
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపు మేరకు 2009 నుంచి ఫిబ్రవరి 20వ తేదీన ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవా’న్ని జరుపుతున్నారు. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించడానికీ; పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించడం దీని వెనుక ఉన్న లక్ష్యం.
ఈ ఏడాది ఉత్సవం సందర్భంగా... విద్యార్థులకు పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి వంటి సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతి, లింగ, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటివాటిలో పక్షపాతం వల్ల ఈ అసమానతలు ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేక పోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ముఖ్యమైనవి. 2024 నాటికి, సామాజిక న్యాయం అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు: స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఐర్లాండ్. మానవ హక్కులు లేకపోవడం, న్యాయం పొందడం కష్టమవ్వడం, అవినీతి రాజ్యమేలడం వంటి అంశాల్లో ముందున్న దేశాలు వెనిజులా, కంబోడియా, అఫ్గానిస్తాన్, హైతీ, మయన్మార్‌లు.
భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి అపారమైనది. అందుకే ‘భారత సామాజిక న్యాయ పితామహుని’గా అంబేడ్కర్‌ను గౌరవించుకుంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయాన్ని సూచిస్తోంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశా లను పేర్కొనాలి:
ఒకటి – ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక–ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛా సూత్రాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది,
రెండవది–సామాజిక–ఆర్థిక అభివృద్ధి మధ్య, విరుద్ధమైన సామాజిక– ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన సంతులనాన్ని సాధించే నమూనాను అవలంబించడం.
మూడవది – భారతీయ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు నిశ్చయాత్మక చర్యలను అందించడం.
ఇందుకోసం దేశంలో ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేయడం.
– డా. పి.ఎస్. చారి ‘ 83090 82823
(ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం)