
పలు మెట్రో నగరాల్లోనూ పెరుగుతున్న ఫ్యాన్స్
సరికొత్త ట్రెండ్‌గా తెలుగు జానపద గేయాలు
టాప్ ట్రెండింగ్‌లో కొన్ని తెలుగు ఆణిముత్యాలు
సోషల్ మీడియాలో అత్యధిక మానిటైజేషన్
సోషల్ సెలబ్రిటీలుగా మారుతున్న ఫోక్ ఆర్టిస్టులు
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్‌గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్‌గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్‌సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్‌కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం.
అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్‌లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్‌గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్‌ప్‌తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్‌లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్‌లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి.
వైరల్‌గా మారిన ఈ ఫోక్ సాంగ్స్‌లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్‌తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్‌షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో వైరల్ అయినవి..
కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్‌లో, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్‌స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్‌లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్‌కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి.
ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి.
కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్‌స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్‌లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్‌షాప్లలో హైలైట్‌గా నిలిచింది.
రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్‌గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్‌గా మారింది.
లైఫ్‌స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్..
ఈ పాటలు గతంలో టిక్‌టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్‌కట్, ఇన్‌స్టాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్‌ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్‌స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్‌తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్‌లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్‌స్టైల్ ఈవెంట్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్‌ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్‌సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు.