పావలా గారడీ!

Vardhelli Murali Article On Chandrababu Naidu And Tdp Party - Sakshi

జనతంత్రం

తెలుగుదేశం పార్టీ కథ మౌసలపర్వంలోకి ప్రవేశించింది. ఈ పర్వానికి ముగింపు మునగడం మాత్రమే! ఆ మునక ఎలా ఉండాలన్నదే ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాద్ధాంతం. తాను కోరుకున్న ముహూర్తానికే తనువు చాలించిన భీష్మాచార్యుని మాదిరిగా పార్టీ ముగింపు ఉండాలని అధినేత అభిమతంగా పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఎవరు కోరుకున్న విధంగా ఉండాలి? అధినేత అండ్‌ ఫ్యామిలీ కోరుకున్న విధంగానా? పార్టీ నాయకశ్రేణి కోరుకునే విధంగానా?.

పార్టీని బేషరతుగా కేంద్ర పార్టీకి అద్దెకివ్వడాని కైనా, టోకున అమ్మివేయడానికైనా సిద్ధంగానే ఉన్నట్టు రూలింగ్‌ ఫ్యామిలీ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని అందజేసింది. అద్దె ప్రసక్తి లేదనీ, పూర్తి స్వాధీనానికే తాము మొగ్గు చూపుతున్నామని ఢిల్లీ నుంచి కబురందిందట. అది కూడా మహాభాగ్యమే. కాకపోతే మావి రెండు విన్నపాలు మన్నించాలని ఇటువైపు నుంచి కూడా ఓ మహజరు వెళ్లిందట.

ఫ్యామిలీ హెడ్డు తన శరీరానికంటిన అవినీతి పంకిలాన్ని కడిగేసుకునేందుకు అనుమతినివ్వాలి. ఎటు వంటి కేసులూ పెట్టకూడదు. హెడ్డుగారబ్బాయికున్న శక్తి సామ ర్థ్యాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక మంచి పదవిని కట్టబెట్టాలి. ప్రస్తుతానికి కథ ఈ మజిలీలో ఉందట. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ‘అంతేగా... అంతేగా..’ అంటారనుకున్న పార్టీ నాయకులు ‘అదెట్లా... అదెట్లా..’ అనడం మొదలుపెట్టా రట. అధినేతలో ఇది కలవరాన్ని కలిగిస్తున్నది.

ఈ టోకు బేరం మీద ప్రధానంగా రెండు రకాల ఆలోచనా స్రవంతులు పార్టీలో ఉన్నాయి. మొదటి వర్గం టోకు బేరానికి ఓకే. కాకపోతే ఆ బేరంలో తమకూ ప్రమేయం ఉండాలి. పునరా వాసం పథకం తమకూ గొప్పగా వర్తించాలి. ఈరకమైన ధోర ణిని ‘అచ్చి’బాబు ఆలోచనా విధానంగా పార్టీలో పిలుచుకుం టున్నారు. మరోవర్గం వారు పార్టీని స్వతంత్రంగా ఉంచాల్సిందేనని గొణగడం మొదలుపెట్టారు.

పార్టీ నుంచి వెళ్లిపోయినవారిని మళ్లీ తీసుకొద్దామనీ, అవసర మైతే వారికి నాయకత్వం అప్పగిద్దామని కూడా వీరు ప్రబోధి స్తున్నారు. ఈరకమైన భావధారను ‘బుచ్చి’బాబు ఆలోచనా విధానంగా చెప్పుకుంటున్నారు. ఈ రెండువర్గాలే కాకుండా, ఇంకొందరు గజపతులూ, అశ్వపతులూ, నరపతులూ తదితరు లున్నారు. వీరంతా నిర్లిప్త మానసిక స్థితిలోకి జారుకుంటు న్నారు. బహుశా వీరంతా రాజకీయాలకు దూరం కావచ్చు.

పార్టీ నాయకుల్లో చాలామంది ఇప్పుడు బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. మొన్నటి ప్రాదేశిక ఎన్నిక లను బహిష్కరించాలని అధినేత ఇచ్చిన పిలుపును నాయ కులూ, కార్యకర్తల్లో తొంభై శాతం మంది బేఖాతర్‌ చేశారు. మొన్న తిరుపతిలో బయటపడ్డ అచ్చెన్నాయుడు వీడియోలు ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితులకు అద్దం పట్టాయి.

పార్టీ రాష్ట్ర శాఖకు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా విలీనాలు, పొత్తుల వ్యవ హారాలన్నీ తండ్రీకొడుకులే చూసుకుంటున్నారన్న దుగ్ధ అచ్చెన్న మనసులో ఉన్నదని చెబుతారు. అసంతృప్తిని ఆయన దాచుకోలే కపోతున్నారు. పార్టీ లేదు, బొక్కా లేదు.. పదిహేడో తారీఖు తర్వాత అసలు మిగలదని ఆయన కామెంట్‌ చేశారు. చిన బాబును ఉద్దేశించి ‘అతను బాగుంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుం దని’ కూడా అచ్చెన్న మాట్లాడటం పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. మరో సీనియర్‌మోస్ట్‌ నాయకుడైన బుచ్చయ్య చౌదరి కూడా ఇటీవల గొంతు విప్పారు. పార్టీలోకి కొత్త నాయ కత్వాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా తీసుకొస్తామని చెప్పారు. జూనియర్‌ పేరు చెబితే చినబాబు ఉడుక్కుంటారట. ఆయన దగ్గరకు వెళ్లి జూని యర్‌ వేస్ట్, మీరే గ్రేట్‌ అంటే చాలట. ఏ పనైనా జరిగిపోతుందని పార్టీలో బహిరంగంగానే చెప్పుకుం టారు. కొంతమందైతే మాయాబజార్‌ సినిమాలోని శకుని మామ టెక్నిక్‌ను కూడా ఉపయోగిస్తారట. శకుని మామ లక్ష్మణ కుమారుని (దుర్యోధనుని కొడుకు) దగ్గరకు వెళ్తాడు. ‘నేనూ, మీ నాన్న, పెద్దలందరం కలసి నీకు పెళ్లి చేయాలని నిశ్చయిం చాము. వధువు బలరాముని కుమార్తె శశిరేఖ’ అని చెప్పాడు. ‘ఛీఛీ... నేను చేసుకోను’ పొమ్మంటాడు లక్ష్మణ కుమారుడు. ‘అయితే గొప్ప చిక్కేనే... ఆ కన్యను అభిమన్యుడు వలచాడట’ శకుని మామ చిట్కాను ప్రయోగిస్తాడు. వెంటనే లక్ష్మణ కుమా రుని మూడ్‌ మారుతుంది. ‘అభిమన్యుడెవరు వలచడానికి, నేనే శశిరేఖను పెళ్లి చేసుకుంటా’నంటాడు. ఇదీ శకుని మామ టెక్నిక్‌.

తెలుగుదేశం పార్టీ కనీసం ఇప్పుడున్న స్థితిలోనైనా ఇంకెంతోకాలం మనజాలదని ఆ పార్టీలోని సాధారణ సభ్యుని దగ్గర నుంచి అధినేత స్థాయి వరకు అందరికీ తెలుసు. ఆ పార్టీ కథకు ఎప్పుడు ముగింపు పలుకుతారు? ఎలా పలుకుతారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే విషయం. ముగింపు పలకడానికి ముందుగా తన పార్టీ రాష్ట్రంలో ఇంకా బలంగానే ఉన్నదనీ, పార్టీ నాయకులూ, కార్యకర్తలూ ఏకతాటిపై నిలబడి ఉన్నారనే అభి ప్రాయాన్ని టేకోవర్‌ చేయబోయే పార్టీకి కలిగించాలని అధినేత తాపత్రయపడుతున్నారు.

కానీ, అసంతృప్తులు, అలకలు, లుక లుకలూ, ధిక్కారాలు రోజురోజుకూ ఎక్కువ కావడం ఆయనకు కలవరాన్ని కలిగిస్తున్నది. బేరం కుదిరేవరకైనా ఈ పార్టీని ఐక్యంగా ఉంచగలనా లేదా అన్న సంశయం పీడిస్తున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు పడ్డాయి. ఎన్నికల సమయాన ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఒకటి రెండు శాతం ఓట్లు తగ్గినా, ఇప్పటికీ రాష్ట్రంలో తనకు 40 శాతం ఓటర్ల బలముందని ఆయన చెప్పుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల వల్ల తన పార్టీ అసలు బలం బయటపడిపోతుందని ఆయన చాలా ఆందోళనకు గురయ్యారు. అందువల్లనే అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని నానాయాగీ చేశారు. పార్టీ గుర్తులేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు నలభై శాతం గ్రామాలు గెలిచామని ఆదరా బాదరా ప్రెస్‌మీట్లు పెట్టి తండ్రీకొడుకులిద్దరూ ప్రకటించుకు న్నారు. వాస్తవానికి ఆ పార్టీ మద్దతుదార్లు 16 శాతం గ్రామాల్లోనే గెలిచారు. మొత్తం ఓట్లలో 26 శాతం వాటా మాత్రమే దక్కింది. అధికారికంగా పార్టీ రహిత ఎన్నికలు కనుక దబాయింపులతో మీడియా సహకారంతో పరువు దక్కించుకునే ప్రయత్నం చేశారు.

పల్లెటూళ్లతో పోల్చితే పట్టణాల్లో తనకు మద్దతు ఎక్కు వుంటుందని అధినేత ఆశపెట్టుకున్నారు. కానీ మునిసిపల్‌ ఎన్ని కల్లో ఆయనకు 30 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ అవ మానకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి మునిసిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే పాటను అందుకున్నారు. సొంత మీడియా వంతపాడింది. ఇదెంత అసహ్యకరమైన ఆరో పణంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఇంత ప్రశాంత వాతావరణంలో ఎప్పుడూ జరగలేదు. ఇందుకు పోలీసు రికార్డులే సాక్ష్యం. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మునిసి పల్‌ ఫలితాల కంటే దారుణంగా ఉండబోతున్నాయన్న గ్రహింపుతో వాటిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, బ్యాలెట్‌ పేపర్లలో ఆ పార్టీ గుర్తులున్నాయి. అభ్యర్థులు రంగంలోనే ఉన్నారు. ప్రచారాన్ని కూడా చేసుకున్నారు.

తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలోనూ అదే తీరును అధినేత ప్రదర్శించారు. ఇక్కడ గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు సంపాదించాలని సర్వశక్తులూ కేంద్రీకరించారు. ‘ఈ గడ్డమీద పుట్టాను. ఈ నేల నాది ఈ గాలి నాది ఈ నీరు తాగి పెరిగాను’ అంటూ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం చేశారు. పోలింగ్‌కు ఒక వారం ముందు స్వయంగా ఒక సర్వేను చేయించుకున్నా రట. సర్వే ఫలితాన్ని చూసి పితాసుతులు హతాశులయ్యారట.

అక్షరాల ఇరవై రెండు శాతం ఓట్లు మాత్రమే తిరుపతిలో రాబో తున్నాయని ఆయన జరిపించుకున్న సర్వే తేటతెల్లం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిన విశ్వసనీయ భోగట్టా. ఆరోజు నుంచి అధినేత స్వరం అపస్వరాలు మాత్రమే పలకడం మొదలుపెట్టింది. తన మీద రాళ్ల దాడి జరిగిందని అర్ధరాత్రి దాకా ఒక నాటకాన్ని నడిపించారు. అది పండలేదు. పత్తర్‌ కా గోష్‌ ఉడకలేదు. కనీసం 25 శాతం ఓట్ల యినా ఈ ఉపఎన్నికలో చూపించకపోతే పార్టీ మెషినరీని తుక్కు కింద కొంటారు తప్ప కంపెనీ లెక్కన ఎవరు కొంటారు? పార్టీకి లభించబోయే ఓట్లను 25 శాతం దాటించడానికి ఆరోజు నుంచి ఆయన నానాతంటాలు పడుతున్నారని వినికిడి.

ఈ పూర్వరంగ మంతా తెలిసినవాడు కనుకనే అచ్చెన్న 17వ తేదీ తర్వాత పార్టీ ఖేల్‌ ఖతమ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. తమ నాయకుడికి ప్పుడు కావల్సింది గెలుపు కాదు. కేవలం పావలా పర్సెంటేజీ ఓట్లు! నౌ హి ఈజ్‌ బ్యాడ్లీ ఇన్‌ నీడ్‌ ఆఫ్‌ ఏ పావలా!. కానీ, ఆయన ఆ పావలా విలువ తెలిసిన నాయకుడు. పావలాతో రాజకీయ బేరసారాలు చేయవచ్చు. పొత్తులు కుదుర్చుకోవచ్చు. మిత్రులను సంపాదించుకోవచ్చునని నిరూపించినవాడు. ఇప్పు డదే పావలా పర్సెంటేజీతో పార్టీకి మంచి బేరం తెచ్చే ప్రయ త్నంలో ఉన్నారు. ఆ పర్సెంటేజీ వోట్ల కోసం ఆయన చేయ వలసిన ప్రయత్నాలన్నీ చేశారు.

ఇందుకోసం మూడో కూటమి లోని రహస్య మిత్రులతో మాట్లాడుకున్నారని కూడా వినికిడి. కూటమి అభ్యర్థికి 10 శాతం ఓట్లు కూడా దక్కకపోతే ఇలాంటి దేదో జరిగినట్టు అనుమానించాల్సి వస్తుందని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయినా అనుమానం ఒకపక్క పీడిస్తూనే ఉన్నట్టుంది. తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు పోలవుతున్నా యనీ, వేరే ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలించారనీ అనుంగు మీడియాలో హోరెత్తించారు. అందుకు సాక్ష్యంగా ఓ కల్యాణ మండపం ముందు ఆగిఉన్న టూరిస్టు బస్సును చూపె ట్టారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో టూరిస్టు బస్సు కనిపించడం కూడా వింతేనా? తిరుపతిలో ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు పడతా యని తన సర్వేలోనే వెల్లడైనందున, ఈ ఎన్నికకు మసిపూసే ఉద్దేశంతోనే ఎల్లో సిండికేట్‌ సాకారంతో ఓ పథకం ప్రకారం పోలింగ్‌ రోజున కథ నడిపినట్టు కనిపిస్తూనే ఉన్నది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో పదికాలాల పాటు ప్రకాశించవల సిన రాజకీయ పార్టీ నలభయ్యేళ్లు నిండకముందే బలికావలసి వచ్చే పరిస్థితి అత్యంత దురదృష్టకరం. అధినేతగా వున్న వ్యక్తి తన స్వప్రయోజనాలకోసం పార్టీని బలిచేయడం సులభమైన విషయమైతే కావచ్చు. కానీ, పార్టీని స్థాపించడం, దానిని ప్రజా క్షేత్రంలో నిలబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా నాయకత్వ ఆకర్షణ శక్తి, వ్యూహ చాతుర్యాల మీద ఆధారపడే ప్రాంతీయ పార్టీల విషయంలో వాటి నిర్వహణ కత్తిమీద సాము లాంటిది. పార్టీ నాయకుని జనాకర్షణ శక్తి, వాగ్ధాటి, వ్యక్తిత్వా లతోపాటు చారిత్రక సందర్భం కూడా కలిసిరావాలి.

ఎన్టీ రామారావుకు అటువంటి సందర్భం కూడా కలిసివచ్చింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికార పీఠాన్ని ఎక్కిం చగలిగారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలకు మరింత చేరు వగా తీసుకునిపోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజ లందరూ పాల్గొనగలిగే అవకాశాలను కల్పించడం ప్రజా ప్రభుత్వాల కర్తవ్యం. సామాజిక–ఆర్థిక అంతరాలు విపరీతంగా వున్న భారతదేశం లాంటి దేశాల్లో ఈ కర్తవ్య నిర్వహణే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలోనే పయనించాయి. కొన్ని నెమ్మదిగా, కొన్ని కొంత వేగంగా కదిలాయి.

ఎన్టీఆర్‌ ప్రభుత్వం వేగంగానే కదిలింది. అప్పటివరకూ అధికార పీఠాలకు దూరంగా వున్న కొన్ని వర్గాలను ఆయన చేరువ చేయగలిగారు. ప్రభుత్వాధికారులంటే ప్రజల్లో ఉండే భయాన్ని పోగొట్టి అధి కార వికేంద్రీకరణను ప్రారంభించగలిగారు. ప్రజల ఆకలి దప్పులు తీర్చడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రజా పునాదిని ఆయన నిర్మించ గలిగారు. వెన్నుపోటు దెబ్బతిని పదవీచ్యుతుడయ్యేనాటికి తెలు గుదేశం పార్టీకి సుమారు 45 శాతం ఓటు బ్యాంకును ఎన్టీఆర్‌ స్థిరపరిచారు.

ఎన్టీఆర్‌ను గద్దె దింపి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధినేత పయనం ఎన్టీఆర్‌ ప్రయాణానికి పూర్తి అపసవ్యదిశలో సాగింది. ఆస్తులు–అంతస్తులు పెంచుకోవడానికీ, అధికారం లోకి రావడానికి ఆయన అనైతిక పద్ధతులను అనుసరించారు. వచ్చిన అంతస్తును, అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ, పెంచు కోవడానికీ ఆయన అవాంఛనీయమైన విధానాలను అవలం బించారు. సొంత ప్రయోజనాలకోసం రాజ్యాంగ వ్యవస్థలను వినియోగించుకోవడానికి మ్యానిపులేషన్‌ మార్గాన్ని ఎంచు కున్నారు. ఫలితంగా ఎంత విషాదకర పరిణామాలు సంభ వించాయో వర్తమాన చరిత్ర గమనించింది.  అధికార పీఠాలకు సాధారణ ప్రజలను దూరం చేశారు. ఓట్ల కొనుగోలులో ఆంధ్ర ప్రదేశ్‌ జాతీయ రికార్డులను బద్దలు కొట్టి అపఖ్యాతి మూట గట్టుకోవడం పూర్తిగా ఈ నాయకుని ఘనతే.

ఎన్టీఆర్‌ నుంచి అధికారం లాక్కున్న తర్వాత జనబలం లేని ఆయన ఎన్నికలను ఎదుర్కోవడం కోసం కళ్లు చెదిరే ఎన్నికల ఖర్చుకు తెరతీశారు. అప్పటినుంచే సంఘసేవకులు, నైతిక నియమాలకు కట్టు బడేవారు రాజకీయాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు డబ్బున్న వాళ్లకే పరిమిత మయ్యాయి. పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన మూడు దశాబ్దాల దూరం జరిగింది. ఆయన వైఖరి ఫలితంగా పార్టీకి ప్రజలు వేగంగా దూరమయ్యారు. ఒకటి రెండు సందర్భాల్లో జాతీయ పరిణా మాలను గమనించి అవకాశవాద పొత్తులతో అర్థిమెటిక్‌ విజ యాలను సాధించినా అసలు బలం సన్న గిల్లుతూనే వస్తున్నది. ఇప్పుడు తన బలాన్ని 25 శాతం దగ్గర నిలబెట్టి లాభసాటి బేరం చేయడం కోసం ఆఖరి పోరాటం చేస్తున్నారు.

పార్టీలోని నాయకశ్రేణులూ, కార్యకర్తలూ ఈ వ్యవహారా లన్నీ గమనిస్తున్నారు. కొద్ది రోజుల్లో పార్టీ అంతర్గత పరిణా మాలు వేగం పుంజుకోవచ్చు. ఒక సూపర్‌హిట్‌ తెలుగు సినిమా గుర్తుకొస్తున్నది. దేవలోకంలో స్విమ్మింగ్‌ పూల్‌ లేని కారణంగా ఇంద్రుని కూతురు శ్రీదేవి భూలోకానికి వస్తుంది. స్విమ్మింగ్‌ తర్వాత అంగుళీయకాన్ని (ఉంగరాన్ని) మరిచిపోయి వెళ్లి పోతుంది. సదరు అంగుళీయకం చిరంజీవికి దొరుకుతుంది. ఆమె దేవకన్య కనుక, పోయిన ఉంగరం ఎవరి దగ్గరుందో తెలుసుకుంటుంది. ‘ఈ మానవునితో అచ్చికబుచ్చికలాడి, మచ్చిక చేసుకుని అంగుళీయకమును గ్రహించవలె’నని నిశ్చ యించుకుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత పరిస్థితి కూడా అదే. అలకలతో ఉన్న పార్టీ నాయకులతో ‘అచ్చి’క ‘బుచ్చి’కలాడి అచ్చెన్న–బుచ్చెన్న ఐడియాలజీస్‌తో సమ న్వయం చేసుకుంటే తప్ప తాను కోరుకున్న అంగుళీయకం దొర కదు. దాని ఖరీదు పావలా పర్సెంట్‌.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top