జన గుండె చప్పుడు జగన్!
నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అన్ని రంగాలలో సమీకృత ప్రగతి జరిగేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. రెండేళ్లు కరోనా సంక్షోభం వెంటాడినా ఆయన వెనుకంజ వేయలేదు. కరోనా కాలంలోనూ ప్రజలందరికీ అండగా నిలబడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. వలంటీరు వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఇంటి ముంగిటకు సుపరిపాలన అందించడంలో సచివాలయ వ్యవస్థ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. వైఎస్ జగన్ తన పాదయాత్రలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలో కొత్తగా నరసరావుపేట, బాపట్ల కేంద్రాలుగా పల్నాడు, బాపట్ల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. పరిపాలన అందరికీ అందుబాటులోకి వచ్చింది. పలు పథకాలతో తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గుంటూరు నగరాన్ని కూడా రూ. 300 కోట్ల పనులతో అభివృద్ధి బాట పట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 872 గ్రామ సచివాలయాలు, 462 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, 11 వేల మంది సిబ్బందిని నియమించడం జరిగింది. గుంటూరు వైద్య కళాశాలకు మహర్దశ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైద్య కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి నాడు–నేడు కార్యక్రమాల్లో భాగంగా వైద్య కళాశాలకు రూ. 500 కోట్లు మంజూరు చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎనిమిది నూతన పీహెచ్‌సీ భవనాల నిర్మాణం, 77 పీహెచ్‌సీల భవనాల ఆధునీకరణకు రూ.49.24 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 67,678 ఇళ్లు పేదలకు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కింద మరో 3,190 మందికి స్థలాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 65,719 ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. చంద్రబాబు పాలన వచ్చాక గృహనిర్మాణం అటకెక్కింది. పాత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసి క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అన్నింటిని అటకెక్కించింది. దీంతో ప్రజలు మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు.


