పూజలు చేశాం.. నా కోరిక నెరవేరింది.. చిట్టి పాదాల పారాణి ముద్రలతో ఘన స్వాగతం! మనసుకు హాయి..

Telangana Mahabubabad: Grand Welcome For New Born Girl Child - Sakshi

‘ఆడపిల్ల’కు స్వాగతం.. మా ఇంటి మహాలక్ష్మి 

మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లపుట్టిందని సంబరం చేశారు.  ఇంట్లోకి పూలతో రహదారి పరిచారు. చిట్టి పాదాల పారాణి ముద్రలు వేశారు.  అమ్మాయి పుడితే ఇలా స్వాగతం పలకండి. 

‘ఆడదే ఆధారం... మన కథ ఆడనే ఆరంభం...’ అంటూ పాడుకునే నేల మనది. ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్ల గింజలు వేసిన నేల కూడా ఇది. తల్లి గర్భంలోనే శిశువును గుర్తించి పుట్టకముందే ప్రాణం తీస్తున్న పాపాలకూ కొదవలేదు. ఇక ఆడపిల్లను కన్నతల్లికి ఎదురయ్యే కష్టాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడపిల్ల పుట్టింది... అనగానే కోడలిపై చిర్రుబుర్రులాడే అత్తలు, భార్య–బిడ్డల ముఖం చూడని మగవాళ్లు ఉన్న సమాజం మనది.

ఇన్ని దారుణాల మధ్య ఓ సంతోషవీచిక వెల్లివిరిసింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియనే పండుగ చేసుకున్నారు. ఊరూ వాడా అందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు. అమ్మమ్మగారింట్లో రెండు నెలలు పూర్తి చేసుకున్న బిడ్డ మూడవ నెల నానమ్మ దగ్గరకు ప్రయాణమైంది.

ఆ బిడ్డనెత్తుకుని అత్తగారింటికి వచ్చిన తల్లికి పూలబాట పరిచారు అత్తింటివాళ్లు. పాపకు ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డ పుట్టడం అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమేనన్నారు. ఆదర్శంగా నిలిచిన కుటుంబం తెలంగాణ, మహబూబాబాద్‌ జిల్లాలో ఉంది. కే సముద్రం మండలం, తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడగంటి శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతుల ఆదర్శవంతమైన ఆత్మీయత ఇది. 

పాపాయి కోసం పూజలు 
కోడలు గర్భిణి అని తెలియగానే మగ పిల్లవాడు పుట్టాలని అనుకుంటారు. కానీ భద్రకాళి కుటుంబీకులు మాత్రం ఆడపిల్ల కావాలని పూజలు చేశారు. వాళ్ల పెద్దకొడుకు సాయి కిరణ్‌కు సిరిసిల్ల పట్టణానికి చెందిన సంహితతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.

సంహిత నెలతప్పినప్పటి నుంచి భద్రకాళితోపాటు ఆమె తోడికోడలు సుమ, మరదలు రమ్య కూడా ఆడపిల్లలు పుట్టాలని వ్రతాలు, పూజలు చేశారు. వాళ్లందరికీ మగపిల్లలే. ఈ తరంలోనైనా ఇంట్లో ఆడపిల్ల కావాలని వాళ్ల కోరిక. ప్రసవం రోజు వరంగల్‌లో ఆసుపత్రికి ఇంటిల్లిపాది తరలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంతోషంగా కేకలు వేస్తూ, హాస్పిటల్‌లో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.  

అపూర్వ స్వాగతం 
కోడలు పుట్టింటికి వచ్చిన రోజు ఇంటిని పూలతో అలంకరించారు. ముత్తయిదువలతో స్వాగతం పలికారు. చిన్నపాప కాళ్లకు పారాణి రాసి తొలి అడుగుల గుర్తులు నట్టింట్లో ముద్రించుకున్నారు. ఆ అడుగులను కళ్లకు అద్దుకున్నారు. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచి ఉండడానికి ఫొటోలు తీశారు.  

నా కోరిక తీరింది 
నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టం. మా వారు కూడా ఆడపిల్ల ఉన్న ఇంటి అందమే వేరు అంటూ ఉంటారు. అందుకోసమే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడ పిల్లలను ప్రతి పండుగకు పిలుస్తాం. వారు చేసే సందడి చూసి సంబుర పడుతాం. మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనే కోరిక నెరవేరింది. అందుకోసమే అలా స్వాగతం పలికాం.  – భద్రకాళి, పాపాయి నానమ్మ 
– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top