సత్తెనపల్లి: మిచాంగ్ తుఫాన్ ప్రభావం నియోజకవర్గంలో కొనసాగుతుంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీని ప్రభావం మరింతగా ఉండనుందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా నియోజకవర్గ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటుపై నుంచి ఎగువ నుంచి వరద ప్రవహించడం వలన సత్తెనపల్లి మండలం నందిగామ చప్టా పైగా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సత్తెనపల్లి – అమరావతి మధ్య రాకపోకలను మంగళవారం రాత్రి నిలిపి వేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నందిగామ చప్టాపై నుంచి రాకపోకలు నిషేధించడంతో నందిగామ, గుడిపూడి, పెద్దమక్కెన, మీదుగా అమరావతి వెళ్లి, వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.