హిందీభాషకు దక్షిణ వారధి పీవీ

Dr VV Rama Rao Article On PV The Southern Bridge To Hindi - Sakshi

విశ్లేషణ

బహుముఖి అయిన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును ఎలా అంచనాకట్టాలో తెలియడానికి జనం ఆయనకు ఇచ్చిన పేర్లో, బిరుదులో పరిశీలిస్తే చాలు. అపర చాణక్యుడు, మౌనముని, సంస్కరణల పితామహుడు, ఇంకా సాహితీవేత్త, బహుభాషావేత్త. అయితే ఆయన్ని పరిశీలించడానికి ఇంకోకోణం ఉంది. ఒక దక్షిణాదివాడు ఉత్తరాది భాష అయిన హిందీలో జెండా ఎగరేయడం. అక్కడి గొప్ప రచయితలు మెచ్చేంత అపర పండితుడిగా వెలగడం. ‘వేయిపడగలు’ లాంటి తెలుగు మహారచనను హిందీలోకి అనువదించడంతోపాటు, సాక్షాత్తూ దేశ రాజ్యాంగాన్నే ఆయన హిందీలోకి తర్జుమా చేశారు. ఆయన శతజయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్న సందర్భంగా తెలుగువాడైన పీవీ ఠీవీని మరోసారి గుర్తుచేసుకుందాం.పీవీ నరసింహారావు పేరు తలవగానే వెంటనే స్ఫురించేది ఆయన బహుభాషా అధ్యయనశీలత. భాషాపిపాస, అయనకు బాల్యంతోనే అంకురించింది. హైస్కూలు చదువు పూర్తయ్యేసరికి తెలుగుతో పాటు పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలలో మంచిపట్టు సాధించారు. ఇంటర్‌ మొదలు ‘లా’ వరకు మహారాష్ట్రలో చదవడం వలన మరాఠీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. 

నాటి నిజాం రాష్ట్రంలోని దక్కనీ ఉర్దూకు హిందీ భాషతో చాలా సారూప్యత ఉండటం మూలాన, పీవీకి హిందీ పట్ల ఆసక్తి కలిగింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయ నాయకులైన గాంధీజీ, నేతాజీ, నెహ్రూ లాంటివాళ్లు హిందీలో చేసిన ప్రసంగాలు, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లిన నాగపూర్‌లో తరచూ జరిగే హిందీకవి సమ్మేళనాలు మరింత ఆకర్షణ కలిగించాయి. అలా 1946 సంవత్సరంలో అలహాబాద్‌ యూనివర్సిటీ నుండి హిందీ ‘సాహిత్యరత్న’ (ఎంఏ) పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హిందీలో పరిశోధన చేయాలని అభిలషించి, సుప్రసిద్ధ కవ యిత్రి మహాదేవి వర్మ రచనలను లోతుగా అధ్యయనం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా వుంటే, హిందీలో డాక్ట రేటు పట్టా సాధించి అలహాబాద్‌లో యూనివర్సిటీ ఆచార్యుడై వుండే వారు. జీవితం ఎంతో విచిత్రమైనది. అనుకొనేవి జరగవు. ఆశించి నవి లభించవు. పీవీ విషయంలోనూ జరిగిందదే! ‘ర్యాంగ్లర్‌’ కావాలనుకున్నాడు. ఆస్ట్రానమీ అందలేదు. హిందీ ఆచా ర్యుడు కాలేదు. వకీలుగా కూడా స్థిరపడలేదు. ఆయన ఐచ్ఛికాంశం సైన్సు. స్మరించింది సాహిత్యాన్ని. కానీ ఆయనను వరించింది పాలిటిక్స్‌. 

స్వామి రామానంద తీర్థ ఆదేశాన్ని శిరసావహించిన పీవీ 1948లో హైదరాబాద్‌ స్టేటు భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాజకీయాలకు దూరంగా, సమాజానికి దగ్గరగా ఉండాలని భావించారు. జర్నలిజంపై మనసు పడి, కాకతీయ వార్తాపత్రికను మూడేళ్ల పాటు నిర్వహించి, తొలి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ నుంచి పిలుపు రావడంతో, పత్రికను మూసివేసి ప్రజాసేవపై దృష్టి పెట్టారు. 1952 ఎన్నికలలో ఓడిపోయాక,  తిరిగి హిందీ భాషా, సాహిత్య సేవపై దృష్టిపెట్టి, తుది శ్వాస వరకు కొనసాగించారు. భారత రాజ్యాంగాన్ని ‘భారతీయ సంవిధాన్‌’ శీర్షికన ఆంగ్లంలోంచి హిందీలోకి అనువదించి తన హిందీ రచనకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ సత్యనారాయణ అనుమతితో ‘వేయిపడగలు’ నవలను, ‘సహస్రఫణ్‌’ పేరిట అనువాదానికి పూనుకొన్నది 1955–56 మధ్యకాలంలోనే! పద్నాలుగు సంవత్సరాల కృషి ఫలంగా వెలువ డిన ‘సహస్రఫణ్‌’ యావత్‌ భారతంలోని హిందీ సాహిత్య అభిమా నులను అలరించడమే కాదు, పీవీకి ‘కేంద్ర హిందీ నిర్దేశాలయ్‌’ వారి పురస్కారాన్నీ ప్రసాదించింది. పీవీ తొలుత విశ్వనాథ ‘ఏకవీర’ను కొంతభాగం అనువ దించారు. తదుపరి ‘చెలియలి కట్ట’ను పూర్తిగా తర్జుమా చేశారు. కానీ ప్రేమ, శృంగారంతో కూడిన రచనలుగా భావించి ప్రచురణకు అంగీకరించలేదనీ, సంస్కృతీ సాంప్రదాయాలకు, సామాజిక విలువ లకు అద్దం పట్టిన ‘వేయి పడగలు’ నవలనే ఇష్టపడి హిందీసేత చేశారని హిందీ సాహితీవేత్త ఆచార్య భీమ్‌సేన్‌ నిర్మల్‌ అన్నారు.

హిందీ సాహితీ ప్రక్రియలలో పీవీ కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వాన్ని, హిందీలోని ఛాయావాద కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. మహాదేవి వర్మ కవిత్వంలోని ఛాయావాదం, దుఃఖవాదం, రహస్యవాదం మొదలైన విభిన్న పార్శా్వలను ఆవిష్కరిస్తూ ఆమె షష్టిపూర్తి అభినందన సంచిక కొరకు రాసిన ఇరవై ఐదు పేజీల సుదీర్ఘ వ్యాసం, పీవీ సిద్ధాంత వ్యాసానికి సంగ్రహపత్రంగా భావించవచ్చు. వివిధ సందర్భాలలో పీవీ చేసిన హిందీ ప్రసంగాలు, వివిధ సంచికలు, పత్రికలకు రాసిన వ్యాసాలు కూడా ఎన్నదగినవి. ఈ ప్రసంగ వ్యాసాలు, ఆయన హిందీ భాషా సాహిత్య దృక్పథాన్ని మాత్రమే కాదు, భారతీయ భాషలలో హిందీ స్థానాన్ని, భారతీయ సంస్కృతీ విలువల పరిరక్షణలో హిందీ సాహితీవేత్తల కవుల కృషిని విస్పష్టం చేశాయి. 

భారతీయ భాషల ఆదాన ప్రదానాలకు హిందీ వారధి వంటిదనీ, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే హిందీ సాంస్కృతిక సమైక్యతకు నాంది పలికిందనీ సోదాహరణంగా వివరించారు.  హిందీ కథా రచయిత ప్రేమ్‌చంద్‌ శతజయంతి సందర్భంగా ‘గగనాంచల్‌’ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రేమ్‌చంద్‌ సాహిత్యం సమకాలీనతను సార్వకాలీనతను ప్రతిబింబించాయని తెలిపారు.  పంజాబీ భాషలో కొత్తగా కవిత్వం రాసే వారెవరైనా సరే, వారు అమృతాప్రీతమ్‌ కవిత్వాన్ని ప్రేమించకుండా రాస్తే వాళ్లు కవులే కాలేరని వ్యాఖ్యానించారు. 1983లో తృతీయ ప్రపంచ హిందీ మహాసభల సందర్భంగా హిందీని అంతర్జాతీయ భాషగా పరివ్యాప్తి చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పీవీకి హిందీ భాషా సాహిత్యాల పైనే కాదు, హిందీ సాహిత్య చరిత్ర పట్ల ఎంతో సాధికారత ఉన్నది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హిందీ సాహిత్య చరిత్ర గ్రంథానికి రాసిన 35 పేజీల ముందుమాట ఇందుకు నిదర్శనం. చివుకుల పురుషోత్తం ‘ఏది పాపం’? తెలుగు నవలను అలహాబాద్‌కు చెందిన సూర్యనాథ్‌ ఉపాధ్యాయ ‘క్యాహై పాప్‌’ శీర్షికను హిందీలోకి అనువదించారు. దీనికి పీవీ రాసిన పీఠిక కూడా విలువైనదే.

భారత ప్రధానమంత్రిగా హిందీ భాషలో ప్రమాణస్వీకారం చేసి ఆ భాష పట్ల తన ప్రేమను వెల్లడించారు. ఇందిరాగాంధీ దక్షిణ భారత ప్రచార సభకు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, పీవీని ఉపాధ్యక్షులుగా నియమించి కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు చేశారు. ఈ హిందీ ప్రచార సభకు విశ్వవిద్యాలయ స్థాయి ఏర్పడినాక, పీవీయే వైస్‌ ఛాన్స్‌లర్‌గా వ్యవహారించారు. ఆయన వీసీగా ఉన్నప్పుడే సాహిత్య ప్రధానమైన ఎంఏను పాఠ్యక్రమాన్ని తొలిసారిగా భాషా ప్రధాన పాఠ్యక్రమంగా అమలు చేశారని నాటి రిజిస్ట్రార్‌ వేమూరి ఆంజనేయ శర్మ ఒక చోట వివరించారు. 

కేవలం ఎంఏ సాహిత్యం చదివితే వారు టీచర్లుగా పనిచేయడానికే పనికొస్తారు. ఫంక్షనల్‌ హిందీగా సిలబస్‌ తయారు చేసి శిక్షణ ఇస్తే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా ఉపకరిస్తారన్నది ఆయన సమున్నత భావన. ఈ ఆలోచనను అనంతరం అన్ని యూనివర్సిటీలు అమలు చేశాయి. హిందీ మాతృభాష కాని హిందీ రచయితలను ఎంతో ప్రోత్స హించారు. అఖిల భారత హిందీ సంస్థాన్‌ అధ్యక్షుడిగా ఉంటూ ‘సమవేత్‌ స్వర్‌’ హిందీ ద్వైమాసిక పత్రిక ప్రచురణను ప్రోత్సహిం చారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో (1991– 96) దక్షిణ హిందీ ప్రచార సభకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించి, హిందీయేతర ప్రాంతాలలో హిందీభాష కోసం జరుగుతున్న కృషిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే వాజ్‌పేయి కవితా సంకలనం ‘మేరీ ఇక్యావన్‌ కవితాయే’ను ఆవిష్కరించి, కూలంకషంగా విశ్లేషించారు. 

భారతీయ భాషల ద్వారా కంప్యూటర్‌ నడపటం సాధ్యం కాదని కంప్యూటర్‌ విశేషజ్ఞులే తేల్చిన తరుణాన పీవీ పూనుకుని హిందీలో సిద్ధార్థ వర్డ్‌ ప్రాసెసర్‌ను తయారు చేయించారు. అనంతరం లిపి వర్డ్‌ ప్రాసెసర్‌తో హిందీలో డి.సి.ఎ. ప్రారంభించారు. తరువాత జిస్టు కార్డు మార్కెట్‌లోకి వచ్చాక, ఎం.సి.ఎ. కూడా ప్రారంభించారు. భారతీయ భాషలలో కంప్యూటర్‌ నడుస్తుందని నిరూపించిన సాఫ్ట్‌వేర్‌ మేధావి పీవీ!                 
 
డా‘‘ వి.వి.రామారావు 
వ్యాసకర్త ప్రముఖ రచయిత  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top