ఈవారం కథ: ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. మనసా

Ravi Mantripragada Telugu Short Story In Sakshi Funday

‘ప్రయాణీకులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 12728, హైదరాబాద్‌ నుండి  ఖాజీపెట్, విజయవాడ మీదుగా విశాఖపట్టణం వెళ్ళవలసిన గోదావరి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకటవ నంబరు ప్లాట్‌ ఫామ్‌ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది’ మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా బాధ్యత అన్నట్టు వరుసగా మూడు భాషల్లోనూ చెప్పింది ఆటోమేటెడ్‌ రైల్వే అనౌన్సర్‌.
‘త్వరగా నడువ్‌ మొద్దూ.. రైలు కదిలిపోతుంది’ ఆమెని లాక్కెళుతున్నట్టు పెద్దపెద్ద అంగలతో వేగంగా నడుస్తున్నాడు భర్త.
‘కొంచెం మెల్లగా నడవండీ..’ కాళ్లకి అడ్డుపడుతున్న చీరని పైకి లాక్కుంటూ అతని వెనక పరిగెడుతున్నట్టు నడుస్తోంది ఆమె. 
‘ప్రయాణాల్లో కూడా ఈ వెధవ చీరలెందుకు? ఏ పంజాబీ డ్రెస్సో వేసుకుని చావక’ విసుక్కున్నాడు.
‘అత్తయ్యగారికి నచ్చదు కదండీ’ అంది పుస్తకాల కొట్టువైపు చూస్తూ.. కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనుకుని.

‘ఆ కాడికి మేమంటే ఏదో పెద్ద భయమున్నట్టు! బస్సులో వెళ్లి ఏడవమంటే వాంతులు అదీ ఇదీ అని వంకలు’ వచ్చే పోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న బోగీ కోసం వెతుకుతున్నాడు.              
‘జనరల్‌ ఇటు పక్క అనుకుంటా అండీ..’ వెనకకు చూపించింది.. జారిపోతున్న బ్యాగ్‌ని భుజం మీదకి లాక్కుంటూ. 
‘నాకు తెలీదా? చూశావా ఎంత జనమో? నువ్వెళ్ళి జనరల్‌లో కూచుంటే ఏ దొంగ వెధవో అర్ధరాత్రి వేళ ఆ మెళ్ళో ఉన్న సూత్రాలతాడు కాస్తా లాక్కెళ్లిపోతాడు. నీకసలే పడుకుంటే ఒళ్ళు తెలీదు.’
‘ఈ బోగీ కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండీ’ 
 ‘అందులో బొత్తిగా ఆడవాళ్లు లేరు. ఇదిగో ఇందులో ఎక్కు. త్వరగా’ ట్రైను తలుపు దగ్గర కంబీని పట్టుకుని, రిజర్వేషన్‌ బోగీలో ఆమెని ఎక్కించేశాడు. రైలు మెల్లగా కదిలింది.

‘ఏవండీ పిల్లలు జాగ్రత్త. చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండి’ చేతిని పట్టుకుంది.
‘ఎన్నిసార్లు చెప్తావ్‌? వెధవ నస. టీసీ వస్తే అత్యవరసరం ఉండి బయల్దేరాను, సీటు దొరకలేదని చెప్పు. ఫైన్‌ కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు. సీటు దొరికితే నిద్రపోకు. బండి ఎక్కడా ఎక్కువ సేపు ఆగదు’ కంబీని వదిలేస్తూ ఆమె చేతిని కూడా విడిపించుకున్నాడు.
‘ ఏవండీ.. టిక్కెట్టు మీ జేబులో ఉండిపోయింది ’ గట్టిగా అరిచింది. అప్పటికే  రైలు ప్లాట్ఫారం దాటేసింది.

నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయల్దేరిన రైలు సికింద్రాబాద్‌ వచ్చేసరికి ప్రయాణికుల యాత్రా బస్సులా నిండిపోయింది.
‘ఈ సీట్లో ఎవరైనా ఉన్నారాండీ?’ ఖాళీ సీటుకోసం వెతుక్కుంటూ వచ్చి అడిగింది ఆమె.
బెర్త్‌పైకి వేలు చూపించాడు అతను. మొహం మీద తడి తువ్వాలు కప్పుకుని గురక పెట్టి పడుకున్నాడో మనిషి.
‘ఓహ్‌’ నిరుత్సాహంగా కిక్కిరిసిన కంపార్ట్‌మెంట్‌ అంతా  వెతికింది చోటు కోసం.
‘ఆయన ఇప్పట్లో లేచేలా లేడు. మీరు కూర్చోండి’ మరోసారి పైకి చూసి నిర్ధారించుకున్నట్టు చెప్పాడు.
‘థాంక్స్‌’బ్యాగ్‌ని సీటు కింద పెట్టి కూర్చుంది. 

గ్రీష్మ తాపం ఇంకా చల్లారలేదు. కిటికీలోంచి బైటికి చూస్తోంది. అలసట వల్లో, ఆలోచనల బరువు వల్లో గానీ ముఖం వాడినట్టు తెలుస్తోంది. సంధ్య సూరీడు వెళ్ళడానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లని నిప్పులు కురిపిస్తున్నాడు. ఆమె కళ్ళలో సన్నని కన్నీటి పొర. చాలా సేపటి నుంచి గమనిస్తున్న అతను.. తను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకి అడ్డుపెట్టాడు. ఆమె గమనించే స్థితిలో లేదు.  
‘వాటర్‌ బాటిల్‌.. అక్కా.. వాటర్‌ బాటిల్‌ కావాలా?’ మొహం మీద బాటిల్‌ పెట్టి అడిగాడు కుర్రాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైగ చేసింది. ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్‌ తీసి చూసుకుంది. ఏడు మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి. కంగారుగా కాల్‌ చేసింది.
‘హలో.. ఫోన్‌ సైలెంట్‌లో ఉంది చూస్కోలేదండీ’
‘...’ అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో గానీ గొంతు గట్టిగానే వినిపిస్తోంది.
‘మీరే కదండీ టికెట్‌ నా దగ్గరుంటే పడేస్తానని, రైలెక్కే ముందు గుర్తు చెయ్యమన్నారు?’ నెమ్మదిగా అంది ఫోన్‌ వాల్యూమ్‌ తక్కువగానే ఉందో  లేదో అని మరోసారి చూసుకుంటూ. 

ఏదో అరిచి ఫోన్‌ పెట్టేసింది అవతలి గొంతు. నిట్టూర్చి ఫోన్‌ను బ్యాగ్‌లో పడేసింది స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ. ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి. ఈసారి ఆ భారానికి భయం తోడైంది. బోగీ అంతా గోలగా ఉంది.
‘ఈ పుస్తకం మీరు చదివేస్తే ఇస్తారా?’ అడిగింది అతని చేతిలోని మ్యాగజైన్‌ని చూస్తూ. ఇచ్చాడు.   
‘థాంక్యూ’ గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది ‘పెన్ను ఇస్తారా?’ సైగ చేసింది అతని జేబుని చూపిస్తూ. ఇచ్చాడు ఫోన్లో పాటలు వింటున్న అతను.
‘టీసీ వచ్చి టిక్కెట్టు చూపించమంటే ఏం చెప్తారు?’ కిటికీలోంచి బైటికి చూస్తూ అడిగాడు.
‘మీకెలా తెలుసు’ అన్నట్టు చురుక్కుమని చూసింది.
‘సారీ.. మీరు ట్రైన్‌ ఎక్కగానే ఎవరినో అడుగుతున్నారు కదా? నేను ఇటు వైపు తలుపు దగ్గర ఉన్నాను’
‘మ్‌.. మా ఆయన.. టికెట్‌ ఇవ్వడం మర్చిపోయాడు’
‘మరిప్పుడెలా? ఫైన్‌ కట్టేస్తారా?’
‘సీటు ఇస్తా అంటే ఆలోచిస్తాను. అయినా ఏమైతే అదవుతుంది. చూద్దాం’ పజిల్‌ సగం సగం గడులు నింపేసి పెన్నుని అతనికి ఇచ్చేసింది.
‘మీకు ధైర్యం ఎక్కువే’ అన్నాడు పెన్ను జేబులో పెట్టుకుంటూ. 
‘ధెర్యానికి డబ్బులు అక్కర్లేదు కదండీ’ మొదటిసారి నవ్వింది. 

 రైలు ఖాజీపేట దాటింది.  
‘కుదరదయ్యా. వచ్చే స్టేషన్‌లో దిగి జనరల్లోకి వెళ్లిపో. మళ్ళీ నిన్ను ఇక్కడ చూస్తే ఫైన్‌ రాసేస్తాను’ రుసరుసలాడి పోతున్నాడు టీసీ. అతని వెనక నలుగురైదుగురు కుర్రాళ్లు.. సీటు కోసం వెంటపడుతుంటే విసుక్కుంటూ టిక్కెట్లు చెక్‌ చేస్తున్నాడు.
‘సైడ్‌ లోయర్‌ అండీ’ .. టికెట్‌ చూపించాడు అతను.
‘అమ్మా మీది?’ అంటూ ఆమెను టికెట్‌ అడిగి ‘ బాబూ లేవండి టికెట్‌ చూపించండి’ అంటూ పైన పడుకున్న మనిషిని తట్టి లేపాడు.
తనని కాదన్నట్టు బయటకు చూస్తున్న ఆమె ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు అతను.
‘అమ్మా’ గట్టిగా పిలిచాడు టీసీ. ఆమెలో చలనంలేదు.
‘ ఆవిడ’ ఏదో చెప్పబోయాడు అతను.   

‘సార్‌.. మీ వైఫా? కళ్ళు తెరచి నిద్రపోతున్నట్టున్నారు. ఆరేసీయా? సీట్లు లేవు. మీరిద్దరూ సద్దుకుంటానంటే నాకేం అభ్యతరం లేదు’ చెప్పేసి వెళ్లిపోయాడు టీసీ. కాసేపు నిశ్శబ్దం. కొంగు నోటికి అడ్డుపెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకుటోంది ఆమె.
‘అలా ఎలా కూర్చున్నారు? మీకు భయం వెయ్యలేదా?’ టీసీ వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు.
‘వెయ్యలేదా? రైలు చప్పుడు కన్నా గట్టిగా కొట్టుకుంది నా గుండె’
‘ఇందాక  ధైర్యం, డబ్బులు అని ఏదో అన్నారు?’
‘వాటన్నిటికన్నా చెడ్డది ఒకటి ఉంది. పరువు అనీ.. ఆ బరువునెందుకు మోస్తామో తెలీదు’
‘పోన్లెండి..గండం గట్టెక్కింది’
‘సారీ.. మరో దారి లేక’
‘పరవాలేదు’

‘మీ భోజనం?’ అడిగింది తను తెచ్చిన చపాతీల పొట్లం తెరుస్తూ.
‘విజయవాడలో చూస్తాను’
‘నేను ఎక్కువ తెచ్చాను’ అంటూ అతనిచ్చిన పుస్తకం మధ్యపేజీ చించి రెండు చపాతీలు వేసింది. కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయి అవి. కూర డబ్బా తెరవగానే గుప్పుమంది వాసన.  
‘థాంక్యూ’ అందుకోబోయాడు. 
‘అయ్యో.. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసాను. కూర పాడైపోయింది. ఈ పూట నాక్కూడా పస్తే’ జాలిగా అతని వంక చూసింది.
కళ్ళు పెద్దవి చేస్తూ భుజాలెగరేశాడు.
తెచ్చిన భోజనం చెత్తకుప్పలో పడేసింది. ఫోన్‌ స్విచ్‌ ఆన్‌ చేసి రెండు నిముషాలు ఆలోచించి డయల్‌ చేసింది. ‘ఏవండీ.. పిల్లలేం చేస్తున్నారు? తిన్నారా?’ అని అడిగింది. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతలి గొంతు.
‘అత్తయ్య ఏమైనా ఫోన్‌ చేశారా? కాలు ఎలా ఉందిట? నేను చేస్తే తియ్యలేదు ఫోను’. పొడిపొడిగా వినిపిస్తున్నాయి అవతలి మాటలు.    

అర్ధరాత్రి దాటింది. హ్యాండ్‌ బాగ్‌ మీద తల వాల్చుకుని భుజాల మీదుగా పవిట కప్పుకుని పడుకోడానికి ప్రయత్నిస్తోంది ఆమె. అటూ ఇటూ  కదలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు.. కిటికీ లోంచి వస్తున్న వెలుగుకి మెరుస్తున్నాయి. మసక మసకగా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెని గమనించాడు అతను. పొందిగ్గా కట్టుకున్న సాదా నేత చీర, ముఖం మీద పడుతున్న జుత్తు, మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు.. తనను చూస్తుందేమోనని భయపడ్డాడు.      
పక్కనుంచి వేగంగా వెళ్లిన రైలు చప్పుడుకి ఉలిక్కిపడి లేచింది ఆమె. ఎదురుగా అతను కనిపించలేదు.మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. పక్క బెర్త్‌లో పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గురక పెడుతున్నాడు.ఎదురుగా పైన ఎవరో కుర్ర జంట. ఊసులు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు.లేచి అతని కోసం వెతికింది. తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయడానికి ప్రయత్నిస్తున్నాడు.
‘వెళ్లే రైల్లో రాయడం అంటే ఇసుకలో పిచ్చి గీతలు గీసినట్టే. నా రాతలా వంకరటింకరగా ఉంటాయి’ ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా.
‘అయ్యో ఇక్కడ కూర్చున్నారేంటి?’ ఖాళీ జామపళ్ళ బుట్టలో ఉన్న పాత దిన పత్రికని అడిగి తీసుకుని ఆమెకిచ్చాడు. 
‘నాకు తలుపు దగ్గర కూర్చోవడం ఇష్టం అండీ. కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. మీకు పెళ్లైందా?’ దినపత్రికని పరచి దానిపై కూర్చుంటూ అడిగింది.
‘హా..చేశారు’ అర్థం కానట్టు చూసింది. ‘నా మరదలే’ బైటికి చూస్తూ చెప్పాడు.
 ‘అదృష్టవంతులు. పెద్ద వాళ్ళు చేసిన పెళ్లిళ్లే ఉత్తమం.అందునా వరసైన వాళ్ళైతే గొడవే లేదు’
‘ఆ గొడవలే ఇక చాలని, తెంచేసుకుని తిరిగి వెళుతున్నా’ పుస్తకం మూశాడు అప్పటి వరకూ తను రాసుకుంటున్న పేజీ చివరను మడత పెడుతూ.
‘మ్‌..’
‘చిన్న చిన్న గొడవలండీ.. మేనల్లుడినని మా అత్తామామకి లోకువ. తనకేమో వాళ్ళ గారాబం. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ప్రత్యేకంగా ప్రేమ ఎలా చూపిస్తాను? రోజూ నరకం. ఒకళ్ళకొకళ్లం ఇష్టంలేని బంధమన్నట్టుంది’
‘మీ తప్పేం లేదా?’ ఆమె ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు.
ఊళ్ళని, చెట్లని పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు. తలుపు దగ్గర నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తోంది. చందమామను చూసి  ఫక్కున నవ్వింది.. ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి.
ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఏమీ లేదన్నట్టు నవ్వింది. ‘మీ వారు గుర్తొచ్చారా?’ అడిగాడు. ‘అలాంటిదే’ జుత్తుని చెవుల వెనక్కి తోసింది. ‘మీది ప్రేమ వివాహమా?’ అడిగాడు. ఏమీ మాట్లాడలేదు ఆమె. అనవసరంగా అడిగా అనుకున్నాడు అతను.
‘పదిహేడేళ్ళకి ప్రేమే అనిపించింది. ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్పనిపించింది’
‘మరిప్పుడు?’
‘నలుగురు మనుషులుండే మూడు గదుల ఇంట్లో.. వారం పది రోజులకి ఒకసారి ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి. తొలికోడి కూసేలోపు నశించిపోతుంది’
‘సారీ.. మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది’
‘అన్నీ బావున్నప్పుడు సరే గానీ, లేనప్పుడే ఎటు తిరిగి ఎటు వచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్లి నిల్చుంటాం. గతంలోని మనం వర్తమానంలోని జీవితానికి ఎప్పటికీ సమాధానంలేని ప్రశ్నలమే’
‘ప్రేమ వివాహం అంటే ముందు నుంచీ అన్నీ తెలిసే చేసుకుంటారు కదా? ఏదైనా సమస్య ఉంటే మీరు, మీ వారు కూర్చుని మాట్లాడుకుంటే...’ 
‘ మీ కాపురం గురించి ఏమైనా సలహా ఇచ్చానా? ఒక్కసారి మీ అత్తా మామలతో కాకుండా ఆమె మనసులో ఏం ఉందో కనుక్కోమని చెప్పానా? ఏదో సందర్భం వచ్చింది అని ఆపుకోలేక బయటకి చెప్పేశాను. ప్రతీవాడికీ  తనకన్నా పక్కవాడి బతుకే బావుందనిపిస్తుంది. రైలు సాఫీగా నడవాలంటే పట్టాలకు ఆసరాగా ఉన్న  రాళ్లెంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం.ఆ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునే వాడికి తెలుస్తుంది. తెంచుకుని వచ్చేసిన మీకేం తెలుస్తుంది?’  
చురుక్కున చూశాడు ఆమె వంక.

చాలాసేపటివరకూ ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడమనిషి తన పిల్లని పెట్టుకుని పడుకుంది. లేపాలనిపించలేదు ఆమెకు. తన పిల్లలు గుర్తొచ్చారు. ఫోన్‌తీసి టైం చూసుకుంది. ఇంకా మూడుగంటల ప్రయాణం. మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చింది. అతను అలా శూన్యంలోకి చూస్తున్నాడు. వచ్చి కూర్చుంది. కాళ్ళని మడిచి పెట్టుకుని మెట్టెలని వేలిచుట్టూ తిప్పుతూ కిందకి చూస్తోంది. ఆ అలికిడి ఆమె వైపు తిరిగాడు. ‘సారీ..’ ఒకేసారి చెప్పుకున్నారు ఇద్దరూ. నవ్వుకున్నారు. 
‘మరోలా అనుకోవద్దు. మీరు నవ్వితే పడే సొట్టలు బావున్నాయి. మగవారికి అరుదుగా ఉంటాయి. సొట్టలు పడితే అదృష్టం అంటారు’
‘మ్‌’ 
‘ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తారు?’
‘చిన్న వ్యాపారం. అప్పుడప్పుడు పత్రికలకి కథలు రాస్తుంటాను. మీరేం చేస్తుంటారు?’
‘ఇద్దరు పిల్లల తల్లిని. దిగువ మధ్యతరగతి భార్యని. బహుశా నా ఉనికిని వెతుక్కుంటున్నానుకుంటా. ఉద్యోగం చెయ్యడం మా వారికి ఇష్టం లేదు..’
‘నా మరదలికి ఉద్యోగం చెయ్యాలని ఆశ. నాకన్నా కూడా చాలా తెలివైంది తను. కానీ ఇప్పుడు..’
‘ఆశలు పడటమే మనిషి చేయగలిగేది’
‘మీ గొంతు, మీ మాటలు బాగున్నాయి.  నేను కాదు మీరు రాయాలి కథలు..’
‘కొద్దిగా సంగీత జ్ఞానం ఉంది లెండి. ప్రేమించుకునే రోజుల్లో నాతో సినిమాల్లో పాటలు పాడిస్తా అనేవాడు మా ఆయన. ఇప్పుడు జోల పాడినా విసుక్కుంటాడు’ అంది చీర కొంగుని దగ్గరగా చుట్టుకుంటూ.
‘ఈ విసుగుకీ ప్రేమకీ చాలా దగ్గర సమ్మంధం ఉందండోయ్‌. మెత్తగా ఉంటే చులకనైపోతా అని విసుగు నటిస్తా నేను’ అన్నాడు. 
‘విసుగు మొహం చూస్తేనే దగ్గరకి వెళ్లాలనిపించదు నాకు. అందుకే కాస్త విసుక్కోగానే ఏడుపు వచ్చేస్తుంది’
‘అసలు నాకు తెలియక అడుగుతాను.. ఏం చెప్పినా నీ కోసం, మన కోసం అని ఎందుకు ఆలోచించరు?’
‘ప్రేమగా చెప్తే ఎందుకు వినను? బుజ్జగించాల్సిన అవసరం లేదు. కానీ నా అభిప్రాయాలకూ విలువిస్తున్నారని నాకు నమ్మకం కలగాలి కదా?’
‘అందరిలా ప్రేమని పైకి చూపించలేను. అర్థం చేసుకునే మనసుంటే నా ప్రతిచేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది. అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేనిలాంటి

వాడిని అని తెలుసుకోలేకపోతే ఇంక మన బంధానికి అర్థం ఏం ఉంది?’
‘పెళ్ళికి ముందు నువ్వు, పెళ్లయ్యాక మీరుగా మారిపోయావు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చోపెట్టావు’
‘మన మధ్యన ఉన్న దగ్గరితనం బయటి వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం ఏం ఉంది? బయట పని చెయ్యడం అంటే ఎన్నో ఒత్తిళ్ళని తట్టుకోవాలి. ఆ కష్టం నీకెందుకు అని! అయినా నా కన్నా నువ్వు తెలివైన దానివని సిగ్గు లేకుండా ఎన్నో సార్లు ఒప్పుకున్నాను’ 
‘సరె.. ఇక నుంచి నువ్వు ఆ విసుగనే ముసుగు వేసుకోకుండా ఉండయితే నా కోసం’
‘నువ్వు అన్నిటికీ ఆ ఏడుపు ముసుగు వేసుకోకు అయితే. ఇది నా కోసం..’ ఈ సారి ఆమె చూపులు అతని చూపులని కలిశాయి.
‘సార్‌.. ఇక్కడ కూర్చోకూడదు. వెళ్లి లోపల కూర్చోండి. పదండమ్మా’ వెనక నుంచి  రైల్వే పోలీసు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పాడు.
అందమైన కలల కొలనులో రాయి పడి చెదిరినట్టనిపించింది. కాసేపు ఏమీ మాట్లాడుకోలేదిద్దరూ. 
రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది.. 
‘గోదావరా?’ అప్పటిదాకా ఎదురుగా కుదురుగా ఉన్న ఆమె వచ్చి పక్కన కూర్చుంది. అతను ఊహించలేదు. గాలి వారి ఇద్దరి మధ్యనుంచి కొంచెం కష్టపడి తప్పించుకు వెళ్తోంది.
‘జాగ్రత్త.. పడతారు’ తన చేతిని ఆమె కాళ్ళకి అడ్డుపెడుతూ కంబీని పట్టుకున్నాడు.
‘చిల్లరుంటే ఇస్తారూ? నా బ్యాగ్‌ అక్కడ వదిలేశాను’
‘మ్‌..’
‘గోదారమ్మని చూస్తే భయం ఎందుకండీ.. నా తల్లి..’ దణ్ణం పెట్టుకుని చిల్లర వేసింది. చల్లని గాలి మనసుని,ఆలోచనల్ని కూడా శుద్ధి చేస్తున్నట్లుంది.
‘ఇదిగో.. టీసీ అడిగితే ఈ టిక్కెట్టు చూపించండి. విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు ఇద్దామంటే’
‘మొద్దు నిద్ర నాది. థాంక్యూ.. మీకు నేను నూట ముప్పై ఆరు రూపాయలు బాకీ. ఇందాకిచ్చిన చిల్లరతో కలిపి’ టిక్కెట్టు తీసుకుంటూ గమనించింది అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు. అతని భార్య పేరు కావొచ్చు.     

రాజమండ్రి దాటింది. మాటల్లో మునిగిపోయారు. చలం సాహిత్యం నుంచి రఫీ పాటల మీదుగా, కోఠీలో చవగ్గా దొరికే చిన్నా చితకా వస్తువులని దాటుకుని, హుస్సేన్‌ సాగర్‌ లో బుద్ధుడిని పలకరించి భీమిలి బీచ్‌లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది. అలాగే కూర్చున్నారు ఇద్దరూ. అప్పుడప్పుడు ఆమె జుత్తు అతని ముఖం మీద పడుతోంది. ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది. ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం. రేపటికి ఏదో భరోసా దొరికిన భావన. మన తప్పొప్పుల్ని వివరించి చేప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్లుంది ఇద్దరికీ!

ముఖం కడుక్కుంటూ అద్దంలో తనని తాను చూసుకున్నాడు. ఏదో కొత్తగా మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తోంది. అద్దంలో దూరంగా అతని వెనక ఆమె. వెళ్లాల్సిన చోటు దగ్గరవడంతో బ్యాగ్‌ సర్దుకుంటోంది. ఉన్నట్టుండి గుర్తొచ్చింది.. ఆమె పేరైనా అడగలేదు. బండి ఆగింది. దిగి నడుస్తోంది. వెనక్కి తిరిగి చూడలేదు ఆమె. వర్షపు నీటిగుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంది.
‘ ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. ఎంతో యేమో యెవరికి దెలుసునో?’ అన్నవరం స్టేషన్లో టీ కొట్లోంచి త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది. వింటున్న ఆమెలో తృప్తి్తతో కూడిన చిన్న చిరునవ్వు. 
అతను తన మరదలికి ఫోన్‌ చేశాడు. లేచినట్టు లేదు ఇంకా. పుస్తకం తెరిచాడు.. రెండు వంద నోట్లు. బాకీ  తీర్చేసింది కాబోలు. ఆమె సగం పూర్తి చేసిన పజిల్‌ పూర్తి చెయ్యడం ప్రారంభించాడు అతను. రైలు కదిలేసరికి ఆఖరు గడి పూర్తయింది.. ‘సీత’ అన్న అక్షరాలతో. బహుశా అతని తర్వాత కథ కావచ్చు. మెల్లగా ఆమె కనుమరుగైంది!!!!

-రవి మంత్రిప్రగడ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top