ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం

Sakshi Guest Column On Congress Party Rahul Gandhi Issue

విశ్లేషణ

న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని మాజీ అటార్నీ జనరల్‌ ఒకరు అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్  153(ఎ), సెక్షన్  505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి,కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది గుర్తుంచుకోవాలి. పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిపోయింది. న్యాయపరంగా, రాజకీయంగా దీని పరిణామాలు ఎలా ఉండనున్నాయన్న ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చలా మణీలో ఉన్న ప్రశ్నలతోపాటు సభ్యత్వ రద్దుతో రాగల ముఖ్యమైన సరికొత్త సందేహాలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. స్థూలంగా చెప్పాలంటే, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమిటన్నది తరచిచూద్దాం.

సూరత్‌లోని మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి మార్చి 23న పరువునష్టం దావా కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.15,000 జరిమానా విధించారు. ఇండియన్  పీనల్‌ కోడ్‌ సెక్షన్  499, 500ల కింద దోషిగా నిర్ధారించారు. శిక్ష అమలును నెల రోజుల పాటు స్తంభింపజేసి, పైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా బెయిల్‌ ఇచ్చారు. అయితే న్యాయమూర్తి తీర్పు వెలువరించిన మరుసటి రోజే లోక్‌సభ కార్యాలయం రాహుల్‌ గాంధీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళ నలకు దిగిన విషయం తెలిసిందే. ఇందుకు బదులు కాంగ్రెస్‌ నేతలు శిక్ష రద్దును కోరుతూ పైకోర్టును ఆశ్రయించి ఉండాల్సింది. ఈ సమస్యకు పరిష్కారం న్యాయస్థానాల్లోనే లభిస్తుంది కానీ వీధుల్లో కాదు. 

పైకోర్టులు శిక్షను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వల్ల మాత్రమే రాహుల్‌ గాంధీ మళ్లీ లోక్‌సభ సభ్యుడు కాగలరు. 2013 నాటి లిలీ థామస్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా ఒక కేసులో శిక్ష ప్రకటించిన వెంటనే లోక్‌సభ సభ్యత్వం దానంతటదే రద్దయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సహా దాదాపు 20 మంది తమ సభ్యత్వాలను కోల్పోయిన విషయం ప్రస్తావనార్హం.

లోక్‌సభ కార్యాలయం తొందరపాటు?
రాహుల్‌ గాంధీ సభ్యత్వం రద్దు చేసే విషయంలో లోక్‌సభ కార్యాలయం తొందరపడిందా? మాజీ అటార్నీ జనరల్‌ ఒకరు చెప్పిన దాని ప్రకారం, లోక్‌సభ కార్యాలయానికి ఇంతకు మించిన ప్రత్యా మ్నాయం లేదు. న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని తెలిపారు. అయితే లక్షద్వీప్‌ ఎంపీ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.  

హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై కేరళ కోర్టు ఒకటి మహమ్మద్‌ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజుల తరువాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్  జారీ చేసింది.  లక్షద్వీప్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్  2023 జనవరి 18న ప్రకటించింది కూడా. అయితే వారం రోజుల తరువాత కేరళ హైకోర్టు మహమ్మద్‌ ఫైజల్‌ శిక్షపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టు ఉప ఎన్నికను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జనవరి 25 నుంచి మార్చి 29వ తేదీ వరకూ మహమ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం! ఉన్నత న్యాయ స్థానం శిక్షపై స్టే విధించిన వెంటనే లోక్‌సభ్య సభ్యత్వం దానంతటదే పునరుద్ధరింపబడుతుందా, లేదా అన్న స్పష్టత మాజీ అటార్నీ జన రల్‌ ఇవ్వలేకపోయారు. (అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చేందుకు కొన్ని గంటల ముందు ఫైజల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.)

చట్టాల్లోని ఈ లోపం ఎంపిక చేసిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్న వాదన ఉంది. కోర్టుల తీర్పుల అమలును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? 2018లో ఎన్నికల కమిషన్ , లోక్‌ ప్రహరీ మధ్య జరిగిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ... అప్పీలు పెండింగ్‌లో ఉండి ఉన్నత న్యాయస్థానాలు శిక్షపై స్టే విధిస్తే, శిక్ష పరిణామంగా అమల్లోకి వచ్చే సభ్యత్వ రద్దు పనిచేయదని విస్పష్టంగా తెలిపింది. 

రాహుల్‌ కేసులో ఎన్నో సందేహాలు...
రాహుల్‌ గాంధీపై సూరత్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలైన కేసుపై ఎన్నో సందేహాలున్నాయి. కేసు పిటిషనర్‌ గత ఏడాదే హైకోర్టు నుంచి విచారణపై ఎందుకు స్టే తెచ్చుకున్నారన్నది ఒక ప్రశ్న. దీని ఫలితంగా కేసు విచారణ దాదాపు 12 నెలల పాటు ఆలస్యమయ్యేందుకు పిటిష నర్‌ కారణమయ్యారు. అదనపు సాక్ష్యాలేవీ వెలుగులోకి రాని నేపథ్యంలో ఈ ఏడాది స్టే ఎత్తేయించుకునేందుకు ఏ రకమైన పరిణామాలు కారణమాయ్యాయన్నదీ అస్పష్టమే. పైగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సూరత్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎందుకు మారారు?

కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్‌ డిఫమేషన్  కిందకు వస్తాయా? లేక సివిల్‌ డిఫమేషన్  పరిధి లోకా? 2019 ఏప్రిల్‌ 13న ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్‌ అన్నది ఇదీ: ‘‘ఒక చిన్న ప్రశ్న... ఈ దొంగలందరి ఇంటిపేర్లు మోదీ, మోదీ, మోదీ అనే ఎందుకుంది? నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ...’’ ఈ వ్యాఖ్య పైనే పరువు నష్టం కేసుల్లో గరిష్ఠంగా విధించ గల రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చా? పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యేందుకు కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడాలన్నది ఇక్కడ కాకతాళీయమేనా?

అన్నింటికంటే ముఖ్యంగా మనలాంటి దేశంలో, విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్  153(ఎ), సెక్షన్  505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండింటిలో దేని కిందనైనా శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్  8 కింద చట్టసభల సభ్యత్వం రద్దయిపోతుంది.

ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి, కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ వారి సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? అధికార పక్షంలో ఉంటూ పైన చెప్పిన సెక్షన్ల పరిధిలోకి రాగలవారిని చూసీచూడనట్లు వదిలేయడం ఎందుకు? అధికార పక్షం స్వయంగా చెబుతున్నట్లుగా చట్టం అందరికీ సమానమే, అందరూ చట్టం ముందు సమానులే కావాలి కదా?

సమీక్షకు ఇదే తరుణం...
నా దృష్టిలో పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం. యునైటెడ్‌ కింగ్‌డమ్, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, శ్రీలంక తదితర దేశాల్లో ఇప్పటికే పరువు నష్టం దావాల ‘డీక్రిమినలైజేషన్ ’ జరిగింది. ఆయా దేశాల్లో ఇప్పుడు పరువు నష్టం అనేది క్రిమినల్‌ నేరం కాదు. భారత్‌ కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి.

చివరిగా ఇకపై ఇలాంటి వ్యవహారాలు తగిన పద్ధతి ఆధారంగా న్యాయస్థానాల ద్వారా మాత్రమే జరగాలి. సభ్యత్వ రద్దుపై తీర్పు అనేది వీధుల్లో చర్చించే అంశం కానే కాదు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వ రద్దు తాలూకు రాజకీయ పరిణామాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తెలుస్తున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయన్నది వేచి చూడాల్సిన అంశం. ఇంకో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది.

న్యాయపరంగా లేదా రాజకీయాల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ అంగీకరించా ల్సిన విషయం ఒకటి ఉంది... ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షా    లను చంపేసే ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పడాల్సిందే!

ఎస్‌.వై. ఖురేషీ 
వ్యాసకర్త కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top