 
													ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ కార్యాన్నిప్రారంభించాలన్నా ముందుగా ఆయననే పూజించాలి. అప్పుడే ఆ కార్యం శుభప్రదం, శోభస్కరం.. ఆ తర్వాత జయప్రదం అవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు.
ఓం గణానాతాం త్వా గణపతిగ్‌ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
అనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్
రాజులలో జ్యేష్ఠుడు, కవులలో కవి, గణాలకు అధిపతి, బ్రహ్మణస్పతి అని వేదాలు ఆయనను స్తుతిస్తే, మంత్రశాస్త్రాలు సుముఖుడనీ ఏకదంతుడనీ, కపిలుడనీ, గణాధ్యక్షుడనీ, గజకర్ణికుడనీ, వికషుడనీ, ఫాలచంద్రుడనీ, ధూమకేతువనీ, గజకర్ణికుడనీ విష్వక్సేనుడనీ, శూర్పకర్ణికుడనీ అన్నాయి. అంతగా ఆరాధించాయి. ఇక ఉపనిషత్తులయితే వాఙ్మయమూర్తిగా.. గణపతిగా... బ్రహ్మణస్పతిగా.. శ్రీ మహాగణాధిపతిగా విశ్వసించాయి. నిండుగా కొలిచాయి. గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. 
గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వ విఘ్నాలూ ఉపశమిస్తాయి. అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల పుష్పాలు, పత్రాలతోటీ పూజించి, అరటిపళ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, వెలగ పళ్లు, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తే చాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా ప్రసన్న గణపతి... వల్లభ గణపతీ ఆయన. 
ఎలా పూజించాలి?
ఏ పూజలోనైనా ముందుగా హరిద్రాగణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది. వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు. 21 రకాల పత్రి లభ్యం కానప్పుడు గరిక దొరికినా ప్రసన్నుడవుతాడు. రక రకాల నైవేద్యాలు సమర్పించలేకున్నా నారికేళం, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు ఉంటే చాలంటాడు. 
ఈ కింది శ్లోకం చదివితే చతుర్థీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.
సింహః ప్రసేనమవధీః సింహా జాంబవతా హతేః
సుకుమారక మారోదీః తవహ్యేషçశ్యమంతకః
ఏమి నివేదించాలి?
వినాయకచవితిరోజు గణపతిని షోడశోపచారాలతో పూజించి, శక్తికొద్దీ ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, నారికేళాలు, కదళీఫలాలు, పానకం, వడపప్పులను నివేదిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది.
పాలవెల్లి ఎందుకు..?
ఆకాశంలో గ్రహాలూ నక్షత్రాలూ ఉంటాయనే యథార్థాన్ని గుర్తింపజేసేందుకే, భాద్రపదమాసంలో విరివిగా లభించే పాలవెల్లికి నిండుగా మొక్కజొన్న ΄÷త్తులూ, వెలక్కాయలూ, బత్తాయిలూ... వీటన్నింటినీ కడతారు.
నిమజ్జనమెందుకు?
భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికిప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి విఘ్నాలనూ దూరం చేయాలని, కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. అన్నట్లు పూజకు మట్టి వినాయకుడినే తెస్తున్నారు గదా!
పత్రి అంటే ఎందుకంత ప్రీతి?
కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. అంతేకాదు... మునుల కోరిక మేరకు అగ్నితత్త్వం గల అనలాసురుడనే రాక్షసుని ఉండలా చేసి గుటుక్కున మింగాడాయన. లోపల చేరిన ఆ రాక్షసుడు తన మంటలతో ఆయన ఉదరాన్ని బాధించకుండా  చల్లదనాన్ని చేకూర్చడం కోసమే మునులు ఆయనను అనేక రకాల ఔషధ విలువలు గల పత్రితోటీ, పుష్పాలతోటీ పూజించి, మరింత ఉపశమనాన్ని కలిగించడం కోసం గరికతో తాళ్లలా పేని ఆయన ΄÷ట్ట చుట్టూ పట్టీలా కట్టారు. ఆ ఉపచారాలన్నీ ఆయనకు అమితంగా నచ్చి, ఆ నాటినుంచి ప్రతియేటా తనను పత్రితోటీ, పుష్పాలతోటీ, ముఖ్యంగా గరిక΄ోచలతో పూజించిన వారికి కోరిన వరాలనిచ్చే వేల్పు అయ్యాడాయన.
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
