ఎమ్మెల్యేల హైజాక్‌ నేరం కాదా?

MLAs hijack is not a crime? - Sakshi

విశ్లేషణ

నిత్యనూతన ప్రభుత్వాల స్థాపనకోసం ఎమ్మెల్యేలకు మంత్రిపదవి, కార్పొరేట్‌ అధ్యక్షత, లేదా నగదు లంచాలు ఇవ్వడం నేరం కాదనే రాజనీతి సంస్కరణ, నూతన శాసనాలు ప్రస్తుతం ఎంతైనా అవసరం. ఇప్పుడున్న బ్రిటిష్‌ కాలపు చట్టాల ప్రకారం లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమే. లంచం డబ్బెక్కువై ఇస్తున్నామా? పని కావడం కోసం ఇస్తున్నాం. అది నేరమా అనే లాజిక్‌ మిస్‌ కాకూడదు. ముందే ఏసీబీ వారికి తెలియజేసి రసాయనం పూసిన నోట్లను ఇవ్వడం, నీరు తగలగానే చేయి ఎరుపు కావడం, లంచగొండి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం మనకు వార్తలు. ఇది లీగల్‌ ట్రాప్‌. లంచం ఇచ్చిన పౌరుడూ ఇప్పించిన పోలీసులూ, సాయపడిన వారు నేరస్తులు కారు. చట్టం అమలుకు సాయపడిన వారిని మనం సన్మానించాలి. వేరే పార్టీనుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ లేదా కార్పొరేషన్‌ పదవి ఇస్తామని ఆశ చూపడం కూడా లంచమేననీ  చట్టవ్యతిరేకంగా సంతృప్తిపరచడమే లంచ మనీ అవినీతి నిరోధక చట్టం అంటుంది. రాజ్యాంగ ప్రభుత్వాలను పడగొట్టే ఈ ప్రలోభాలు లంచాలు కావని, వీటిగురించి పట్టించుకోరాదనే అభిప్రాయంలో జనం అంతా ఉన్నారు. ఆ పార్టీ చేయలేదా, మేం చేస్తే తప్పా అని దబాయిస్తారు. ఇవి నేరాలే అని చట్టం ఉన్నంత మాత్రాన దర్యాప్తు జరపాలా? రోజువారీ పనులలో అధికారులు లంచాలు తీసుకోగూడదు. 

కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకోసం కొందరు రాజీనామా చేయడానికి, పార్టీ మారడానికి లంచాలు ఇస్తే తప్పేమిటి అనేవాదాలు వినిపిస్తున్నాయి. నిరుడు కర్ణాటకలో ఇటీవల రాజస్తాన్‌లో ఎమ్మెల్యేలను వేలం పాటలో, సంతలో ఎక్కువ ధర చెల్లించినట్టు, ధర పలికి బేరసారాలు సాగినట్టు ట్యాప్‌ చేసిన ఆడియో టేప్‌లు విడుదల చేశారు. మందను తోలుకొచ్చిన నాయకుడికి 30 నుంచి 35 కోట్లు, మందలో వచ్చిన మహానుభావుడికి దాదాపు 25 కోట్లు ఇవ్వడానికి బేరసారాల సంభాషణల వివరాలు ప్రచురించారు. బీజేపీకి చెందిన పెద్ద నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సంపన్నులైన రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, పారిశ్రామిక వేత్తలు డబ్బు లావాదేవీల్లో ఉన్నట్టు ఆ సంభాషణలు వివరిస్తున్నాయి. దర్యాప్తు చేస్తేతప్ప నేరాలు బయటపడవు.

కర్ణాటకలో జనతాదళ్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ను విజయవంతంగా కూల్చారు. కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కేసులో తమ నాయకుల పేర్లు ఇరికించారని పెద్ద రాజకీయ నేతలకు వాదించే అధికారం పూర్తిగా ఉంది. ఆ టేప్‌లు కావాలని సృష్టించి ఉంటే అది దొంగ సాక్ష్యాలు తయారు చేసిన నేరమవుతుంది. దాన్నయినా దర్యాప్తు చేయాలి. ఎందుకు చేయరు? దానివల్ల ఎవరికి లాభం? లాభం పొందిన వారే నేరం దాచడానికి దర్యాప్తు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానించే పని జనం చేయడం లేదు. దొరికితేనే దొంగలు. దొంగతనం మానకండి. దొరక్కుండా చూసుకోవడం అంటే దర్యాప్తు ఆపడమే. ఇదివరకు ప్రభుత్వాలు పడిపోయినపుడు బయటపడిన నేరాలు దర్యాప్తు జరపలేదు కనుక అదే అనుసరించతగిన ఆదర్శ కార్యక్రమంగా మారి తాపీగా ఇంకో ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఆఫర్లు, మంత్రి పదవుల ప్రలోభాలు. ఇతర పదవుల ఆశల ఆడియో టేప్‌లు మళ్లీ విడుదలయినాయి. సంభాషణలు వివరంగా ప్రచురితమయినా మరుగున పడిపోతాయి.

ఈ విషయాలు కోర్టులకు తెలియజేస్తారా? కోర్టులముందుకు తీసుకువెళ్లరా? అక్కడే మేధావులైన న్యాయవాదుల పాత్ర మెరుస్తూ ఉంటుంది. రాజ్యాంగంలోని సవాలక్ష అంశాలు మాట్లాడతారే గానీ ఎమ్మెల్యేలను డబ్బుతో, పదవుల్తో కొంటున్నారన్న అంశాన్ని దర్యాఫ్తు చేయాలని డిమాండ్‌ చేయరు. స్పీకర్‌ హౌస్‌లో ఫలానా పని చేయవచ్చా, గవర్నర్‌ రాజ్‌భవన్‌ లాన్స్‌లో ఏం చేయాలి, శాసనసభా పక్షం సమావేశం శాసనసభా భవనంలో జరగాలా లేక ఆ పార్టీ కార్యాలయంలోనా. అనే నిశితమైన అంశాలపైన అటార్నీ జనరల్‌ న్యాయనిపుణులు మాట్లాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు సంవిధాన సంరక్షణకు పాటుపడుతూ ఉంటాయి. లంచగొండితనం నేరాన్ని మాత్రం దర్యాప్తు చేయాలనే ఆదేశాలు అక్కడినించి కూడా రానివ్వరు. అయిదు నక్షత్రాల హోటల్లో కొన్ని వారాలు బసచేయడమంటే కొన్ని లక్షల రూపాయలు రోజుకు ఖర్చుచేయడమే. చార్టర్డ్‌ విమానాలంటే కోట్ల ఖర్చు. ఎమ్మెల్యేలు హోట ళ్లలో స్వచ్ఛంద బందీలుగా ఉండడం ప్రజాస్వామ్యంలో సాధారణం. పార్లమెంట్‌లో మీడియాలో కూడా ఈ లంచాలు చర్చకు రావు. లంచం తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాయం చేసి, లంచం ఇచ్చిన పార్టీలో చేరి, మంత్రి అయితే నేరం కాదంటే ఏ గొడవా ఉండదు.

ఎన్నికలప్పుడు ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. తరువాత నోట్లతో కూలుతాయి. లంచాలకు టేపు సాక్ష్యాలు ఎవరూ చూడరు. అనుమానాలే కాని రుజువు కావు. కానీ ప్రాథమికంగా లంచాలు ఇచ్చే ప్రయత్నం జరిగినట్టు టేప్‌లు సాక్ష్యం చెబుతున్నపుడు, ఆ నేరాన్ని ఎందుకు దర్యాప్తు చేయడం లేదు?  ప్రయత్నం స్థాయిలో నిరోధించకుండా నేరం చేయడం పూర్తయిన తరువాతనైనా దర్యాప్తుకోసం చేయకుండా రాజ్యాలేలడమే రూల్‌ ఆఫ్‌ లా అవుతుందా? అనే ప్రశ్నలు పదేపదే రాకుండా ఉండాలంటే  రాజకీయ లంచాలు నేరాలు కాబోవని కొత్త న్యాయశాస్త్రాన్ని కనిపెడితే ఓ పనైపోతుంది.

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మాడభూషి శ్రీధర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top