
స్ఫూర్తి
ఆకాశమంతా నాదే... అంటూ విహరించే విహంగాన్ని ఒక మూల పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుంది! స్మిను జిందాల్‌కు కూడా అలాగే అనిపించింది. పదకొండు సంవత్సరాల వయసులో యాక్సిడెంట్‌కు గురైంది. అలా అని వీల్‌చైర్‌కే పరిమితం కాలేదు. ఎన్నో పరిమితులు అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగింది. ‘ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్–2025’ జాబితాలో చోటు సాధించింది...
దిల్లీలో ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తయిన తరువాత జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మకమైన మహారాణి గాయత్రీ దేవి స్కూల్‌లో చేరిన స్మిను కారు ప్రమాదంలో ప్రాణా పాయం నుంచి బయటపడింది. చదువు, ఆటలు, పాటలతో ఎప్పుడూ చురుగ్గా ఉండే అమ్మాయికి కొన్ని నెలల పాటు వీల్‌చైర్‌కే పరిమితం కావడం సంకెళ్లతో బంధించినట్లుగా అనిపించింది. తన రెక్కలు ఎవరో కత్తిరించినట్లుగా అనిపించింది.
స్మినుకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కథక్ నృత్యంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘ఇక నేను డ్యాన్స్ చేయలేనా?’ అనే బాధ ఉండేది. అయితే తల్లిదండ్రులు మాత్రం ‘నీకేం జరగలేదు. అన్నీ సర్దుకుంటాయి’ అంటూ ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్మినులో ఆత్మవిశ్వాసం పెంచేలా ఎంతోమంది వ్యక్తుల నిజజీవిత గాథలు చెబుతుండేది తల్లి ఆర్తి. బిడ్డను నార్మల్ స్కూల్‌కే పంపించేది. ‘అమ్మానాన్నలు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.
అలా అని అతి గారాబం చేసేవారు కాదు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది స్మిను. కొంతకాలం తరువాత తల్లిదండ్రులు స్మిను కోసం ఒక మెషిన్ తీసుకువచ్చారు. ఆ మెషిన్ సహాయంతో రోజుకు కొన్ని గంటలు నిలబడేది. దిల్లీలోని శ్రీరామ్ కాలేజి ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ చేసిన స్మిను ‘జిందాల్ సా లిమిటెడ్’లో మేనేజ్‌మెంట్ ట్రైనీ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది. స్మిను జిందాల్ పేరు పక్కన ‘ప్రముఖ పారిశ్రామికవేత్త’ అనే గౌరవం రావడానికి ఎంతోకాలం పట్టలేదు.
దివ్యాంగులకు దిశానిర్దేశం, సహాయపడడం లక్ష్యంగా ‘స్వయం’ అనే సంస్థను ప్రారంభించింది. ప్రభుత్వసంస్థలు, విద్యాసంస్థలు, రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది స్వయం. ‘దివ్యాంగులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి గురించి చాలామందికి తెలియదు. స్వయం పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ఉపయోగడే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నాం.
టూరిజం, స్పోర్ట్స్, శానిటేషన్... మొదలైన రంగాలలో ఇప్పుడు స్వయం పనిచేస్తోంది’ అంటుంది స్మిను. దివ్యాంగులకు మాత్రమే కాదు వృద్ధులు, గర్భిణులు... మొదలైనవారికి ‘స్వయం’ సహాయపడుతోంది. ‘విమానాశ్రయాలు, హోటల్స్, స్టేడియంలాంటి ఎన్నో బహిరంగ ప్రదేశాలలో దివ్యాంగులకు కనీస సదు పాయాలు లేవు’ అంటున్న స్మిను జిందాల్ ‘యాక్సెసబిలిటీ చాంపియన్’గా పేరు తెచ్చుకుంది.
‘క్షణం తీరిక లేని వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు?’ అనే ప్రశ్నకు జిందాల్ ఇచ్చిన సమాధానం... ‘పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పనే పాషన్‌గా మారినప్పుడు అలసటగా అనిపించదు. నన్ను అర్థం చేసుకునే కుటుంబం దొరకడం నా అదృష్టం. సరిౖయెన ప్రణాళిక ఉంటే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కష్టమేమీ కాదు’.
ఎన్నో సవాళ్లు... అయినా సరే...
ఒకటి రెండు అని కాదు... ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. యాక్సిడెంట్ తరువాత జీవనశైలిని పునర్నిర్మించుకోవడం నుంచి పురుషాధిపత్య రంగాలుగా భావించే స్టీల్, ఆయిల్, గ్యాస్ సెక్టార్‌లలో విజయం సాధించడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నన్ను ప్రోత్సహించిన వారే కాదు నిరాశ పరిచిన వారు కూడా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తోడ్పడ్డారు. ‘నీ వల్ల కాదు’ అని ఎవరైనా అంటే ఆ మాటలను సవాలుగా తీసుకొని చేసి చూపించేదాన్ని.
– స్మిను జిందాల్