అంతరించిపోయే స్టేజ్‌లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | Bananas At Risk Of Extinction Due To Fungus Outbreak, Warn Scientists - Sakshi
Sakshi News home page

అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published Thu, Oct 26 2023 12:26 PM

Scientists Warns Bananas At Risk Of Extinction Due To Fungus  - Sakshi

కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్‌లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్‌ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!.

పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్‌లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్‌ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్‌ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు.

ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్‌ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్‌ ఆఫ్‌ ది ఫ్రూట్‌ దట్‌ చేంజ్‌ ది వరల్డ్‌" అనే పుస్తకంలో రచయిత డాన్‌ కోపెల్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్‌ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ కావెండిష్‌ రకం పండ్లను 1989లో తైవాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్‌, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ప్రోఫెసర్‌ జేమ్స​ డేల్‌ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్‌ మిచెల్‌ అనే రకం అరటిపండుకి టీఆర్‌ 4 అనే తెగులు వచ్చింది.

దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్‌ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్‌ మిచెల్‌లా కావెండిష్‌ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని,  ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. 

(చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..)

Advertisement
Advertisement