షూజియా షూ లాండ్రీ.. కొత్త తరహా ఉపాధి

Shazia Qaiser Shoe Laundry - Sakshi

కొత్త ఉపాధి 

జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్‌. 

బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్‌ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్‌ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్‌ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది.  

బూట్లు ఉతికే లాండ్రి
ఓ రోజు మ్యాగజీన్‌ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే  లాండ్రి సర్వీస్‌ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్‌ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్‌ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్‌ గురించి పూర్తిగా స్టడీ చేసింది.

ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్‌ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది.

దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్‌ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్‌స్టార్టప్‌’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్‌ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్‌ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్‌లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. 

రంగు వెలిసినా...
షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లను రిపేర్‌ చేయడంతోపాటు  షూస్‌ను ఆవిరి మెషిన్‌ మీద శుభ్రం చేసి ఇస్తుంది.  
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top