ఈవారం కథ: భార్య

Wife Translated Telugu Weekly Short Story By T Shanmukha Rao In Funday - Sakshi

మిసెస్‌ ఒమూరా వంట గదిలో వున్నగడియారం వైపు చూసింది. సరిగ్గా సాయంత్రం అయిదు గంటలైంది. కానీ అప్పుడే శరత్‌ కాలపు చీకట్లు టోక్యో నగరాన్ని ఆక్రమించు కొంటున్నాయి. ఇక పిల్లలు ఏ క్షణంలోనైనా ఇల్లు చేరుకుంటారు.
కుమార్తె సేట్సూకు పన్నెండేళ్ళు. ఆమె ఈరోజుల ఆడపిల్లల మాదిరిగానే  కలల్లో తేలియాడుతూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు పాశ్చ్యాత్య అలవాట్లకు లోనవుతున్నారు. మార్పుని ఆపడం  సాధ్యమయ్యే పనికాదు.
అంతలోనే తోటగేటు శబ్దం అయింది. కుమారుడి పిలుపూ  వినపడింది. ‘అమ్మా! నేనొచ్చేసాను.’
‘వస్తున్నా తోరూ!’ ఆమె వెళ్లి తలుపు తీసింది. 
పిల్లవాడు తన షూని ద్వారంవద్దనే పడేసి లోనికి దుమికాడు. ఈ ఇల్లు ఇంకా జపనీయుల సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది. ఆమె పిల్లల్ని షూతో లోనికి రానివ్వదు. 
‘అదంతా సుద్దేనమ్మా! నాన్న వున్నాడా?’
ప్రతిరోజూ  వాడీప్రశ్న వేస్తూనే ఉంటాడు. అది ములుకులా ఆమె గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. వాడికి తండ్రి  సమక్షం కావాలి.  
‘ఆ పుస్తకాల్ని అలా పడేసిరా. మీఅక్క సేట్సూ రాగానే మనం భోంచేద్దాం.’
అంతలోనే ‘అమ్మా..’ అంటూ సేట్సూ వచ్చింది. షూని తీసి బయటపడేసి నిశ్శబ్దంగా వంటగదిలోకి ప్రవేశించింది. ఆమె తన  వయస్సు  కన్నా  బాగా పొడగరి.  
‘సేట్సూ! ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు.’
‘ట్రాఫిక్‌ చాలాఎక్కువగా ఉందమ్మా. మా బస్సు అడుగడుక్కీ ఆగిపోయింది.’

జపానీ యువతులు అమెరికన్లని అనుకరిస్తున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సేట్సూ మారాంచేస్తే  ఒకరోజు రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్సుకి ఆమెతోపాటు తల్లి కూడా వెళ్ళింది. అక్కడి దశ్యాలు ఆమెకు వెగటు కలిగించాయి. ఆతరువాత కుమార్తె నూ వెళ్లనివ్వలేదు. కానీ ఈ కొత్త టోక్యో నగరంలో ఏ స్త్రీ అయినా తన భర్త లేక తన పిల్లల నడవడికలోని మంచిచెడ్డల్ని నిర్ధారించుకోలేకపోతోంది. భర్త తన పట్ల విశ్వాసంగాలేడేమో అన్న అంశాన్ని కూడా పక్కన పెట్టక తప్పడంలేదు. ‘ఏస్త్రీ అయినా తన భర్తపట్ల ఊహలో కూడా విశ్వాస   రాహిత్యం కలిగివుండకూడదు’ అని తన తల్లి పదేపదే చెబుతుండేది.  

సేట్సూ కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చింది. డైనింగ్‌ టేబిలు మీద ప్లేట్లనూ ఛాప్‌ స్టిక్‌ లనూ పేర్చసాగింది. ‘అమ్మా! నాన్నకోసం కూడా ఒక ప్లేట్‌ పెట్టనా?’ అన్నది.
‘మీ నాన్న ఇప్పట్లో రాడని నీకు తెలుసు.’
తల్లీ కుమార్తెల మధ్య నిశ్శబ్దం చోటు చేసుకొంది. కానీ సేట్సూ ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ‘ప్రతిరోజూ నాన్న బార్‌  వెళ్ళడానికి నువ్వెందుకు ఒప్పుకుంటున్నావో నాకైతే అర్ధం కావడం లేదమ్మా.’
మిసెస్‌ ఒమూరా  కొంతసేపు మాట్లాడలేకపోయింది. 
‘‘అతడ్ని నువ్వు ఎందుకు వెళ్ళనిస్తున్నావు?’
‘గెయిషాల ఇళ్ళు లేవు కాబట్టి మగవాళ్ళు బార్లకు వెళ్తారు. మరి ఎక్కడికి వెళ్ళగలరు?’
‘ఇంటి వద్దనే ఉండొచ్చు కదా?’ అన్నది సేట్సూ.
‘వ్యాపార వ్యవహారాలు కూడా ఉంటాయట.’
సేట్సూ వెటకారంగా అన్నది  ‘వ్యాపారమా? బార్లలోనా? అదేం వ్యాపారం?’ అంటూ సేట్సూ  తన మనసులోని మాటల్ని చిరాగ్గానే బయటకు అన్నది. ‘నాన్న వేకువన రెండు గంటలకు వస్తాడు. అతనికోసం నువ్వు చిరుననవ్వుతో ఎదురుచూస్తుంటావు. ఇంకా జాలిపడ్డం ఒకటి! అయ్యో! నువ్వు బాగా అలసిపోయావు. రోజంతా కుటుంబంకోసం శ్రమిస్తున్నావు. ఇదిగో వెచ్చని టీ తీసుకో. నీస్నానానికి వేడినీరు సిద్ధంగా వుంచాను. పిల్లలు బడికి వెళ్లినంతవరకూ నిద్రపో  అంటుంటావు’ సేట్సూ తన తల్లిగొంతునీ  హావభావాల్నీ అనుకరించింది. 

మిసెస్‌ ఒమూరా నివ్వెరపోయింది . అంటే రోజూ  ఇదంతా సేట్సూ మేలుకొని వింటున్నదన్న మాట.
‘సేట్సూ ! నువ్వు చాలా పెంకి పిల్లవైపోతున్నావు’ అన్నది తల్లి. 
‘సేట్సూ గది విడిచి వెళ్ళింది.
మిసెస్‌ ఒమురా ఈ హఠాత్పరిణామానికి కొంతసేపు అవాక్కయింది. తరువాత కుమార్తెని పిలిచింది.. ‘సేట్సూ ఇలారా.’
అయిష్టంగానే ఆ అమ్మాయి వెనక్కు వచ్చింది.
మిసెస్‌ ఒమురాకు తన కుమార్తె ఎంతో పెద్దదానిలాగా అపరిచయస్తురాలిలాగా  కనపడింది. ‘నాస్థితిలో నువ్వుంటే ఏంచేస్తావు?’
‘నేనూ అతనితో బార్‌కు వెళ్తాను.’ సేట్సూ ఆలోచించకుండానే సమాధానం చెప్పింది.
సేట్సూ మళ్ళీ అన్నది ‘మేం  పెద్దవాళ్లమైతే నీలాగా మా భర్తల్ని బార్లకు వెళ్లనివ్వం.’  
మిసెస్‌ ఒమూరా గుండ్రని ముచ్చటైన తన కుమార్తె ముఖంలో,  ఆనల్లని కళ్ళలో ఒక నిశ్చితత్వాన్ని కనుగొన్నది. ‘నువ్వు దుస్తులు మార్చుకొని తోరూని పిలువు. మనం భోంచేద్దాం. తరువాత మీరు హోంవర్క్‌ చేద్దురు గాని’ అన్నది.  
ఆసాయంత్రం సాధారణంగానే గడిచింది. ముగ్గురూ నిశ్శబ్దంగా భోజనం ముగించారు. 
ఏనాటినుండో ఆమె గుండెల్లో నిద్రాణంగా వున్న వ్రణానికి ఆచిన్నారి మాటలుములుకుల్లా   గుచ్చుకొని మరింత లోతుగా కెలికాయి. 
పిల్లలిద్దరూ నిద్రపోయిన తరువాత సేట్సూ మాటల్ని గూర్చి ఆలోచిస్తూ ఆమె తన దుస్తులున్న బీరువా వైపు నడిచింది. ఒకనాడు అమెరికన్లని సంతృప్తిపరచడానికి, తన భర్త తనకోసం కొన్న పాశ్చాత్య దుస్తుల్ని తీసింది. జుట్టు దువ్వుకొని వెనుక ముడి పెట్టుకున్నది. మెడలో ముత్యాల హారం వేసుకున్నది. మరీ ముచ్చటగా కనపడ్డంలేదు గానీ అందవికారంగా కూడా లేదు. 

పిల్లలు నిద్రపోతున్నారు కనుక బయటినుండి ఇంటికి తాళం వేసింది. 
భర్త వెళ్తున్న బార్‌ పేరు ఆమెకు తెలుసు. గేటు తెరుచుకొని  రోడ్డు మీదకు వచ్చి టాక్సీని ఆపింది. ‘గోల్డెన్‌ మూన్‌ బార్‌’ అన్నది. గతంలో ఆమె ఎప్పుడూ ఒంటరిగా టాక్సీ ఎక్కలేదు. 
బార్‌ చేరుకున్నది. ఎర్రని దుస్తులు ధరించిన ముగ్గురమ్మాయిలు క్యాబ్‌ వద్దకు వచ్చారు. దిగుతున్న మహిళను చూసి ఆగారు. టాక్సీవాలాకు డబ్బు చెల్లించి ఆ అమ్మాయిలవైపు చూసింది. ‘నేను నాభర్తని కలుసుకోవాలి.’ అన్నది. 
వారిలో పొడవైన అమ్మాయి అడిగింది ‘ఎవరాయన?’
‘మిస్టర్‌ ఒమూరా, సకూరా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌.’
అమ్మాయిలు వెనక్కి అడుగు వేశారు. ‘ఓహ్‌! మిస్టర్‌ ఒమూరా! మాకాయన బాగా తెలుసు. చాలామంచివాడు.’ 
భర్త పేరు చెప్పగానే వారామెని మరింత గౌరవంగా చూసారు. ప్రవేశ గది వరకూ తోడుకొని వెళ్లారు. ‘మేడం! మిసెస్‌ ఒమూరా వచ్చారు’ అని అక్కడి లేడీ మేనేజర్‌తో చెప్పారు.
ఆమె అచ్చంగా పాశ్చ్యాత్య రీతిలో వున్నది. మర్యాదపూర్వకంగా చేతులు చాచింది. ‘మిస్టర్‌ ఒమూరా బార్‌ లో వున్నారు. మీరు వస్తున్నారని ఆయనకు తెలుసా?’  
నిజమే చెప్పింది. ‘నేనొస్తున్నానని ఆయనకు తెలీదు. ఊరికే చూసిపోదామని వచ్చాను.’ అక్కడి మేడమ్‌కు అర్థమయింది. ఆమె ఇటువంటి వారిని  ఎందర్నో చూసింది.
మేడమ్‌ ఒక చిన్న గదిని చూపింది. అక్కడ ఓకే టేబిలూ రెండు కుర్చీలూ  వున్నవి. ‘ఇక్కడ కూర్చొండి. ఒకామె వచ్చి మీకు కొంత కాలక్షేపాన్ని ఇస్తుంది.’
కొద్ది  నిముషాల్లోనే ఒక మహిళ లోపలికి వచ్చింది. స్త్రీయైన ఒమూరాకే కళ్ళు చెదిరాయి. ఆమె ఒక అద్భుత సౌందర్యరాశి! సుమారుగా ఇరవై ఎనిమిదేళ్లు ఉండొచ్చు. యవ్వనపు ఛాయలు ఇంకా పోలేదు. ‘మేడమ్‌  నన్ను మీతో కూర్చో మన్నది.’
‘థేంక్యూ’ అన్నది మిసెస్‌ ఒమూరా. 

మిసెస్‌ ఒమూరాకు ఆక్షణంలో బిగ్గరగా ఏడవాలనిపించింది. ఆసౌందర్యరాశి ముఖకవళికల్లో  స్నేహార్ద్రత ఉట్టిపడుతున్నది. తన గోడంతా ఆమెతో చెప్పుకోవాలనిపించింది.  
‘మీరు ఊహించ లేరు’ అన్నది మిసెస్‌ ఒమూరా అస్పష్టంగా. ‘సంవత్సరాల తరబడి ఇంట్లో ఒంటరిగా కూర్చొని అతడు రాత్రి రెండు గంటలకు వచ్చేవరకూ కళ్ళు కాయలు కాచినట్టు వేచివుండటం చాలా కష్టంగా వుంది. అప్పుడు కూడా ఏమీ ప్రశ్నించకుండా బలవంతపు చిరునవ్వు అతికించుకొని అతడ్ని స్వాగతించడం ఇంకా కష్టంగావుంది. ఏమన్నా అడిగితే కోపగించుకొని అసలే ఇంటికి రాడని మరో భయం. ఇవన్నీ మీకు తెలీవు. అసలు ఊహించలేరేమో!’

సౌందర్యరాశి తల ఊపింది. ‘నాకు తెలుసు. మీవంటివారు చెప్పారు. ఇప్పుడు నేనేం చేయ్యాలి?’ అంటుండగానే మిసెస్‌ ఒమురాలో అనాదిగా అలవాటైన బాధా, గాయపడిన అనురాగబంధం, పురాతన సంప్రదాయంగా అణగారిన లోతయిన విషాదం, ఒక్కసారిగా పెల్లుబికాయి. సంవత్సరాలతరబడి ఘనీభవించిన తీవ్రమైన మనోవేదన కన్నీటిరూపంలో వెలికివచ్చింది. ఆమె నిట్టూరుస్తూ మాట్లాడింది. మాట్లాడుతూ నిట్టూర్చింది. వాక్యాలు కూడా ముక్కలు చెక్కల య్యాయి. ‘మీవంటి స్త్రీలు మాకోసం ఆలోచించాలి. మేం  సాధారణ గృహిణులం. పిల్లల్ని కంటాం..వారిని సాకుతాం.. వంటచేస్తాం.. బండెడు చాకిరీ చేస్తాం..ఇంటిని నడుపుతాం.. శ్రమనీ వేదననీ దిగమింగుకుంటాం. మేం పనిమనుషులుగా పిలిపించుకోని పరిచారికలం.

భర్తకోసం ఆరాటపడుతుంటాం. ఇంటివద్దనే వుండి  వేయికళ్లతో అతని కోసం ఎదురు చూస్తుంటాం. మీరు అతడ్ని మానుండి దూరం చేస్తున్నారు. అతడి శోభాయమానమైన యవ్వనం, ఉజ్జ్వలమైన కాలం, అతడి ఆహ్లాదకరమైన ఆలోచనలూ, మనసుకి నచ్చిన మాటలూ, చిరునవ్వులూ, చిలిపితనాలూ  అన్నీ మీరే గుంజుకొంటున్నారు. అతని జీవితాన్నే హరించి వేస్తున్నారు. అతడు శూన్యంగా..మౌనంగా  ఖాళీ మనస్సుతో.. అలసిన శరీరంతో.. నిస్సత్తువతో అర్థరాత్రి దాటిన తరువాత  ఇల్లుచేరుకొంటున్నాడు.  అతడు ఇంటికి రాగానే నేను మరింత ఒంటరినైపోతున్నాను. ఏకాకినైపోతున్నాను’ ఇక ఆమెకు మాటలు పెగల్లేదు.

ఎదురుగావున్న అందమైన ముఖం వివర్ణమైపోయింది. ఆశ్చర్యం నుండి కోలుకొని ఆత్మరక్షణలో పడిపోయింది. ‘ఇవన్నీ నేను ఆలోచించలేదు.. మిసెస్‌ ఒమూరా ! నా ఊహకే అందలేదు. నిజం చెప్పనా? అతడంటే నాకు అసహ్యం.’
మిసెస్‌ ఒమూరా మనస్సు చివుక్కుమంది. కాస్త చిరుకోపంతోనే అడిగింది.. ‘మీరెందుకని అతడ్ని ఏవగించుకుంటారు? అతడు మంచివాడు.’
‘నా దృష్టిలో అతడొక  మగవాడు. అంతే’’ ఆసౌందర్య రాశి అన్నది. ‘ఆమాటకొస్తే  నేను మొత్తం  పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తాను.‘
మిసెస్‌ ఒమూరా.. ఆమె నల్లని  కళ్ళలోకి నిశితంగా చూసింది. ‘ఎందుకని?’

సౌందర్యరాశి తల ఊపింది. ‘మగవాళ్ళంతా ఒక్కటే!’ అని ఆగి మళ్ళీ అన్నది.. ‘అందరూ మూర్ఖులు, అహంకారులు. డబ్బు చెల్లించిన ప్రతీ మగవాడిపట్లా మేం ఒకేలా ప్రవర్తిస్తామని గ్రహించగలిగే కనీస వివేకం కూడా వారికి ఉండదు. నేనిక్కడికి నాపదహారేళ్ళ వయస్సులో వచ్చాను. ఆనాటినుండి నేటివరకూ ఒక పుష్కరకాలపు ముఖస్తుతులూ..లాలింపులూ.. బుజ్జగింపులూ..ఇవికాక కుళ్లిపోయిన హాస్యోక్తులకు పగలబడినవ్వాడాలూ.. పనికిమాలిన చచ్చు సరసోక్తులకు ఉబ్బితబ్బిబ్బయినట్లు నటించడాలూ..ఎందుకూ కొరగానివాడిని ఇంద్రుడవనీ చంద్రుడవనీ మెచ్చుకోవడాలూ..మనసు చంపుకొని మారాంచెయ్యడాలూ..ఛీ! జీవితం మీదనే విరక్తి పుడుతుంది. అందరూఒక్కటే . స్వార్ధపరులు. వ్యర్థులు.’
మిసెస్‌ ఒమూరా అడ్డుకున్నది ‘మీకు పిల్లల్లేరనుకుంటాను.’
‘అదొక్కటే మా అదృష్టం. నేనూ మీలాగా స్వేచ్ఛగా ఉన్నట్లయితే ఒక చిన్న దుస్తుల దుకాణాన్ని పెట్టుకునే దాన్ని. మళ్ళీ మగవాడి ముఖం చూడను. ఎప్పటికీ చూడను.ఇది నిశ్చయం.’  
‘అయితే ఆపని చెయ్యండి. నాభర్తని విడిచిపెట్టండి. అతడు నాకూ పిల్లలకూ కావాలి.... వాస్తవానికి...’ ఆమె సిగ్గు పడింది. ‘అతడు మాక్కావాలి. ’
సౌందర్యరాశి నిట్టూర్చింది. ‘నేను బద్ధకిష్టినైపోయాను.. మిసెస్‌ ఒమూరా! ఈ ఉపాధి నాకు సుళువు అయిపొయింది . ఈ జీవనవిధానం మార్చుకోవడానికి బలమైన ప్రోద్బలం కావాలి. ఎవరైనా ఆసరా ఇస్తేగానీ గార్మెంట్‌షాపు ఏర్పాటు చెయ్యడం సాధ్యం  కాదు.’
బార్‌ని విడిచి బయటకు వచ్చింది మిసెస్‌ ఒమూరా. 
సౌందర్యరాశి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పింది. 

ఒమూరా టాక్సీని పిలిచి వెనుకసీట్లో కూర్చున్నది. ఆమె మనస్సులో రెండుమాటలు స్పష్టంగా ధ్వనిస్తున్నాయి. ఒకటీ ఆ సౌందర్యరాశి పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తున్నది. రెండూ తనకో స్వంత జీవితాన్ని ఏర్పరచుకోవాలి. 
ఇంటికొచ్చిన తరువాత ఈమాట ఆమాట అయ్యాక భర్తతో అన్నది ఆమె ‘నేను కూడా  కొంత సంపాదిస్తే మీరింత శ్రమ పడాల్సిన అవసరం గానీ, రాత్రుళ్లు కూడా బార్లలో వ్యాపారలావాదేవీలు చెయ్యాల్సిన పని గానీ ఉండదు.’
ఆసక్తి లేకుండానే అడిగాడతడు ‘నువ్వేంచేయ్యగలవు?’
‘ఒక గార్మెంట్‌షాపు పెట్టాలనుకొంటున్నాను.’
‘నీకు పెట్టుబడి ఎక్కడిది? అయినా ఇలాంటివి ముసలైపోయిన బార్‌ గర్ల్స్‌ పెట్టుకుంటారు. నీ వద్ద పొదుపు మొత్తం కూడా ఏమీ లేదు.’
‘నిజమే నేను బార్‌ గర్ల్‌ అంత అదృష్టవంతురాల్ని కాను.’
కానీ ఆమెకు తనజీవితం తనకు ఉండాలనే తపన ఆగడం లేదు. మిస్టర్‌ ఒమూరా బార్‌కు వెళ్తున్నప్పుడు, పిల్లలు నిద్ర పోతున్నప్పుడూ ఆమె ఒంటరితనం భరిస్తూనే వుంది. బాధను దిగమిగుకుంటూనే వున్నది. 
రెండు నెలల తరువాత ఆమె మరోసారి బార్‌ కు వెళ్ళింది.

ఆ సౌందర్యరాశిని కలుసుకున్నది. ఆమె కూడా మనస్ఫూర్తిగా స్వాగతించింది. ‘ఈరోజు మీరాక నాకెంతో సంతోషంగా వున్నది. నేను నాపొదుపు మొత్తాన్ని తీసి ఒక గార్మెంట్‌షాపు తీసుకున్నాను. చాలాచిన్నదే . కానీ మంచి రద్దీప్రాంతం. ఒంటరిగా ప్రారంభించడానికి ధైర్యం చాలడంలేదు. సహాయంకోసం ఎదురుచూస్తున్నాను.’
ఒక్క క్షణం ఆలోచించిన మిసెస్‌ ఒమూరా 
‘సరే నేనే మీకు సహాయంచేస్తాను’ అన్నది. 

ఆ విధంగా అతి సాధారణంగానూ అతి త్వరగానూ మీసెస్‌ ఒమూరా జీవన శైలి మారిపోయింది. ఆమె పిల్లలు నిద్రపోయిన తరువాత గార్మెంట్‌షాపుకి వెళ్ళసాగింది. ఇలా కొద్ది వారాలు గడిచాయి. ఈలోగా ఆసౌందర్యరాశీ, మిసెస్‌ ఒమూరా  అక్కచెల్లెళ్ళ వలె సన్నిహితులైపోయారు.  
ఒకరోజు సాయంత్రం మిస్టర్‌ ఒమూరా బార్‌ కు వెళ్ళలేదు. కానీ ఆరోజు ఆమెకు త్వరగా షాపు వైపు వెళ్లాలని వున్నది. అమెరికానుండి కొత్త డిజైన్‌ దుస్తులొచ్చాయి. మిస్టర్‌ ఒమూరా తీరిగ్గా పేపరు చదువుకొంటూ కూర్చున్నాడు. కాసేపు చూసి తెగించి అడిగింది . 
‘మీరు ఈరోజు బార్‌కు వెళ్లడం లేదా?’
‘వెళ్ళను’
‘ఏమైంది?’
‘సాయంత్రం నాయింట్లో నేను గడపకూడదా?’ అన్నాడు పేపరు పక్కనపెట్టి. 
ఇక ఆమె ధైర్యం తెచ్చుకున్నది. ‘మీరు ఇంటివద్దనే వున్నారుకదా! నేను బయటికి వెళ్లవచ్చునా?’
అతడు ఆమె కళ్లల్లోకి చూస్తూ ‘ఎక్కడికి?’ అన్నాడు.
‘ఒక స్నేహితురాల్ని చూడటానికి’
‘నేను ఇంట్లో వున్న  మొదటి సాయంత్రమిది. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు’
‘ ........’
‘సరే . వెళ్ళు’

అతడు తన సానుభూతి కోరుకొంటున్నాడని ఆమెకు అర్థమైంది. కానీ ఆసరికే ఆమె హృదయం కరడుగట్టిపోయింది. సంవత్సరాల తరబడి ఘనీభవించిన  వేదనాభరితమైన వజ్ర కాఠిన్యం ఆమెది. ఎన్నో సాయంత్రాలు ఒంటరిగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వేచివుంది. ఎన్నోరాత్రులు దిగులుని దిగమింగుకొంటూ గడిపింది. 
అతనికి ‘థాంక్యూ’ చెప్పేసి బయటకు నడిచింది.  
షాప్‌లో ఈమొత్తం సంభాషణని సౌందర్యరాశితో చెప్పింది. ఆమె కూడా శ్రద్ధగా విన్నది. ‘వద్దు . మనం మగవాళ్ళగురించి మాట్లాడుతూ కాలం వృదా చెయ్యొద్దు’ అన్నది. 
ఇద్దరూ పనిలో పడిపోయారు. గార్మెంట్‌ డిజైనింగ్‌కు కళాత్మక నైపుణ్యం కావాలి. అందుకు ఏకాగ్రత అవసరం. ఆరోజు మిసెస్‌ ఒమూరా రెండు గంటలకన్నా ముందే ఇల్లు చేరుకున్నది. మిస్టర్‌ ఒమూరా కాస్త అసహనంగానే ఎదురు చూస్తున్నాడు. 
‘నువ్వు ఒంటరిగా ఇంత రాత్రివేళ ప్రయాణించడం నాకు ఆందోళన కలిగించింది. ఇంకా యవ్వనంలోనూ అందంగానూ వున్న స్త్రీకి ఇది సురక్షితం కాదు.’
ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో అతడెప్పుడూ ఆమెని మెచ్చుకోలేదు. ఒక్క ప్రియమైన మాటకూడా ఆడలేదు. ఇప్పుడు అతడికి కృతజ్ఞతచెప్పాలని ఆమెకనిపించింది.  ఇకషాపు సంగతి  నిజం చెప్పెయ్యాలనే ఆమె నిశ్చయించుకొంది. 
‘ఒకనాడు మనం డ్రెస్‌ షాపు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా?’
‘వుంది. పెట్టుబడి లేదనికదా ఆగిపోయావు.’ 

‘షాపు ఏర్పాటైంది’ అన్నదామె.  అతడు చటుక్కున ఆమె వైపు తిరిగాడు. ‘అర్థరాత్రి  రెండు గంటలవరకూ షాపులో నువ్వెలావుండగలవు?’ 
‘నేను డ్రస్సులు డిజైన్‌ చేస్తున్నాను.. నాభాగస్వామితో.. ’
‘భాగస్వామా?’అతడిలో పురుషాగ్రహం మేల్కొంది. చివాలున లేచాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ‘ఎవడువాడు?’ అని ఆగి, ‘నేను ముందే తెలుసుకోవాల్సింది. ఆడదాన్ని నమ్మడానికి వీల్లేదు . నువ్వు నాభార్యవి . రాత్రి రెండు గంటలకు ఇల్లు చేరుకున్నావు.’
ఆమె అతడి పట్టుని విదిలించుకుంది. ఒక జీవిత కాలపు క్రోధమూ ప్రతీకారమూ ఆమె జ్ఞాపకాల పొరల్లోంచి కట్టలు తెంచుకొని అగ్నిపర్వతంలాగా బద్దలవడానికి పక్వమైన సమయం ఆసన్నమయింది. ‘నువ్వు .. నువ్వు .. నామానాన  నన్ను వదిలేసి వేకువన రెండుగంటల తరువాత ఇల్లుచేరిన నువ్వు .. పెళ్లయిన కొత్తలో కూడా గెయిషాల ఇళ్లకు పరుగులు తీసిన నువ్వు... ఆతరువాత బార్లకు ఎగబాకిన నువ్వు... ఇల్లూ పిల్లలూ వారి బాగోగులు పట్టించుకోని నువ్వు ...   నీ ఆలోచనలూ,నీసంతోషమూ కుటుంబానికి చెందకుండా చేసిన నువ్వు .. నీ కాలమూ,నీ యవ్వనమూ పరాయి  స్త్రీలకు ధారాదత్తం చేసిననువ్వు..’  ఇలాంటి మాటలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. కానీ ఆమె పెదవిప్పలేదు. 

ఆమె ఈ సభ్య ప్రపంచంలో ‘భార్య’కు నిర్వచనం. అంతలోనే వివేకపూరితమైన అంతర్దృష్టి  మేల్కొంది. 
‘ఈ అభాగ్యుడితో నిజమైన ప్రేమని పంచుకొనేది తాను కాక మరెవరు?ఎన్నో సంవత్సరాలపాటు ఎన్నోవందల రాత్రిళ్ళు గెయిషాల కొంపల్లో, బార్లలో అసలు ఎవరి ఇష్టాన్నీ నోచుకోని చోట, నిజానికి లోలోపలవారంతా  ద్వేషించిన చోట, జీవితాన్ని వృధా చేసిన వాడికి భార్యగా ఇంకా  తనుకాక దిక్కెవరు?’ 
ఆమె మృదువుగా, జాలిగా అన్నది ‘నా వ్యాపారభాగస్వామి ఒక స్త్రీ. పెట్టుబడి ఆమే సమకూర్చింది.’
‘ఒక ఆడదానికి పెట్టుబడి ఎలావస్తుంది?’ మిస్టర్‌ ఒమూరా తీవ్రమైనగొంతుతో అడిగాడు. 
‘ఆమె బార్‌గర్ల్‌గా పనిచేసింది.’

ఒక్కసారిగా మిస్టర్‌ ఒమూరా కళ్ల పొరలు తొలగి పోయాయి. బల్ల మీద కూలబడి, రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు. 
‘ఆమె మిమ్మల్ని ఇష్టపడలేదనే విషయం నేను నమ్మలేక పోయాను. సంవత్సరాల తరబడి మీకు చేరువగావుంటూ మిమ్మల్ని ప్రేమించలేక పోవడం అంటే  నా ఊహకే అందని విషయం’  అంటూ అలవాటుగా మోకరిల్లింది. స్త్రీ ఆభంగిమలోనే  భర్తముందు  వుండాలని ఆమె తల్లి పదే పదే చెప్పేది.         
‘నువ్వు అలా భావిస్తున్నావా?’ అన్నాడు. అతని ముఖం అమాయకంగా దీనంగా, ఓడిపోయి గాయాలతో ఇంటికి చేరిన సైనికుడి వదనంలా ఆమెకు కనపడింది.  ‘ఈ అర్భకుడు... తనకు జీవితాన్నిచ్చిన భర్త ... తనబిడ్డలకు తండ్రి ... ఇతడికి తను తప్ప ఇంకెవరున్నారు? ఈపురుషుడు వేరే స్త్రీలెవరికీ ఎటూ అవసరం లేదు.’  ఆమె జపనీయులు సంస్కృతిలో భాగమైన అనాది ‘భార్య’. గతం మరిచి క్షణాల్లో కరిగిపోయింది. ఆమె హృదయం అతడిపట్ల లోతైన జాలితో నిండిపోయింది. 
 అతడు మాట్లాడకపోయేసరికి  ఆమె తల పైకెత్తి చూసింది. చూపులు కలిసాయి. ఇద్దరూ మౌనంగా  చిన్నగా నవ్వుకున్నారు. ఇద్దరి కన్నుల్లోనూ చెమ్మ తొంగిచూసింది. మనసులు తేలిక పడ్డాయి. 
ఆకాశంలో మబ్బులూ తొలగిపోయాయి. 
‘ఇకముందు నాసమక్షంలో నువ్వు మోకరిల్లనవసరంలేదు. నవశకంలో అదింకా నాగరికత కాదు’ అంటూ ఆమె భుజాల్ని పట్టుకొని పైకెత్తాడు. ఆమె తన కాళ్ళమీద నిలబడేటట్టు తోడ్పడ్డాడు.

-మూలం :  పెర్ల్‌ ఎస్‌ . బక్‌
అనువాదం : టి. షణ్ముఖ రావు

చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top