అందమైన సమాజం!!  | ​Miss Gibraltar Shania Ballester sets off for Miss World pageant in India | Sakshi
Sakshi News home page

అందమైన సమాజం!! 

May 22 2025 1:55 AM | Updated on May 22 2025 1:55 AM

​Miss Gibraltar Shania Ballester sets off for Miss World pageant in India

మాది జిబ్రాల్టర్‌

మిస్‌ వరల్డ్‌ 2025

హైదరాబాద్‌లోని ట్రై డెంట్‌ హోటల్‌లో మిస్‌ వరల్డ్‌ 2025 పాజంట్స్‌ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్‌. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్‌ ఫ్రమ్‌ జిబ్రాల్టర్‌’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్‌. 

చిన్న దేశం 
‘‘మిస్‌ వరల్డ్‌ 2025కి క్యాప్షన్‌ బ్యూటీ విత్‌ పర్పస్‌. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్‌ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్‌ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్‌ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది.  

ప్రపంచానికి పరిచయం 
నా కెరీర్‌ మోడలింగ్‌. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్‌ మీద దృష్టి పెట్టాను. మిస్‌ జిబ్రాల్టర్‌ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్‌ ఓవర్సీస్‌ టెరిటరీగానే. ఈ మిస్‌ వరల్డ్‌ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. 

అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. 

అందం మనసుదే 
మా జిబ్రాల్టర్‌ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్‌ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్‌ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్‌ వరల్డ్‌ జిబ్రాల్టర్‌ షానియా బాలెస్టర్‌.  
 

మా జిబ్రాల్టర్‌ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్‌ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.
– షానియా 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 
ఫొటోలు: ఎస్‌ ఎస్‌ ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement