నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం

Dec 21 2025 9:26 AM | Updated on Dec 21 2025 9:26 AM

నేడు

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం

గుంటూరు వెస్ట్‌ : పోలియో బూత్‌కు చిన్నారులను తీసుకురండి... రెండు పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్న పల్స్‌ పోలియో కార్యక్రమం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి ఎ.శ్రావణబాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితతరులు పాల్గొన్నారు.

యువత గ్రీన్‌ స్కిల్స్‌పై దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

నెహ్రూనగర్‌ (గుంటూరు వెస్ట్‌) : యువత గ్రీన్‌ స్కిల్స్‌పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్‌తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థలు, విద్యా సంస్థలు ప్రదర్శనలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు గ్రీన్‌ స్కిల్స్‌, గ్రీన్‌ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇ–వేస్ట్‌ భవిష్యత్తులో పెద్ద సమస్యగా తయారు అవుతుందని, అటువంటి వాటిని రీ సైక్లింగ్‌ చేయడం అత్యవసరన్నారు. ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు మాట్లాడారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

‘నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష’ కథనానికి డీఈవో స్పందన

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, అల్పాహారాన్ని అందించని పరిస్థితులపై ‘నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి డీఈవో షేక్‌ సలీమ్‌ బాషా స్పందించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో రూపొందించి, జెడ్పీకి అందజేసిన స్టడీ మెటీరియల్‌ ప్రస్తుతం ముద్రణ దశలో ఉందని తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో విద్యార్థులకు అల్పాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

శిక్షణ కేంద్రాలకు తరలివెళ్లిన నూతన కానిస్టేబుళ్లు

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : ఇటీవల జిల్లాలో సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు 267 మంది ఎంపిక కాగా, ప్రస్తుతం 220 మంది శనివారం పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ నుంచి పోలీస్‌ శిక్షణ కేంద్రాలు (పీటీసీ), జిల్లా శిక్షణ కేంద్రాలు (డీటీసీ), ఏపీఎస్పీ బెటాలియన్లకు బస్సుల్లో తరలివెళ్లారు. మిగతా 37 మంది నేరుగా కేంద్రాలకు వెళ్తారని, మరో పది మంది త్వరలో వెళ్తారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఎంపికై న వారికి గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. ప్రతి బస్‌కు ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఏఆర్‌ ఎస్‌ఐ లను ఇన్‌చార్జ్‌లుగా నియమించామని అన్నారు. ఈ క్రమంలో శిక్షణకు వెళ్తున్న నూతన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు, ఏఆర్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ శివరామకృష్ణ, ఆర్‌ఐ శ్రీనివాస్‌ (డీఎస్‌డబ్ల్యూ), పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం 1
1/2

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం 2
2/2

నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement