కుటుంబానికి కొండంత అండ
ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మొబీన్‌సుల్తానా, షేక్ మస్తాన్ వలిలకు ఇద్దరు సంతానం. కుమార్తె మున్వర్ సుల్తానా, కుమారుడు సుభాని. చిన్న ఫ్యాన్సీ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కుమార్తెను ఇంటర్ చదివించారు. ఉన్నత చదువులు చదివిస్తే రూ.వేలల్లో ఖర్చు అవుతుందని భావించారు. ఆమెకు ఆసక్తి ఉండటంతో బీటెక్ చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కుమారుడి చదువు కూడా పది నుంచి ఇంటర్‌కు వచ్చింది. ఆ ఖర్చు భరించడం తన వల్ల అయ్యే పని కాదని మస్తాన్‌వలికి అర్థమైంది. ఏం చేయాలో పాలుపోని ఆయనకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఊపిరినందించాయి. ఇంట్లో ఉన్న నలుగురిలో ముగ్గురికి సంక్షేమ పథకాలకు అర్హత ఉండటంతో ఫలాలను పొందారు. తండ్రికి జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, కొడుకు ఇంటర్ చదువుతున్నందుకు తల్లికి అమ్మ ఒడి, డ్వాక్రా సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, కుమార్తెకు దివ్యాంగుల పింఛను, వైఎస్సార్ పెన్షన్ కానుకతోపాటు కళాశాల విద్య చదువుతున్నందుకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు వంటివి అందాయి. ఇవి కాక అదే ఇంట్లో ఉంటున్న మస్తాన్‌వలి తాత పెద్ద మొహిద్దీన్‌కు కూడా వైఎస్సార్ పెన్షన్‌కానుక కింద లబ్ధి అందింది. – ప్రత్తిపాడు


