదులు, కార్యకర్తలు, లౌకిక శక్తులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని చెప్పారు. అంబేద్కర్ జయంతి స్ఫూర్తితో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని పోరాటాలకు ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, పుప్పాల సత్యనారాయణ, షేక్ వలి, ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చినాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సుభాని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారు యశ్వంత్ శశి, నగర కార్యదర్శి బన్ని, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి, నగర కార్యదర్శి జి.లక్ష్మి పాల్గొన్నారు.


