కబడ్డీ... కబడ్డీ... | Sakshi
Sakshi News home page

కబడ్డీ... కబడ్డీ...

Published Tue, Feb 15 2022 12:11 AM

PT teacher to PKL match referee: Pro Kabaddi League referee Sandhiya MK - Sakshi

‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్‌ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు
కుతూహలం రేపుతోంది.


కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్‌ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్‌ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్‌ స్టేడియంలలోకి, లైవ్‌ టెలికాస్ట్‌లలోకి, స్పాన్సరర్‌ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది.

అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది.  2014లో ‘ప్రో కబడ్డీ లీగ్‌’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్‌ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్‌ 22 నుంచి సాగుతున్న సీజన్‌ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

కబడ్డీ ప్లేయర్‌
‘8వ తగతిలో ఉండగా మా స్కూల్‌ మైదానంలో కొంత మంది సీనియర్‌ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్‌లో చేరగానే సబ్‌ జూనియర్స్‌ నేషనల్‌ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్‌ నేషనల్‌ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది.

ప్రేమ పెళ్లి
సీనియర్‌ ఇంటర్‌లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్‌తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్‌కు సంధ్య టాలెంట్‌ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు.

కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్‌నెస్‌తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్‌ డైట్‌ కూడా ఫిక్స్‌ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య.

ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్‌లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు.

పిఈటీగా...
వెల్లూరులో స్ప్రింగ్‌ డేస్‌ స్కూల్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్‌ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్‌ లెవల్, ఇంటర్‌ జోన్‌ మేచ్‌లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్‌లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్‌ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య.

ప్రొ కబడ్డీ లీగ్‌ రిఫరీగా
ప్రో కబడ్డీ లీగ్‌ మేచెస్‌ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్‌ మేచెస్‌ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్‌ టెలికాస్ట్‌ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్‌ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి.

అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్‌ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్‌ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్‌ రిఫరీలు ఉంటారు. మెయిన్‌ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్‌లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్‌ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య.

మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య.

Advertisement
 
Advertisement