అప్పుడు జరిగినట్టే... ఇప్పుడవుతుందా? | Sakshi
Sakshi News home page

అప్పుడు జరిగినట్టే... ఇప్పుడవుతుందా?

Published Tue, May 21 2024 4:39 AM

Sakshi Guest Column On BJP

అభిప్రాయం

2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2019లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా జరిగిన సర్టికల్‌ స్ట్రయిక్స్‌తో ఓటర్లలో బీజేపీ జాతీయభావన రేకెత్తించింది. ఫలితంగా రెండు పర్యాయాల్లోనూ  బీజేపీ అనుకూల వేవ్‌ కనబడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ చాలా రాష్ట్రాల క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. భారీ మెజారిటీ కాకపోయినా, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది. కాంగ్రెస్‌ గెలిచిన 2004 లేదా బీజేపీ అఖండ విజయం సాధించిన 2019... ఏ ఫలితాలు వస్తాయన్నది ప్రశ్న!

2014లో, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గాలి కనిపించినప్పటికీ, బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని ఎన్నికల నిపుణులు, రాజకీయ పండితులు కచ్చితంగా భావించలేదు. చివరకు కాషాయ పార్టీ కూడా సాధారణ మెజారిటీ మార్కును దాటగలననే నమ్మకంతో లేదు. మరోవైపున కాంగ్రెస్‌ పార్టీ అంత తక్కువ స్థానాలు సాధిస్తానని అసలు ఊహించలేదు. ప్రధానంగా అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌’ ఉద్యమం కారణంగా వచ్చిన కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటుతో బీజేపీ భారీగా లాభపడింది. దాన్ని తిప్పి కొట్టే ప్రచారం లేకపోవడంతో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది.

పనికి ఆహార పథకం, ఆహార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లక్షలాది మందిని పేదరికం నుండి బయటపడేసిన అధిక ఆర్థిక వృద్ధి వంటి పదేళ్ల యూపీఏ పాలనలో సాధించిన విజయాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ మీది అవినీతి ఆరోపణలు, అధిక ద్రవ్యోల్బణం అంశాలను మోదీ చక్కగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏను గద్దె దించాలంటూ మార్పు, సమగ్ర అభివృద్ధి గురించి ప్రచారం చేశారు. 2014 ఎన్నికలు... మార్పు కోసం జరిగిన ఎన్నికలు, అదే సమయంలో ఆశావహ ఎన్నికలు. 56 అంగుళాల ఛాతీ గల హీరో దేశాన్ని రక్షిస్తారన్న కథనం బాగా ఆకట్టుకుంది.

2019లో, బీజేపీకి వ్యతిరేకంగా చాలా విషయాలు ఉన్నాయి... పెద్దనోట్ల రద్దు, హడావుడిగా విధించిన జీఎస్టీ, నెరవేర్చని అనేక వాగ్దానాల వంటివి. కాంగ్రెస్‌ నుండి గట్టి సవాలును ఎదుర్కొంటున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను కోల్పోతుందన్న అంచనా ఉండేది. 2019 ఫిబ్రవరి మధ్యలో పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా బాలాకోట్‌ వైమానిక దాడులు జరిగాయి. ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ ప్రధాని మోదీ రేకెత్తించిన జాతీయవాద భావన క్షీణిస్తున్న బీజేపీ అదృష్టాన్ని మార్చేసింది. 

2014, 2019 రెండూ వేవ్‌ ఉన్న ఎన్నికలు. అయితే 2024 ఎన్నికలు వేవ్‌ రహితం మాత్రమే కాదు, పేలవమైనవి కూడా. 2019లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ బీజేపీకి విపరీతంగా ఉపయోగపడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, ఈ సంవత్సరం ప్రారంభంలో రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఎన్నికల విశ్లేషకులకు ఎన్నికల్లో గెలిచే పార్టీగా ఇప్పటికీ బీజేపీనే ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ, ఆ పార్టీ నాయకులు ఒక విచిత్రమైన భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే, పార్టీ ఊహించిన విధంగా ఎన్నికలు జరగడం లేదు. ఇండియా కూటమి బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సవాలును తటస్థీకరించడం బీజేపీకి చాలా కష్టంగా ఉంది.

వాస్తవానికి, తీవ్ర పోరాటం జరుగుతున్న రాష్ట్రాలైన బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ నుండి వివిధ క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ వంటి కొన్ని హిందీ బెల్ట్‌ రాష్ట్రాల ఎన్నికల డైనమిక్స్‌ బీజేపీకి వ్యతిరేకంగా మారాయనీ, హిందుత్వ పార్టీకి తగిన మెజారిటీ పొందడం కష్టంగా ఉందనీ సూచిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం నుండి గాభరాగా మారిన మోదీ ప్రవర్తన, ప్రచారాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను, వరుసగా మూడోసారి బీజేపీ మేనిఫెస్టోలో అందించిన హామీలను ప్రచారం చేయడం మానేశారు. కాంగ్రెస్‌ పార్టీ, ముస్లింల పట్ల మెజారిటీ వర్గాలను భయపెట్టి, అసహ్యించుకునేలా చేసే దిశగా ప్రచారం మారడానికి ఇదే కారణం. దీనిని భయాందోళనలకు, నిరాశకు చిహ్నంగా రాజకీయ విశ్లేషకులు అర్థం చేసుకుంటున్నారు.

గత ఒకటిన్నర నెలల్లో, దేశ రాజకీయ రంగస్థలంలో చాలా జరిగాయి. పోలింగులో తక్కువ ఓటింగ్‌ శాతం ప్రధానమంత్రిని, ఆయన ప్రచార నిర్వాహకులను కలవరపరిచింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలవగలవా అనే ప్రశ్నను లేవనెత్తింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, రామ మందిర ప్రారంభోత్సవం లాంటిని దృష్టిలో ఉంచుకుని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేసినట్లుగా, పార్లమెంటులోని 543 సీట్లలో నాలుగింట మూడొంతులు బీజేపీ కైవసం అవుతాయనే భావన ప్రమాదంలో పడింది. తొలి మూడు దశల పోలింగులో ఓటింగ్‌ ఊపందుకోకపోవడం, ఆ పార్టీకి భారీ మెజారిటీపై ఆశలు సన్నగిల్లేలా చేసినప్పటికీ, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది.

ఓటింగ్‌ శాతం అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపదని రాజకీయ విశ్లేషకులు, కాషాయ పార్టీ పట్ల సానుభూతిపరులైన ఎన్నికల పండితులు  అభిప్రాయ పడుతున్నారు. అయితే, రాజకీయంగా తటస్థులైన విశ్లేషకులు చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. మీడియా పండితులు, రాజకీయ నిపుణుల అభిప్రాయాలు చాలా వరకు ఊహించిన స్థాయిలోనే ఉన్నాయి: వీరి అభిప్రాయం ప్రకారం ‘ఏ విధంగానైనా మోదీ గెలుస్తారు’. 

అయితే చాలామంది ‘మోదీ గెలుస్తారు, కానీ తక్కువ మెజారిటీతో’ అంటూ తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ అభిప్రాయంతో సమస్య ఏమిటంటే, జీవనోపాధి సమస్యలపై ఓటర్లలో నిశ్శబ్దంగా చెలరేగుతున్న కోపాన్ని ఇది విస్మరిస్తోంది. జాతీయ సమస్యలపై కథనానికి తావు లేనప్పుడు, మోదీ డజన్ల కొద్దీ స్థానిక సమస్యలను, సామాజిక అసంతృప్తిని ఎదుర్కొంటారు. దేశమంతటా ప్రతిధ్వనించే ఒక చుట్టుముట్టే కథనాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో ఎందుకు కనుగొనలేకపోయిందో అది వివరిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో, ఉద్యోగాలు లేనప్పుడు నిరుద్యోగ సమస్యపై ఎలా స్పందించాలి, స్తబ్ధుగా ఉన్న వేతనాలు, వ్యవసాయ సంక్షోభం గురించి విమర్శలను ఎలా ఎదుర్కోవాలి, ధరలతో సతమతమవుతున్న మహిళా ఓటర్లను ఎలా ఆకర్షించాలి అనేవి మోదీ అతిపెద్ద సమస్యలు. ఒక అంశం నుండి మరో అంశానికి స్థిరత్వం లేకుండా సాగుతున్న ప్రధాని అసంబద్ధ ఎన్నికల ప్రచారం చీకటిలో కాల్పులు జరిపే కసరత్తుగా మారిపోయింది. ఏడు దశల ఎన్నికలలో ఐదు దశలలో, చాలా సంప్రదాయ అంచనాలు తలకిందులు అయినాయి. పైగా ఓటరు సెంటిమెంటును అర్థం చేసుకుంటే, విషయాలు బీజేపీకి అనుకూలంగా లేవని తెలుస్తుంది.

ఏమైనప్పటికీ, ఈ ఎన్నికలు పోటాపోటీగానే ఉన్నాయి. మోదీ ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేక సెంటిమెంట్, ఓటర్ల నిరాసక్తత వంటివి ఇండియా కూటమి మెజారిటీ మార్కును చేరుకోవడానికి కారణం అవుతాయో లేదో అంచనా వేయడం కష్టం. ఎన్నికల ఫలితాలపై రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీకి దాదాపు 300 సీట్లు వచ్చే అవకాశం ఉంది. రెండు, బీజేపీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. పైగా మొత్తంగా ఎన్డీయే 272 మార్కుకు చేరుకుంటుందా అనే సందేహాలు ఉన్నాయి. దీనర్థం రెండు అవకాశాలు ఉన్నాయి. 

బీజేపీ తన 2019 పనితీరును పునరావృతం చేస్తుంది. లేదా 2024లో 2004 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా మారిన రాజకీయ కార్యకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మాత్రం బీజేపీ గెలుచుకునే సీట్ల సంఖ్యలో అర్థవంతమైన క్షీణతను చూడటం లేదు. మరోవైపు, రాజకీయ కార్యకర్తగా మారిన సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్‌ బీజేపీకి కనీసం 50 నుండి 60 సీట్లు తగ్గుముఖం పట్టనున్నట్లు చెబుతున్నారు. యాదవ్‌ అభిప్రాయం సరైనదే కావచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయానికి రావడానికి ఆయన హిందీ బెల్టులో విస్తృతంగా ప్రయాణించారు మరి!

అలీ చౌగులే 
వ్యాసకర్త సీనియర్‌ స్వతంత్ర పాత్రికేయుడు
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement
 
Advertisement