మేము ఈ దేశ పౌరులమేనా?

How Country Treating The Dalits - Sakshi

స్వాతంత్య్ర పోరాటాన్ని విజయవంతంగా నడిపిన గాంధీని ఆఫ్రికాలో తెల్లవాళ్ళు ఎక్కిన రైలు బోగీ నుంచి కిందికి తోసేసిన ఘటన చదివినప్పుడల్లా భారతీయులం రగిలిపోతుంటాం. బ్రిటిష్‌ వారి జాత్యహంకారానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి, స్వాతంత్య్రం సాధించుకున్నాం. అయితే మన దేశంలో ఉన్న కుల సమాజపు అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? దళిత సోదరులపై ఏటేటా పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు దేన్ని సూచిస్తున్నాయి? నేనీ దేశ పౌరుడినేనా? ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో  ఓ దళితుడిగా నేనెక్కడున్నాను?

ఏ దేశానికైనా పరాయి పాలన నుంచి విముక్తి లభిస్తే పండుగే! దేశ ప్రజలమైన మనం ఆజాదీ అమృతోత్సవాలు చేసుకోవడం అంతులేని ఆనందాన్నే ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా నా మనసును ఓ ప్రశ్న వేధిస్తూ ఉంది. ఈ స్వర్ణోత్సవాల్లో భాగస్వామిని కాగలనా? లేదా? అసలు నేనీ దేశ పౌరుడినేనా? అయితే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దళితుడిగా నేనెక్కడున్నాను? దేశంలో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన వేదన ఏదో కట్టిపడేస్తోంది. ఈ సంబరాలకూ, నీకూ ఏ సంబంధం లేదంటోంది. 

► మన దేశం ఇప్పటికే రెండు పండుగలు జరుపుకొంది. ఇప్పుడు మూడో పండుగ ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’. సంవత్సరకాలంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. 1972లో వెండిపండగ, 1997లో బంగారు పండుగ, ఇప్పుడు ఏకంగా అమృతోత్సవాల్లో మునిగితేలుతున్నాం. 1972కు ముందు అంటే 25 ఏళ్ళల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించారు. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక రంగంలో కొంత మెరుగైన ఫలాలు వచ్చినమాట నిజమే. అది ఈ దేశప్రజల చైతన్య పునాదులపై ఆధారపడి జరిగిందే తప్ప, అప్పణంగా ఎవరూ అప్పజెప్పింది కాదు. అయితే ఎంత ప్రగతి సా«ధించినా సాటి మనిషి నన్ను జంతువుల కన్నా హీనంగా చూస్తోంటే, నోరెత్తి న్యాయం అడిగితే అరెస్టులు, దాడులు. రాజ్యాంగ బద్ధ సమాన హక్కుల కోసం అడిగితే, ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. నా జీవితంలోని సంఘటన పాతికేళ్ళ స్వాతంత్య్రం వట్టి బూటకమని ఎలా తేల్చిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

నేటి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామం నా సొంత ఊరు. మా నాన్నకు ముగ్గురు తమ్ముళ్ళు. అందులో చిన్నవాడి పేరు మల్లెపల్లి రాజం. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి గని కార్మికుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. 1960లో మా గ్రామం శివారులోనే బొగ్గు గనులు ప్రారంభం కావడంతో ఇక్కడ పనిచేయడానికి తిరిగి వచ్చాడు. అటు బొగ్గు గనుల్లో పనిచేస్తూ, గ్రామంలో కూలీల, పాలేర్ల జీతాల పెరుగుదల కోసం పనిచేశాడు. అదేవిధంగా భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజలకు పంచడానికి ఉద్యమాలు నడిపాడు. అది భూస్వాములకు కడుపుమండేలా చేసింది. 1963లో జరిగిన సంఘటన ఆయనను మా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. 

మా ఊరి మధ్యలో ఒక మర్రిచెట్టు ఉండేది. దానిచుట్టూ బండలతో ఒక గద్దె కట్టి ఉండేది. దాన్ని కచ్చేరీ గద్దె అనేవాళ్ళం. దాని మీద అగ్రవర్ణ దొరలు మాత్రమే కూర్చునేవారు. మా చిన్నాన్న మల్లెపల్లి రాజం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. అందువల్ల ఆ చైతన్యం ఇచ్చిన ధైర్యంతో దొరలు కూర్చునే కచ్చేరీ గద్దె దగ్గరకు వెళ్ళి, ‘కచ్చేరీ గద్దె మీద మేం కూడా కూర్చుంటాం’ అని అడిగాడు. అక్కడ ఘర్షణ జరిగింది. రెండు రోజుల తర్వాత మా చిన్నాయన కనిపించకుండా పోయాడు. మూడు రోజుల వరకు ఆచూకీ తెలియలేదు. నిజానికి మా చిన్నాయనను కిడ్నాప్‌ చేసి, మూడు రోజులు పొగాకు బ్యారెన్‌లో బంధించి, చిత్రహింసలకు గురిచేశారు. కసితీరా చంపి ఊరి చివర కుంటలో పడేశారు. కుటుంబ సభ్యులు వెతగ్గా, వెతగ్గా, మూడు రోజుల తర్వాత శవమై తేలాడు. ‘కచ్చేరీ గద్దెపై మేం కూడా కూర్చుంటాం’ అన్నందుకు స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడికి జరిగిన శాస్తి అది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. వేలాది కార్మికులు నిరసనగా పెద్ద ఊరేగింపు చేశారు. అయినా సరే నిందితులపై కేసు కూడా నమోదు కాలేదు. ఇదీ ఈ దేశ స్వాతంత్య్రం ఓ దళితుడికి అందించిన స్వేచ్ఛ. 

అంతటితో ఆగలేదు. 1968లో 25 డిసెంబర్‌న కీలవేన్మణిలోని 44 మంది దళితులను అక్కడి ఆధిపత్య కులాలైన భూస్వాములు సజీవ దహనం చేశారు. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా కంచికచర్లలో కోటేశ్‌ అనే దళిత యువకుడిని గుంజకు కట్టి, కిరోసిన్‌ పోసి, కాల్చారు. ఇది కలవరపాటుకు గురిచేసింది. ఇంకా ఎన్నో జరిగాయి కానీ అంతగా బయటకు రాలేదు. అయినా భవిష్యత్తులోనైనా అంతరాలు తొలగిపోతాయన్న ఆశతో దళితులు ముందుకు నడిచారు. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల్లో భాగస్వాములయ్యారు.

ఇట్లా వెండిపండుగ జరుపుకొన్నామో లేదో, బీహార్‌లోని బెల్చిలో 1977 మే 27న ఎనిమిది మంది దళితులను చేతులు కట్టేసి కాల్చి చంపి, ఒక చితి మీద తగులబెట్టారు. ఇదంతా ఒక ఆధిపత్యకుల భూస్వాములు చేసిన నీతిమాలిన చర్య. 1985లో కారంచేడులో, 1991లో చుండూరులో దళితులను ఊచకోత కోసిన ఘటనలు ఇంకా కళ్ళ ముందు రక్తమోడుతున్నాయి. గుండెగాయాల్ని కెలుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మన స్వతంత్ర భారతావని మరో మైలురాయిను దాటి స్వర్ణోత్సవం జరుపుకొంది 1997లో. అదే ఏడాది బీహార్‌లోని లక్ష్మణ్‌పూర్‌ బాతేలో 58 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. అయినా దళితులు రాజ్యాంగంపై అంతులేని విశ్వాసంతో ఆ ఉత్సవాల్లోనూ భాగస్వాములయ్యారు. ప్రతి ఏటా జెండా పండుగను ఈ దేశ దళితులు చేసుకుంటూనే ఉన్నారు. 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి ఘటన సహా చెప్పుకుంటూ పోతే... కొన్ని వేల ఘటనలు స్వాతంత్య్ర సంబరాలతో దగాపడ్డ దళితన్నల గుండెలు చీల్చుకొస్తాయి. 

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ సేకరించిన లెక్కల ప్రకారం 1994 నుంచి 2020 మధ్య 26 ఏళ్ళలో 17,835 మంది దళితులు హత్యకు గురయ్యారు. 44,506 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల చేతుల్లో అత్యాచారాలకు బలయ్యారు. అంతేకాక 85,219 మంది దళితులపైన తీవ్ర భౌతిక దాడులు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది అంగవికలురు అయ్యారు. మనదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడానికి బ్రిటì ష్‌ వాడు వాళ్ళతో మనల్ని సమానంగా చూడక అవమానాలకు గురిచేయడమే కారణమంటాం. మరి, మన దేశంలో ఉన్న కుల సమాజ అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? వీటినెవరు ప్రశ్నిస్తారు? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? నా దళిత సోదరులపై ఏటేటా దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతోన్నస్థితి దేన్ని సూచిస్తోంది? నేనీ దేశ పౌరుడినేనా? అందుకే అమృతోత్సవాన్ని తలచుకున్న ప్రతిసారీ ఈ అనుమానం వెంటాడుతూనే ఉంది.

అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2004లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2014లో 704 మంది, 2020లో 902 మంది అగ్రకుల దాడుల్లో మరణించారు. 16 ఏళ్ళలో దళితులపై అఘాయిత్యాలు రెండింతలు పెరిగాయి. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడి ఉంటే, ఈ దాడులు తగ్గాలి. కానీ ఏటేటా పెరుగుతూనే ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఈ స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? 2004లో 1157 మంది అత్యాచారాలకు బలైతే, 2020లో ఆ సంఖ్య 3396కి చేరింది. అంటే దళిత స్త్రీలపై అత్యాచారాలు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు చాలా విషయాల్లో తమ ఆందోళన ప్రకటిస్తుంటారు. దళితుల విషయానికి వస్తే నిజంగా ఉండాల్సినంత స్పందన లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాలూ అంతే. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో మా ఇంటిపైన ఏ జెండా ఎగురవేయాలి? ఫోన్‌లో డీపీని మార్చుకోమంటారా? ఆ పని ఎలా చేయగలను? ఇప్పుడు ఈ విషయం రాయడంతో అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ దేశంలోని ఇతర కులమతాల పెద్దలు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, రాజకీయ వేత్తలు ఆలోచిస్తారని ఆశ. రాబోయే తరాలు ఈ స్వాతంత్య్ర సంబరాల్లో తమ పాత్రను ఎంచుకుంటారనే భావన. అంతే!

 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులుమొబైల్‌: 81063 22077 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top