
కొందరు ఎప్పుడూ ఆడుతూపాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలాగే కనిపిస్తుంటారు. పైగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేంత ధైర్యాన్ని కనబరుస్తుంటారు. తమ మానసిక బలంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తాము విజయం సాధిస్తే మరీ మంచిది. ఒకవేళ సాధించలేకపాయినా తమ ప్రయత్నం మాత్రం మానరు. ఇక మరికొందరు చిన్న చిన్న సమస్యకే డీలాపడిపాతుంటారు. కిందా మీదా పడుతూ ఎంతో ప్రయాస పడుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ల మాటల్లో ఆందోళన, నిరుత్సాహం, చిరాకు, చికాకూ అన్నీ కనిపిస్తుంటాయి. అందరూ మనుషులే.. అయితే వాళ్ల మధ్య ఈ వ్యత్యాసాలెలా కనిపిస్తున్నాయి? ఈ తేడాలెందుకున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కరికి ఐక్యూలలో తేడాలున్నట్టే... వాళ్ల ఎమోషన్ కోషియెంట్ (ఈక్యూ)లలో ఉన్న తేడాల వల్ల. ఎమోషనల్ కోషియెంట్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి... వంటి అనేక అంశాలను తెలిపేదే ఈ కథనం.
ఐన్‌స్టైన్ చాలా మేధావి అనీ, అతడి ఐక్యూ సాధారణ జనాల ఐక్యూ కంటే చాలా ఎక్కువనే మాట వినే ఉంటారు. ఐక్యూ వల్ల తెలివితేటలు బాగానే ఉండవచ్చు. కానీ జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనది ఎమోషనల్ కోషియెంట్. అలాంటి ‘ఈక్యూ’ గురించి తెలుసుకుందాం.
ఎమోషనల్ ఎపిడమిక్...
ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వంటి వాటి వల్ల అనేక చోట్ల ఒక్కసారిగా వ్యాధులు పెచ్చరిల్లి వ్యాప్తిచెందుతూ ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటారు కదా. మరి ఇప్పుడున్న వాతావరణంలో ఎమోషన్ ఎపిడమిక్ అనే పరిస్థితి నెలకొని ఉందని అనుకోవచ్చు. అసలు ఎమోషనల్ ఎపిడమిక్ అంటే ఏమిటో చూద్దాం. ఈ మధ్యకాలంలో మన సమాజంలో అనేక రకాల మానవ సంబంధాలకు (రిలేషన్‌షిప్‌ప్రాబ్లమ్స్‌కు) సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి.
సంక్లిష్టమైన ఈ మానవ సంబంధాలతో వచ్చే మానసిక వేదనలూ, దౌర్బల్యాలూ, కుంగుబాట్ల వల్ల అనేక అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కుటుంబ కలహాలు... భార్యాభర్తలు, తల్లిదండ్రులు–పిల్లలూ, అన్నాచెల్లెళ్లూ, అక్కా తమ్ముళ్లూ... స్నేహితులూ, ఇతరుల మధ్య... దాదాపుగా ఇలాంటి సమస్యలు లేనివారంటూ ఉండరనే చెప్పవచ్చు. కాకపోతే వాటి తీవ్రతలోనే తేడా ఉంటే ఉండవచ్చుగానీ... సమస్యలంటూ లేనివారు ఉండరు. ఇలా అన్నిచోట్లా ఇలాంటి మానసిక సమస్యలు పెచ్చరిల్లి మానవ సంబంధాలు ప్రభావితం కావడాన్ని ‘ఎమోషనల్ ఎపిడెమిక్’గా చెప్పవచ్చు.
ఈ ఎమోషనల్ ఎపిడమిక్‌కు కారణం... మనం, చదువుకూ, డబ్బుకూ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్వేగాలకు అతీతంగా స్థిరంగా ఉండటానికి... అంటే ‘ఎమోషనల్ డెవలప్‌మెంట్’కు ఇవ్వకపోవడమే. దాంతో క్షణికోద్రేకాలు... వాటి కారణంగా ఘర్షణలూ, కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యల వంటివీ చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మనుషుల్లో ఐక్యూలాగా... ఈక్యూను అంటే ఎమోషనల్ కోషియెంట్‌ను కూడా పెంపోందించుకోవాలన్న దృష్టి కొరవడటం. అందుకే ఇప్పుడు స్కూలు పిల్లల చదువులలో ఐక్యూతో పాటు ఈక్యూనూ పెంచడంతోపాటు చిన్నప్పట్నుంచే పిల్లలకు ఈక్యూ కూడా పెంపోందేలా చూడటం అవసరం.
భావోద్వేగ మేధాశక్తి అంటే ఏమిటి?
ఏదైనా ఓ మానసిక స్థితి తాత్కాలికంగా కొనసాగడాన్ని ఉద్వేగం లేదా ఎమోషన్ అంటారు. అదే మానసిక స్థితి చాలా ఎక్కుసేపు కొనసాగితే దాన్ని ‘మూడ్’ అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు బాధ పడటం ఒక మానసిక స్థితి. దాన్ని ఒక డిప్రెసివ్ ఎమోషన్‌గా చెప్పవచ్చు. అయితే అదే బాధ అలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే దాన్ని ‘డిప్రెస్‌డ్ మూడ్’ అంటారు. రోజుల తరబడి అదే బాధ నిత్యం ఉంటే అది మూడ్ డిజార్డర్ అవుతుంది. బాధ, సంతోషం, దిగులు, ఆందోళన, భయం, కోపం, ప్రేమ, ఉత్సాహం... ఇవన్నీ మనందరిలోనూ రకరకాల సమయాల్లో కలిగే మానసిక స్థితులు. వాటినే భావోద్వేగ స్థితులుగా చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన భావోద్వేగాలను సరైన రీతిలో ప్రదర్శించడాన్ని ‘భావోద్వేగ మేధాశక్తి’గా చెప్పవచ్చు.
ఉదాహరణకు చాలా పెద్ద పోరబాటు జరిగినప్పుడు ఆ సమయంలో (అంటే తగిన సమయంలో) తగిన రీతిలో కోపం ప్రదర్శించినప్పుడు అది తనకూ, ఇతరులకు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది. అయితే అదే కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే అది వారికి తీరని నష్టం కలగజేయవచ్చు. అతడితో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంటే... తన భావోగ్వేగ మేధాశక్తిని సమర్థంగా తగిన రీతిలో సరైన రీతిలో ఉపయోగపడేలా చేసుకోవడమే ఇక్కడ ప్రయోజన్ని ఇస్తుందని గుర్తించాలి. ఇలా ఎప్పుడు ఏ రకమైన ఉద్వేగాన్ని, ఎంత మేరకు, ఏ పరిమితుల్లో ఉపయోగించాలన్నదే ‘ఈక్యూ’గా చెప్పవచ్చు.
భావోద్వేగ మేధాశక్తి (ఈక్యూ) ఉన్నవారి లక్షణాలివి...
ఎప్పుడూ సంతోషంగా కనిపించడం...
తమ భావోద్వేగాలను ఎప్పుడూ తమ అదుపులో ఉంచుకోవడం,
ఇతరుల భావోద్వేగాలనూ గుర్తించగలగడం. వాటిని గుర్తెరిగి వాటికి అనుగుణంగా ప్రవర్తించడం.
అవసరమైనప్పుడు ఇతరుల భావోద్వేగాలను సైతం తాను నియంత్రిస్తూ, వారిని సంతోషపరచడం లేదా పరిస్థితులు వారికి అనుగుణంగా ఉండేలా మార్చగలగడం.
అవసరాన్ని బట్టి తన లక్ష్యం కోసం కొన్ని తన సుఖాలను తాత్కాలికంగా వాయిదా వేయడం. అలా తన తక్షణ సుఖాలను వాయిదా వేయడం వల్ల కూడా తాను సంతోషం పోందగలగడం.
సమర్థమైన నాయకత్వ లక్షణాలూ అలాగే మంచి సంభాణాచాతుర్యం.
ఓటమికి భయపడకపోవడం, కుంగిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది తక్షణం ఆలోచించగలగడం.ఈక్యూ తాలూకు లక్షణాల వల్ల కలిగే ఫలితాలు...
ఇలాంటివారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఒక పాఠంగా తీసుకుని ప్రస్తుతంలో జీవిస్తారు. జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడుపుతారు. దాంతో గెలుపూ, సంతోషం ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి.
అతడితో సమయం గడపడానికి అందరూ ఇష్టపడుతుంటారు. తనతో ఉన్నవారినీ సంతోషపెడుతూ ఈ ఈక్యూ ఎక్కువగా ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకుడుగా ఉంటాడు.
∙సమర్థమైన నాయకుడిగా ఎదుగుతాడు. తొలుత కుటుంబానికీ, ఆ తర్వాత సమాజానికీ నేతృత్వం వహిస్తుంటాడు.
ఈక్యూను (భావోద్వేగ మేధాశక్తిని) పెంచుకోవడం ఎలా...?
ఈక్యూ (భావోద్వేగ మేధాశక్తి)ని అభివృద్ధి చేసుకోడానికి ముందర... ముఖ్యంగా అదెలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి.
భావోద్వేగ మేధాశక్తికి మొదటి పునాదులు అర్లీ ఛైల్డ్‌హుడ్ టైమ్‌లో పడి అప్పట్నుంచి 18 ఏళ్ల వయసు వరకు వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఆ తర్వాత కూడా ఈక్యూ పెరుగుతుంటుంది కానీ... అర్లీ ఛైల్డ్‌హుడ్ నుంచి 18 ఏళ్ల వరకు జరిగినంత వేగంగా ఆ అభివృద్ధి జరగదు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రుల, సమాజంలోని ఇతరుల ప్రవర్తన, తాము ఎదిగిన పరిస్థితులు... ఇవన్నీ పిల్లల భావోద్వేగ మేధాశక్తిపై ప్రభావం చూపుతాయి.
∙మెదడులో చిన్నప్పుడు ΄్లాస్టిసిటీ అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే... దాన్ని ఏరకంగా మలిస్తే మెదడులో స్వభావాలను ఏర్పరచుకునే తత్వం / పరిస్థితి ఆ రకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ స్వభావం లేదా గుణం మనం ఎదిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. అందుకే ‘మొక్కై వంగనిది, మానై వంగునా’ అనే సామెత భావోద్వేగ మేధాశక్తి విషయంలో అక్షర సత్యమని చెప్పవచ్చు.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్... తల్లిదండ్రుల పాత్ర...
తల్లిదండ్రులు కేవలం పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టినంత మాత్రాన సరిపోదని గుర్తించాలి. నిజానికి వారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశమేమిటంటే... తమ పిల్లలు ఎదుటివారిలో మెలిగేప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ల ప్రవర్తనలో తేడాలుంటే ఎలా చక్కదిద్దాలి... అలాగే విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనేందుకు వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు లేదా వ్యూహమేమిటి, వాటిని పరిష్కరించడానికి వాళ్లు ఎదుర్కొంటున్న మార్గాలేమిటి అని చూడాలి. అవి చాలా చిన్న చిన్న అంశాలే కావచ్చు. ఉదాహరణకు ఏదైనా ఓ కారణంతో ఓ చిన్నారి తన హోమ్‌వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు.
ఆ వయసుకు అతడికి అదే విపత్కరమైన పరిస్థితి. దాన్ని అతడు ఎలా ఎదుర్కొంటున్నాడు అన్నది తల్లిదండ్రులు గమనించాలి. కడుపునొప్పి లేదా ఇతరత్రా వంక పెట్టి ఆ రోజుకు స్కూల్ మానేయాలని చూస్తున్నాడా లేదా తగిన (కన్విన్సింగ్) జవాబును సిద్ధం చేసుకుని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాడా అన్నది తల్లిదండ్రులు చూడాల్సిన అంశం. ఒకవేళ అతడు స్కూల్ మానాలని అనుకుంటే... అది సరికాదనీ... టీచర్ అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పమనీ, ‘‘ముందు నువ్వు ఈ విషయం ఇలా చెప్పు. ఒకవేళ ఆయన వినకపోతే మేమూ స్కూల్‌కు వచ్చి కన్విన్స్ చేస్తా’’మంటూ పిల్లలను పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి.
ఇది చిన్నపిల్లల విషయంలో జరగాల్సిన పనికి ఓ ఉదాహరణ. పరిస్థితులను బట్టి ఇలాంటివే పిల్లలు ఎదుర్కొనేలా తలిదండ్రులు ధైర్య, స్థైర్యాలను తమ పిల్లల్లో పాదుకునేలా చూడాలి. నిజానికి చదువు కంటే... భవిష్యత్తులో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఎదుర్కోడానికి ఇలాంటి పాఠాలే చాలా అవసరమని గుర్తించాలి. లోకంలోని అనేక పరిస్థితులను ఎదుర్కోడానికి ఐక్యూ కంటే కూడా ఈక్యూనే ప్రధానం.
ఇక అవసరమైన చోట ఓపిగ్గా ఉండటాన్ని అభ్యాసం చేయించాలి. ఓరిమితో ఉండటం క్షమాగుణాన్నీ పెంపోందిస్తుంది. క్షమాగుణం వల్ల గొడవలు తగ్గి చాలా ప్రశాంతంగా హాయిగా జీవించడం సాధ్యమవుతుంది.
ఎదుటివారిలో మంచి కనిపించినప్పుడు దాన్ని గుర్తించి అభినందించే మనస్తత్వాన్ని అభ్యాసం చేయిస్తే... ఈర్ష్య తగ్గి చాలా ప్రశాంతతతో జీవించే గుణం అలవడుతుంది.
ప్రతికూల ప్రవర్తనలతో ఈక్యూ తగ్గిన సందర్భాల్లో...
తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ తిడుతూ, ఇతరులతో పోల్చి వారిని నిందిస్తూ ఉంటే పిల్లలు కూడా తమ తప్పులకు ఇతరులను బాధ్యులు అనుకోవడం, అందుకు వారిని దూషించడం, నిందించడం నేర్చుకుంటారు. ఇది అదేపనిగా కొనసాగడం వల్ల ద్వేషించడాన్ని కొనసాగిస్తుంటారు. ఇక మరికొందరు పెద్దవాళ్ల చేత అదేపనిగా ఎగతాళికి గురవుతుంటే ఆ పిల్లలు బిడియస్తులుగా, పిరికివారుగా తయారవుతారు. మరికొందరు అవమానం కారణంగా నేరస్వభావాన్ని పెంచుకుంటారు. అందుకే పిల్లలకు ఈక్యూ నేర్పడంలో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా కీలకం.
భావోద్వేగ మేధాశక్తితో కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
భావోద్వేగ మేధాశక్తి ఉన్నవారికి మానసిక సమస్యలు చాలా తక్కువ.
వారిలో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అదే ఒకసారి గుండెపోటు వచ్చిన వ్యక్తికి డిప్రెషన్ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు 3.5 రెట్లు అధికం.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మనలోని ఉద్వేగ మేధా
శక్తిని (ఈక్యూను) నిరంతర సాధనతో పెంచుకుంటూ ఉండటంతో పాటు... ఆ ప్రభావం ఎదుటివారికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం (దీన్నే మానసిక విశ్లేషకులు ‘విన్ – విన్ సిచ్యు
వేషన్’ అంటుంటారు) వల్ల మానవ సంబంధాలు మెరుగుపడటంతో పాటు మరింత మంచి సమాజం ఏర్పడుతుందన్నది చాలామంది మానసిక వైద్యులూ, శాస్త్రవేత్తల మాట.
ఈక్యూ ఎందుకంటే...
మేధాశక్తి (ఇంటెలిజెన్స్)ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి విషయ సంబంధమైన పరిజ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి సంబంధించినది. విషయసంబంధమైన మేధాశక్తిని ఇంటెలిజెన్స్ కోషియెన్స్ (ఐక్యూ) ద్వారా చెబుతారు. రెండోది భావోద్వేగ మేధాశక్తి. దీనినే ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అంటారు. భావోద్వేగ మేధాశక్తి ద్వారా ఈక్యూను అంచనా వేస్తారు. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, ఇతరులతో చక్కటి సంబంధాలను ఏర్పరచుకోడానికి భావోద్వేగ మేధాశక్తి ఎంతో కీలకం. మరెంతో అవసరం. తెలివితేటలు, చదువు, విషయపరిజ్ఞానం వంటి ఎన్నో అంశాలు ఉండి కూడా కొందరు సమస్యలను ఎదుర్కునేలా అంతగా మానసిక దృఢత్వం లేకపోవడానికీ, ఢక్కాముక్కీలు తిన్నవారిలా కాకుండా సమస్యకు తేలిగ్గా లొంగిపొయి, బెదిరిపోవడానికి కారణం ఈక్యూ తక్కువగా ఉండటమే.