మంగళగిరి టౌన్ /మంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి తరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. కైంకర్యపరులుగా గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న శేష వాహన ఉత్సవం జరిగింది. పొన్న శేష వాహన సేవ కై ంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, అన్నమాచార్య కీర్తనల ఆలాపన భక్తులను ఆధ్యాత్మికోత్సాహంలో ఓలలాడించాయి.
నేడు స్వామి దివ్య కల్యాణ
మహోత్సవం
ప్రధాన ఘట్టమైన స్వామి దివ్య కల్యాణ మహోత్సవం గురువారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం స్వామి అశ్వ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. రాత్రి ఎదురుకోలు ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అనంతరం దివ్య కల్యాణోత్సవం జరుగుతుందని వివరించారు.
పొన్న శేష వాహనంపై చిన్నికృష్ణుడిగా గోపికలతో..