ఈవారం కథ.. తరంగం

Telugu Short Story Tharangam By Devaraju Mahalakshmi In Funday - Sakshi

పన్నెండు దాటింది. నిద్ర రావడం లేదు. ఆలోచనల్లో మునిగిపోయున్నాను. పదిరోజుల్లో నా జీవితం ఇంతలా మార్పు చెందుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. 
∙∙
సోమవారం ఉదయాన్నే అలారం మోగింది. కళ్లు తెరిచాను. ఇంకా పడుకోవాలనిపించింది. కానీ బాస్‌ ఇచ్చిన పని గుర్తొచ్చింది. బద్ధకంగా ఉన్నా లేవాల్సి వచ్చింది. ఫార్మల్స్‌ వేసుకొని తయారయ్యాను. చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. 
వంట గదిలోంచి అమ్మ.. ‘అజ్జూ.. టిఫిన్‌ తిందువురా’ అంటూ పిలిచింది. 
‘వస్తున్నా.. ’ అంటూ డైనింగ్‌ హాల్లోకి వచ్చాను. టేబుల్‌ మీద వేడి వేడి ఉప్మా  ఆకలిని పెంచింది. కూర్చి వెనక్కి లాక్కొని కూర్చున్నాను. స్పూన్‌తో తీసుకున్న ఉప్మా వేడిని నోటి ద్వారా ఊదుతూ చల్లారబెట్టుకుంటూండగా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది. 
‘వెళ్లాల్సిందేనా నాన్నా.. ’ అని అడిగింది వెళ్లకుండా నేను తప్పించుకుంటే బాగుండు అన్న భావంతో. 
‘తప్పదమ్మా.. చిన్న పనే కానీ చాలా ముఖ్యమైంది. వీలైనంత తొందరగా ముగించేసుకొని వచ్చేస్తా’ అని చెప్పా. 
‘జాగ్రత్త.. త్వరగా వచ్చేసెయ్‌’ అంటూ లంచ్‌ బాక్స్‌ తెచ్చి నా బ్యాగ్‌లో సర్దింది. 
బ్యాగ్‌ తీసుకొని వెళ్లబోతూ ‘అవునూ.. కార్తీక్‌ ఎక్కడ?’ అని అడిగా. 
‘వాడికి అంత తొందరగా తెల్లారుతుందా?’ నవ్వుతూ దీర్ఘం తీసింది అమ్మ. 
‘ఔనౌను.. కుంభకర్ణుడి వారసుడు’ అంటూ నవ్వుతూ బండి స్టార్ట్‌చేశా.. గేట్‌ తోసుకొని వెళుతూ ‘ఓకే అమ్మా.. వెళ్లొస్తా... బై’ అని చెప్పేసి యాక్సిలేటర్‌ రైజ్‌ చేశా.

ఒక్కసారిగా ఆఫీస్‌లో చాలామందిని చూసేసరికి మొహమ్మీది మాస్క్‌ను సరి చేసుకున్నా. 
‘హలో అర్జున్‌.. ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది చూసి?’ అన్నాడు రవి. 
‘హాయ్‌రా.. బానే ఉన్నా.. నువ్వెలా ఉన్నావ్‌?’ అడిగా. 
‘నాకేంట్రా.. బానే ఉన్నా’ చెప్పాడు. 
ఈ ఆఫీస్‌లో చేరినప్పుడు మొదట పరిచయమైన వ్యక్తి రవే. ఫ్రెండ్లీ నేచర్‌ అతనిది. అందరితో సులువుగా కలిసిపోతాడు. ఎప్పుడూ సంతోషంగా.. అందరినీ నవ్విస్తూ ఉంటాడు. నాకు చాలా క్లోజ్‌ అతను. 
అలా ఇద్దరం మాట్లాడుకుంటూనే డెస్క్‌ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. 
‘అర్జున్‌ .. ఇవ్వాళ మన సంతోష్‌ పుట్టినరోజు .. వాడు చిన్న పార్టీ ఇస్తున్నాడు’ అన్నాడు రవి. 
‘పార్టీనా?’ 

‘అవును. వాడు ఫోన్‌ మార్చాడట.. అందుకే నీ ఫోన్‌ నెంబర్‌ మిస్‌ అయినట్టుంది. నిన్ను పార్టీకి తీసుకురమ్మని నాకు చెప్పాడులే. ఈ రోజు ఈవెనింగ్‌..! మన ఫ్రెండ్స్‌ అందరూ వస్తారు.. నువ్వూ రావాలి.. వస్తావుగా!’ 
నేను మౌనంగా ఉండడం చూసి.. నవ్వుతూ నా భుజం మీద చెయ్‌వేసి ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటారులే.. భయపడకు’ అన్నాడు. 
చాలా రోజుల తర్వాత బయటకు రావడం.. వెళితే అందరినీ కలిసినట్టు ఉంటుందని వెళ్దామనే నిర్ణయించుకున్నా.. అయితే పార్టీలో మాస్క్‌ తీయకుండా.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయిన్‌టైన్‌ చేయాలనీ డిసైడ్‌ అయ్యి ‘సరే.. వస్తాన్రా’ అని మాటిచ్చా రవికి. 
పిచ్చాపాటీ అయిపోయాక సీరియస్‌గా పనిలో నిమగ్నమయ్యా. లంచ్‌ టైమ్‌లో అందరం దూరం దూరంగానే కూర్చొని లంచ్‌ కానిచ్చాం. తర్వాత వెంటనే మాస్క్‌ వేసుకొని నా డెస్క్‌కి వచ్చేశా.
ఆఫీస్‌లో వర్క్‌ కంప్లీట్‌ చేసుకొని ఇంటికి వెళ్లేసరికి సాయంకాలం నాలుగున్నరైంది. లంచ్‌ బాక్స్‌ నేనే కడిగి.. నా బ్యాగ్‌ను శానిటైజ్‌ చేసుకొని సరాసరి స్నానానికి వెళ్లా. ఫ్రెష్‌ అయ్యి హాల్లోకి వచ్చేసరికి అమ్మ, కార్తీక్‌ కూర్చొని ఉన్నారు. 
‘అమ్మా.. ఈ రోజు నా కొలీగ్, ఫ్రెండ్‌ సంతోష్‌ లేడూ.. వాడి బర్త్‌డే.. నైట్‌ చిన్న పార్టీ ఇస్తున్నాడు. వెళ్లనా?’ అడిగా. 
‘చాలా మంది వస్తారేమో.. సేఫ్‌ కాదేమోరా! సెకండ్‌ వేవ్‌ అంటున్నారు.. ఈ టైమ్‌లో రిస్క్‌ అవసరమా?’ అంది అమ్మ.
‘జాగ్రత్తగానే ప్లాన్‌ చేస్తున్నారమ్మా..! అందరూ మాస్క్‌లు పెట్టుకొనే ఉంటారు. నేనూ తీయను. అయినా నువ్వు టీవీలో కరోనా వార్తలు చూడ్డం మానెయ్‌. వాళ్లు అలాగే భయపెడ్తారు. ఈరోజు ఆఫీస్‌కి వెళ్లినప్పుడు చూశాగా.. బయట అంతా నార్మల్‌గానే ఉంది. అందరూ మామూలుగానే తిరుగుతున్నారు. ఇన్నాళ్లూ ఇంట్లోంచి వర్క్‌ చేసీచేసీ బోర్‌ కొట్టిపోయింది. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లొస్తా.. ప్లీజ్‌ అమ్మా.. ’ అన్నాను బతిమాలుతున్నట్టుగా. ఒప్పుకుంది అమ్మ. 

నేనూహించిన దానికంటే ఎక్కువమందే వచ్చారు పార్టీకి. చాన్నాళ్ల తర్వాత కలుసుకున్నామేమో అందరం.. కబుర్లు, జ్ఞాపకాలు, సరదాలతో ఇట్టే గడిచిపోయింది టైమ్‌. 
కేక్‌ కట్‌ చేయడానికి ముందు అందరం గుంపుగా నిలబడి బర్త్‌ డే సాంగ్‌ పాడాము. మా బృందంలోంచి ఒకరు ‘అయ్యో.. క్లాప్స్‌ కొట్టొద్దా? అరేయ్‌ సంతూ.. నీకెన్నేళ్లురా ఇప్పుడు?’ అని అడిగాడు. 
‘ఒక డెబ్బై ఉంటాయేమో..!’ అన్నాడు రవి సరదాగా. 
దాంతో అందరూ నవ్వారు. 
‘అవున్రా.. ఉంటాయ్‌. మరి అన్ని చప్పట్లు కొడతావా?’ అన్నాడు సంతోష్‌. 
‘వామ్మో.. కొట్టలేనురా బాబోయ్‌..’ అన్నాడు రవి నవ్వుతూ. 
గ్రూప్‌ ఫొటో తీసే టైమ్‌ వచ్చింది.. అందరూ మాస్క్‌ తీసేశారు. తీయని వారినీ తీయమని ఫోర్స్‌ చేశారు. సెకండ్స్‌లో పనే కదా... అని నేనూ తీసేశాను. కరెక్ట్‌గా అందరం నిలబడి ఫొటోకి పోజ్‌ ఇచ్చే సమయానికి కెమెరాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. మరో రెండు నిమిషాలు అలాగే నిలబడాల్సి వచ్చింది మాస్క్‌ లేకుండా. ఫొటో సెషన్, డిన్నర్‌ ముగించుకుని ఇంటికెళ్లే సరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. 
అమ్మా, కార్తీక్‌ నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాళ్లు, చేతులు కడుక్కొని వచ్చి వాళ్ల పక్కన చేరాను.
‘పార్టీ ఎలా అయింది?’ అడిగాడు కార్తీక్‌. 
‘బాగానే అయిందిరా’
‘నీ ఫ్రెండ్స్‌ అందరూ వచ్చారా?’ 
‘హా.. అందరూ వచ్చారు’
‘అయితే బాగానే ఎంజాయ్‌ చేసినట్టున్నావ్‌ కదూ..’
‘అవునురా.. చాలా బాగనిపించింది’
కాసేపు వార్తలు చూసి.. నిద్రకుపక్రమించాం. కార్తీక్‌ నా గదిలోనే పడుకున్నాడు. కానీ మధ్యలోనే అమ్మ దగ్గరకి వెళ్లిపోయాడు నేను బాగా గురక పెడుతున్నానని. 

బుధవారం మధ్యాహ్నం... 
సంతోష్‌కు కోవిడ్‌ లక్షణాలు కనపడ్డాయని.. టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిందనీ ... పార్టీకి వెళ్లినవాళ్లలో దాదాపు అందరికీ కోవిడ్‌ సోకిందని తెలిసింది. 
చాలా భయపడ్డాను. నాకు ఎటువంటి లక్షణాలు లేవు కానీ అమ్మకు కొంచెం ఒళ్లునొప్పులు మొదలయ్యాయని చెప్పింది. 
‘నాకు రాకుండా తనకెలా వస్తుంది?’ అనుకున్నాను. 
‘పనిమనిషి రావడంలేదు కాబట్టి కొంచెం పనిఎక్కువై అలసటతో వస్తున్నాయేమోలే’ అంది అమ్మ. 
రెండు రోజుల గడిచాయి.. శుక్రవారం అమ్మకు, కార్తీక్‌కు హై ఫీవర్‌ వచ్చింది. నాకు కొంచెం తలనొప్పి ఉండింది.. కానీ ఆఫీస్‌ వర్క్‌ ప్రెజరేమో అనుకున్నా. అయినా సరే ముగ్గురం కోవిడ్‌ పరీక్ష చేయించుకున్నాం. ఒక రోజు తర్వాత రిపోర్ట్స్‌ వచ్చాయి. నాది తప్ప. నా రిపోర్ట్‌ రావడానికి ఇంకో రోజు పడుతుందన్నారు ఎందుకో!
అమ్మ, కార్తీక్‌.. ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. అమ్మ చాలా భయపడింది. వాళ్లిద్దరూ ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యారు. నేను వాళ్లకు దూరంగానే ఉన్నాను. 
ఆ రోజు రాత్రి.. 

కార్తీక్‌ టీవీ చూస్తున్నాడు. వాడి పక్కనే అమ్మ నిలబడి ఏదో పని చేస్తోంది. హఠాత్తుగా ‘అమ్మా’ అంటూ గట్టిగా అరిచాడు కార్తీక్‌. 
 బెడ్‌రూమ్‌లో పనిచేసుకుంటున్న నేను వాడి కేకకు కంగారుగా హాల్లోకి çపరుగెత్తుకొచ్చి ‘ఏమైందిరా’ అని అడిగా. 
నేల మీద పడిపోయి.. ఆయాసపడుతున్న అమ్మను చూశా. 
‘ఒరేయ్‌.. హాస్పిటల్‌ తీసుకెళ్దాంరా..’ అంటూ కార్తీక్‌ సహాయంతో అమ్మను కార్లో కూర్చోబెట్టా. 
ఆ రాత్రి నాకు ఇంకా గుర్తు.. ఎన్నో హాస్పిటల్స్‌ తిరిగి తిరిగి.. ఎంతో మందిని బతిమాలినా ఎక్కడా ఒక్క బెడ్‌ దొరకలేదు. ఇంట్లో కార్తీక్‌  ఒక్కడే. 
బయట కుండపోతగా వాన. జ్వరం, ఆయాసంతో మూలుగుతున్న అమ్మ. ఏం చేయాలో.. అర్థం కాలేదు. అంతా గందరగోళం.. అయోమయం. దుఃఖం తన్నుకురాసాగింది. మనసంతా దిగులు.. భయం.. ఆందోళన. 

ఆఖరికి రవికి కాల్‌ చేస్తే ఒక హాస్పిటల్‌ పేరు చెప్పాడు. అక్కడ బెడ్‌ దొరికింది. అమ్మకు ఆక్సిజన్‌ పెట్టారు డాక్టర్లు. కాసేపటికి అమ్మ కాస్త తేరుకుంది. ఆ రోజు రవి చేసిన సహాయం నేనెప్పటికీ మరిచిపోలేను. 
పీపీఈ కిట్‌ వేసుకొని అమ్మను కలవొచ్చు అని చెప్పారు డాక్టర్లు. వాళ్లు చెప్పినట్టే పీపీఈ కిట్‌ వేసుకొని అమ్మ దగ్గరకు వెళ్లా. ఏడుపు ఆగలేదు. 
నన్ను చూసి అమ్మ ‘నాకేం కాలేదురా.. చిన్నపిల్లాడిలా ఆ ఏడుపేంటిరా? నేను బాగానే ఉన్నా. ఇంటికొచ్చేస్తాలే. ఇల్లంటే గుర్తొచ్చింది.. కార్తీక్‌ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో.. వెళ్లు.. వెళ్లి వాడిని చూసుకో.  ఇక్కడ డాక్టర్లున్నారు కదా.. నన్ను వాళ్లు చూసుకుంటారులే! వెళ్లు.. ఇంటికెళ్లు’ అంది ఆయాసపడుతూనే. 
కళ్లు తుడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధ పడ్డా.. 
‘నానీ.. నువ్వు జాగ్రత్తరా.. కార్తీక్‌ను బాగా చూస్కో’ అంది అమ్మ. 
‘సరే’ అన్నట్టుగా తలూపి ఇంటికి బయలుదేరాను. 

 ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున్నే వంట చేసి కార్తీక్‌కి పెట్టి.. హాస్పిటల్‌కు వెళ్లాను అమ్మ దగ్గరకు. ఆ రోజు ఆదివారం కావడం వల్లో.. కోవిyŠ  పేషంట్స్‌ను ట్రీట్‌ చేస్తుండడం వల్లో ఏమో కానీ.. రిసెప్షన్‌ అంతా ఖాళీగా కనిపించింది. 
నేను అమ్మ ఉన్న గది వైపు వెళ్తుంటే రిసెప్షనిస్ట్‌ ఆపింది.. ‘మీరు కళావతి తాలూకా అండీ’ అని. 
‘అవునండీ.. ఎందుకు? ఏమైందీ?’ అన్నాను గాభారాగా. 
‘మిమ్మల్ని ఒకసారి డాక్టర్‌ గారు కలవమన్నారు. మీకే ఫోన్‌ చేద్దామని ట్రై చేయబోతున్నా.. అంతలోకి మీరే కనిపించారు’ అంటూ డాక్టర్‌ కన్సల్టెంట్‌ రూమ్‌ నంబర్‌ చెప్పింది రిసెప్షనిస్ట్‌. 
గుండెదడతోనే డాక్టర్‌ని కలవడానికి వెళ్లాను. 
‘సర్‌... ’ అన్నాను లోపలికి రావచ్చా అన్నట్టుగా తలుపు చిన్నగా తీసి. 
‘అర్జున్‌?’ అడిగాడు డాక్టర్‌. 

అవునన్నట్టుగా తలూపాను. ఏ భావం లేకుండా చూశాడు నా వైపు. నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. ఆ చూపుతో అది బలపడింది.
‘ఐయామ్‌ వెరీ సారీ.. ఇందాకే మీ అమ్మగారు గుండెపోటుతో పోయారు’ అన్నాడు చిన్నగా. 
అంతే.. నా గుండె ఆగినంత పనైంది. అప్రయత్నంగానే కళ్లల్లో నీళ్లు. 
‘అ.. అదే..ంటి.. నిన్న రా..రాత్రి బానే ఉంది కదా.. ’ మాటల కోసం కూడబలుక్కున్నాను. 
‘అవును బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. చాలా ట్రై చేశాం.. బతికించలేకపోయాం.. రియల్లీ వెరీ సారీ’ అని డాక్టర్‌ చెబుతూనే ఉన్నాడు. 
కుమిలి కుమిలి ఏడ్చాను.. అమ్మలేని జీవితం ఊహించలేకపోయా.. నిలబడ్డవాడిని నిలబడ్డట్టే కుప్ప కూలిపోయా. 

కళ్లు తెరిచి చూస్తే.. హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్నాను. నా పక్కన పీపీఈ కిట్‌లో డాక్టర్‌. 
‘ మా అమ్మను చూడాలి’ అంటూ లేవబోయా. నీరసంతో కళ్లు తిరిగినట్టయి.. మళ్లీ అలాగే బెడ్‌ మీద పడిపోయా. 
‘ప్లీజ్‌.. కదలొద్దు. మీ కండిషన్‌ అస్సలు బాగోలేదు. బెడ్‌ మీద నుంచి అంగుళం కూడా కదలడానికి లేదు.. ఎక్కడికీ వెళ్లడానికి లేదు’ అన్నాడు డాక్టర్‌. 
‘నాకేమైంది? నేను బానే ఉన్నా.. నాకేం కాలేదు’ అంటున్నా... కానీ ఆయాసం వల్ల మాట్లాడ్డం కష్టమైంది. 
‘చూశారా.. ఎలా ఆయాసం వస్తోందో? మీకూ పాజిటివ్‌ వచ్చింది’ చెప్పాడు డాక్టర్‌. 
‘లేదండీ.. నాకేం లేదు. నేను బాగానే ఉన్నాను.. మా అమ్మ దగ్గరకు వెళ్లాలి’ అంటున్నాను.
‘ఎక్కడికీ కదలకూడదని చెప్పాం కదా.. మీవల్ల ఇతరులకూ కోవిడ్‌ సోకుతుంది. మిమ్మల్ని మీరు చాలా శ్రమపెట్టుకున్నారు.. అందుకే ఇప్పుడు మీ కండిషన్‌ క్రిటికల్‌గా మారింది’ హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు డాక్టర్‌. 
నిశ్శబ్దంగా ఉండిపోయా.. శక్తిలేక.. ఆయాసంతో మాట రాక!
‘మీరు గానీ.. మీ తమ్ముడు గానీ ఇప్పుడు మీ అమ్మగారికి అంతిమసంస్కారాలు చేసే పరిస్థితిలో లేరు. అందుకే ఆ కార్యక్రమం మా సిబ్బందే చేస్తారు’ అన్నాడు డాక్టర్‌. 
అది విని నా మనసు మరింత బరువెక్కింది. చెప్పలేని ఆవేదన. ఇద్దరు పిల్లలు ఉండీ.. మా అమ్మ అనాథలా.. తెలియని వారితో అంతిమసంస్కారాలు చేయించుకుంటోంది. తను నాతో మాట్లాడిన ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.. దిండు మీద తలవాల్చి .. కళ్లు మూసుకున్నాను. 

మా అమ్మనాన్నది ప్రేమ వివాహం. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ల పెద్దలు ఇప్పటికీ మాట్లాడరు. అందుకే మాకు పెద్దగా బంధువుల్లేరు. నాన్న చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. అమ్మే మా ఇద్దరినీ పెంచి పెద్ద చేసింది. కంటికి రెప్పలా కాచుకుంది. నాన్న చనిపోయిన రోజు నాకింకా గుర్తు. ఇంట్లో నేను, కార్తీక్, అమ్మ ముగ్గురమే. అమ్మ ఒక మూలన కూర్చొని చాలా ఏడ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు మేమే సర్వస్వం. మా స్కూల్, కాలేజీ ఫీజులు కట్టడానికి తాను పడిన కష్టం అంతా ఇంతా కాదు. 

‘లేవండి’ అంటూ ఎవరో పిలిచారు. కళ్లు తెరిచి చూశాను. నర్స్‌... భోజనం ఇచ్చి వెళ్లింది. మనసేమీ బాగాలేదు. తినాలనిపించలేదు. ఏదో తిన్నాననిపించుకుని కార్తీక్‌కు కాల్‌ చేశా. బానే ఉన్నానని చెప్పాడు. వాడికి అమ్మ గురించి చెప్పే ధైర్యం లేదు నాకు. అయినా లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చెప్పాను. విషయం విన్నవెంటనే హతాశుడయ్యాడు. పెద్దగా ఏడ్చాడు. నాకూ దుఃఖం ఆగలేదు. ఎలాగోలా తమాయించుకొని వాడిని ఓదార్చాను. 
ఫోన్‌ పెట్టేశాక ఎన్నడూ లేని, రాని నీరసం, నిస్సత్తువ ఆవహించాయి నన్ను. అలా పడుకుండిపోయానంతే. మరుసటి రోజు ఐసీయూలో నా పక్కన ఉండే పేషంట్‌ చనిపోయాడు. వాళ్లవాళ్లు బయట నిలబడి ఏడుస్తున్నారు. నాకూ ఎంతో బాధయ్యింది. బయట పెరుగుతున్న కేసులు, లోపలి మరణాలు చూసి బాధతో కలిగిన భయానికి లోనయ్యాను. ‘అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదంతా ఎప్పటికి నార్మల్‌ అవుతుంది?’ అనిపించింది. బయట నార్మల్‌ అయినా మా ఇద్దరి జీవితాల్లో అమ్మలేని లోటు శాశ్వతం. ఏడ్చినప్పుడల్లా ఆయాసం వస్తోంది. బాగా గాలి పీల్చాలనిపిస్తోంది. రవికి కాల్‌ చేశాను. వాడు ఫోన్‌ ఎత్తలేదు. ‘ఏమైందో?’ అని భయపడ్డాను. బాధ, దుఃఖంతోనే ఆ పూట గడిచింది. రాత్రి నిద్ర పట్టలేదు. ఎటువైపు తిరిగినా నిద్ర రాలేదు. ఇటు అటు డొల్లుతూనే ఉన్నా. ఒంటిగంట దాటింది. కాసేపు లేచి అటు ఇటూ తిరిగాను. ఆయాసం వచ్చేసింది. మళ్లీ మంచం మీద వాలాను. మగతగా ఉంది. నిద్రలోకి జారుకున్నాను. 

మరుసటి రోజు.. మంగళవారం. అమ్మ.. ప్రతి మంగళవారం ఇంటి పక్కనే ఉన్న  ఆంజనేయ స్వామి గుడికెళ్లి దర్శనం చేసుకునేది. ప్రసాదాన్ని ఇంటికి తెచ్చేది.. ముగ్గురం కలిసి తినేవాళ్లం. అలా అమ్మను గుర్తు చేసుకుంటూండగా కార్తిక్‌ మాటలు వినిపించినట్టయి బయటకు వెళ్లాను. కనబడలేదు.. ఆ కారిడార్‌లో అటూ ఇటూ తిరిగాను. ఉహూ.. లేడు.
అక్కడే ఉన్న నర్స్‌ను అడిగా ‘మా తమ్ముడు వచ్చాడా?’ అని. బదులేమీ చెప్పలేదు. అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. నా నుంచి కోవిడ్‌ సోకుతుందని భయపడిందో ఏమో మరి!
సడెన్‌గా ఎవరో ఏడుస్తున్నట్టని పించింది. ఆ ఏడ్చే శబ్దం ఎటు నుంచి వస్తుందో అటు వెళ్లాను. కార్తీక్‌ కనిపించాడు.. లాబీలో ఒక మూల ఒంటరిగా కూర్చొని. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. 
‘వీడిక్కడేం చేస్తున్నాడు?’ అనుకుంటూ పరుగెత్తుకెళ్లాను వాడి దగ్గరకు. అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్నాడేమో అనుకుని వాడి భుజం మీద చేయి వేశా. వాడు తలతిప్పి కూడా చూడలేదు. కనీసం చిన్న కదలిక కూడా లేదు వాడిలో. అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు. 

‘ఏడవకురా..! ఏదీ మన చేతుల్లో లేదు. మనం ఎంత ఏడ్చినా అమ్మ ఇంక తిరిగి రాదు. ఊర్కోరా’ అంటూ సముదాయించా. వాడు వినిపించుకోలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. 
నేనేమన్నా వాడు స్పందిచట్లేదు సరికదా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎంత పిలిచినా  ఉలుకూ పలుకూ లేదు. వాడికేమైనా అయిందా ఏంటీ? అని భయపడ్డాను. 
‘కార్తీక్‌.. కార్తీక్‌ ’ అంటూ వాడి భుజాలు పట్టుకొని కదిపా. ఒక్కసారిగా లేచాడు. కళ్లు తుడుచుకుంటూ.. నిర్మానుష్యంగా ఉన్న ఆ లాబీలో అలా నడుచుకుంటూ మార్చురీ వైపు వెళ్లాడు.

-దేవరాజు మహాలక్ష్మి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top