డ్రాగన్‌ పండుగ

అద్దంకి ప్రాంతంలో సాగు చేసిన డ్రాగన్‌ ఫ్రూట్‌   - Sakshi

అద్దంకి: డ్రాగన్‌ ఫ్రూట్‌.. ఆరేళ్ల కిందట వరకు ఈ పండు గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యం అందరికీ తెలిసింది. అధిక ఔషధ గుణాలు కలిగిన ఫలమిది. దీనిని పిటాయా అని కూడా పిలుస్తారు. దేశంలో మన రాష్ట్రంతోపాటు, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. ఇది బ్రహ్మజెముడు జాతికి చెందిన మొక్క. దీని ఫలంలో అధిక పోషక విలువలు ఉంటాయి. ఈ పండు పైనాపిల్‌, కివీ పండ్ల రుచిని పోలి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సాగుకు సమశీతోష్ణ మండల ప్రాంతాలు బాగా అనుకూలం. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. మన దేశం అత్యంత అనుకూలం. ప్రస్తుతం కిలో రూ.250 వరకు పలుకుతోంది. ఎగుమతి చేస్తే మరింత ధర వచ్చే అవకాశం ఉంది.

జిల్లాలో సాగు వివరాలు..

జిల్లాలోని అద్దంకి, కొరిశపాడు, వేటపాలెం, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో 58 ఎకరాల్లో డ్రాగన్‌ ప్రూట్‌ తోటలు సాగు చేశారు. ఇందులో పింక్‌, వైట్‌, ఎల్లో వంటి రకాలు ఉంటాయి. వాటిలో పింక్‌కు బాగా గిరాకీ ఉంది. పల్నాడు జిల్లా గురజాల ప్రాంతంలో మొక్కలు లభిస్తాయి.

రాయితీ ఇలా..

డ్రాగన్‌ తోటలను ప్రోత్సహించడం కోసం ఉద్యాన శాఖ రాయితీ ఇస్తోంది. హెక్టారుకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, రెండు, మూడో సంవత్సరాలు రూ.10 వేల వంతున మొత్తం రూ.50 వేలు ఇస్తోంది.

తెగుళ్లకు దూరం

ఈ మొక్కను పెద్దగా తెగుళ్లు ఆశించవు. అప్పుడప్పుడు ఫంగస్‌ వంటి తెగుళ్లు ఆశిస్తాయి. ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో అవసరమైన మందులను పిచికారీ చేసి నివారించుకోవచ్చు. షేడ్‌ సమస్యను తొలగించుకోవడం కోసం తోటలో మునగ మొక్కలను సాగు చేస్తే సరిపోతుంది.

సాగు విధానం..

పందిరి పద్ధతిలో నాటే ఈ మొక్కకు 400 నుంచి 420 సిమెంట్‌ పోళ్లు అవసరమవుతాయి. ఒక్కో మొక్క ఖరీదు రూ.80 వరకు ఉంటుంది. మూడేళ్ల వయస్సు తోటల నుంచి మొక్కలను కొనుగోలు చేసి తెచ్చి నాటుకోవచ్చు. హెక్టారుకు 1,100 నుంచి 1,350 వరకు మొక్కలు నాటవచ్చు. అధిక సాంద్రత పద్ధతిలో ఎకరాకు 445 నుంచి 546 మొక్కలను మొక్కకు మొక్కకు 2.5 మీటర్ల దూరం ఉండేలా నాటుతారు. డ్రిప్‌ ఏర్పాటు చేసుకుంటే ఒక్కో మొక్కకు రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు సరిపోతుంది. ఎకరాకు డ్రిప్‌, పోళ్లు, మొక్కలు, ఎరువులతో కలుపుకుని రూ.5 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఒకటిన్నర సంవత్సరానికే కాపునకు వచ్చినా మంచి దిగుబడి రావడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. బాగా ఎదిగిన తోట నుంచి ఎకరాకు 20 నుంచి 30 మెట్రిక్‌ టన్నుల కాయల దిగుబడి వస్తుంది.

బాపట్ల జిల్లాలో విస్తరిస్తున్న పంట

అత్యధికంగా కొరిశపాడు,

అద్దంకి, మార్టూరుల్లో సాగు

ప్రభుత్వ సాయంతో

మరింత పెరిగే అవకాశం

ఔషధ గుణాలు మెండు

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top